హార్టికల్చర్‌ ఆర్గానిక్‌ హబ్‌గా విశాఖ ఏజెన్సీ

ABN , First Publish Date - 2021-06-23T09:13:20+05:30 IST

విశాఖ ఏజెన్సీని సేంద్రియ ఉద్యాన (హార్టికల్చర్‌ ఆర్గానిక్‌) పంటల హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ తోలేటి జానకిరామ్‌ చెప్పారు

హార్టికల్చర్‌ ఆర్గానిక్‌ హబ్‌గా విశాఖ ఏజెన్సీ

అల్లం, పసుపు, మిరియాల నూతన వంగడాలపై పరిశోధనలు

లంబసింగి బ్రాండ్‌పై పనస జ్యూస్‌, చాక్లెట్‌ తయారీ 

ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ జానకిరామ్‌


చింతపల్లి, జూన్‌ 22: విశాఖ ఏజెన్సీని సేంద్రియ ఉద్యాన (హార్టికల్చర్‌ ఆర్గానిక్‌) పంటల హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ తోలేటి జానకిరామ్‌ చెప్పారు. చింతపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. మిరియాల నూతన వంగడాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మదర్‌ పాలీహౌ్‌సను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సుగంధ ద్రవ్యాలు, ఉద్యాన పంటల సాగుకు విశాఖ ఏజెన్సీ వాతావరణం, నేల అత్యంత అనుకూలమన్నారు. ఐటీడీఏ, ఉద్యానశాఖ సహకారంతో ఆదివాసీ రైతులతో సేంద్రియ పద్ధతిలో ఉద్యాన పంటలు పండించి, ప్రత్యేక బ్రాండ్‌ పేరిట మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పసుపు, అల్లం, మిరియాలు పంటల్లో అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన వంగడాల అభివృద్ధికి పరిశోధనలు నిర్వహిస్తున్నామని జానకిరామ్‌ అన్నారు. ప్రధానంగా మిరియాల్లో మేలుజాతి వంగడం అందించేందుకు ఏడు రకాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నామన్నారు. కాలికట్‌ సుగంధ ద్రవ్య పరిశోధన కేంద్రం నుంచి దిగుమతి చేసుకున్న థేవం-1 రకాన్ని ఇక్కడ అభివృద్ధి చేస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి రైతులకు మొక్కలు అందజేస్తామని తెలిపారు. ఈ రకం తెగుళ్లను తట్టుకోవడంతోపాటు అధిక దిగుబడి ఇస్తుందన్నారు. 


పనస జ్యూస్‌, చాక్లెట్ల తయారీ

గిరిజన ప్రాంతంలో ఆదివాసీ రైతులు పండించిన పనస పండ్ల నుంచి జ్యూస్‌, చాక్లెట్లు తయారు చేయించి లంబసింగి బ్రాండ్‌ పేరిట మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని జానకిరామ్‌ చెప్పారు. గిరిజన రైతులు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నప్పటికీ అధిక ఆదాయం పొందలేకపోతున్నారని, వారు పండించే పంటలకు విలువలు జోడించాలని నిర్ణయించామని అన్నారు. అలాగే రైతులకు పనస జామ్‌, చిప్స్‌ పిక్కలతో అప్పడాల తయారీపై శిక్షణ ఇస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో లభించే దేశవాళీ రకాల కూరగాయలు, ఉద్యాన పంటల విత్తనాల సేకరణ కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్‌ ఆర్‌వీఎ్‌సకే రెడ్డి, స్థానిక పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్‌ శివకుమార్‌, ఆర్‌ఏ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T09:13:20+05:30 IST