3 జిల్లాలుగా విశాఖ

ABN , First Publish Date - 2022-01-26T06:31:22+05:30 IST

కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

3 జిల్లాలుగా  విశాఖ

అదనంగా మరో రెండు...

అనకాపల్లి, అరకులోయ కేంద్రంగా నూతన జిల్లాలు

పార్లమెంట్‌ నియోజకవర్గాల కేంద్రంగా ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

అరకులోయ జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు


విశాఖపట్నం, జనవరి 25 (ఆంధ్రజ్యోతి):


కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం రాత్రి ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు నియోజకవర్గం ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటుకు గతంలో కసరత్తు జరిగిన సంగతి తెలిసిందే. దానినే ఇప్పుడు ఆమోదించారు. ఈ ప్రకారం చూసుకుంటే విశాఖ జిల్లా మూడు జిల్లాలుగా విడిపోనున్నది. అదనంగా రెండు కొత్త జిల్లాలు రానున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అరకులోయ  పార్లమెంటు నియోజకవర్గాలు కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పడతాయి. ప్రస్తుతం అరకులోయ పార్లమెంటరీ నియోజకవర్గం భౌగోళికంగా నాలుగు జిల్లాలకు విస్తరించి ఉంది. దాంతోఅరకు, పాడేరు, పొరుగునున్న రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి అరకులోయ జిల్లాగా ప్రకటించారు. దీనికి కొత్తగా అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయనున్నారు. ఏజెన్సీ నియోజకవర్గాలతో ఏర్పాటయ్యే జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఆ మేరకు ఆ జిల్లా పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం విశాఖపట్నం పార్లమెంటు పరిధిలోని ఎస్‌.కోట నియోజకవర్గాన్ని తీసుకువెళ్లి విజయనగరం జిల్లాలో కలిపేశారు. గతంలో అరకు పార్లమెంటు నియోజకవర్గంలో వున్న సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాలను కలిపి కొత్తగా పార్వతీపురం జిల్లాగా ఏర్పాటుచేయనున్నారు. అంటే అరకులోయ పార్లమెంటు స్థానం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాలుగా విడిపోయింది. 


కలెక్టర్‌లతో సీఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ఇదిలావుండగా కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల విభజన గురించి కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున వద్ద ప్రస్తావించగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ జరిగిందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించారన్నారు.


ప్రతిపాదిత జిల్లాలు...వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు

విశాఖపట్నం జిల్లా: భీమునిపట్నం, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాలతో పాటు గాజువాక...మొత్తం 6

అనకాపల్లి జిల్లా: అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, మాడుగుల, ఎలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట...మొత్తం ఏడు 

అరకులోయ జిల్లా: అరకులోయ, పాడేరు, రంపచోడవరం

Updated Date - 2022-01-26T06:31:22+05:30 IST