ఆతిథ్య రంగంపై నీలినీడలు

ABN , First Publish Date - 2020-06-03T10:01:53+05:30 IST

విశాఖపట్నంలో ఆతిథ్య రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ప్రజలు బయట ఆహారం తినడానికి ..

ఆతిథ్య రంగంపై నీలినీడలు

ఇప్పట్లో కోలుకునే అవకాశాలు తక్కువ

ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతి

రెస్టారెంట్లలో తగ్గనున్న సీటింగ్‌

ఆ మేరకైనా డిమాండ్‌ ఉంటుందో, లేదోనని అనుమానాలు

కొంతకాలం ఏదోవిధంగా నెట్టుకురావాలని భావిస్తున్న యాజమాన్యాలు

స్వగ్రామాలకు వెళ్లిపోయిన సిబ్బంది...సంక్రాంతి తరువాతే రాక


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఆతిథ్య రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ప్రజలు బయట ఆహారం తినడానికి ఇంతకు ముందులా కుటుంబంతో బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో వారాంతాల్లో సరదాగా బయటకు వచ్చి రెస్టారెంట్లలో లంచ్‌/డిన్నర్‌ చేసి వెళ్లేవారు. లాక్‌డౌన్‌కు ముందు ఈ సంస్కృతి ఎక్కువగా వుండడంతో రెస్టారెంట్లు కిటకిటలాడేవి.


టేబుల్‌ కోసం వెయిట్‌ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు కరోనా రాకతో పరిస్థితులు తలకిందులైపోయాయి. అత్యవసరమైన పని వుంటే తప్ప కుటుంబం మొత్తం బయటకు రావడం లేదు. పైగా ఏది పడితే అది కొనడానికి చాలామంది దగ్గర డబ్బులు కూడా లేవు. ఇటువంటి పరిస్థితుల్లో రెస్టారెంట్లు, హోటళ్లు ప్రారంభించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చునని, నిబంధనలు మాత్రం పాటించాలని సూచించింది. 


50 శాతం తగ్గనున్న సీటింగ్‌

రెస్టారెంట్లలో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడున్న సీటింగ్‌ సామర్థ్యాన్ని 50 శాతానికి తగ్గించుకోవాలని సూచించింది. అలాగే వినియోగదారులు వెళ్లిన వెంటనే వారు ఉపయోగించినవన్నీ శానిటైజ్‌ చేయాలని, ఆ పరిసరాలను శుభ్రం చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల యాజమాన్యాలు సీటింగ్‌ తగ్గిస్తున్నాయి. నలుగురు కూర్చొనే టేబుల్‌కు రెండు కుర్చీలు, ఇద్దరు కూర్చొనే చోట ఒక కుర్చీ వేస్తున్నాయి. ఇలా చేస్తే యాజమాన్యానికి గిట్టుబాటు కాదు.  సీటింగ్‌ తక్కువ వల్ల వ్యాపారం పెద్దగా జరగదు. అలాగని రేట్లు పెంచుతామంటే...ఎవరూ ముందుకు రారు. దాంతో వున్న దాంట్లోనే సర్దుకుపోవాలని, కొంతకాలం నెట్టుకురావాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. 


అన్నీ తిరిగితేనే హోటళ్లకు డిమాండ్‌

ప్రజా రవాణా వ్యవస్థలన్నీ 100 శాతం అందుబాటులోకి వచ్చినప్పుడే హోటళ్లకు, రెస్టారెంట్లకు డిమాండ్‌ వుంటుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. విమానాలు, రైళ్లు, బస్సులు అన్నీ పూర్తిస్థాయిలో తిరిగితే ఇతర ప్రాంతాల నుంచి విశాఖలో దిగేవారు హోటళ్లకు, రెస్టారెంట్లకు వస్తారు. వ్యాపారం జరుగుతుంది. కానీ డిసెంబరు వరకు అన్నీ పూర్తిగా తిరిగే అవకాశం లేదు. అంతవరకు ఈ ఇబ్బందులు తప్పవంటున్నారు. గతంలో ఇద్దరు వ్యక్తులు కలిసి వస్తే...హోటల్‌లో ఒక రూము తీసుకునేవారు. కలిసి ఉండేవారు. ఇప్పుడు కరోనా వల్ల ఇద్దరు వేర్వేరు రూములు తీసుకోవాలి. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకని పని పూర్తి చేసుకొని ఏ రాత్రికైనా ఇంటికి వెళ్లిపోవాలని యత్నిస్తారని, లేదంటే తక్కువ ధరకు దొరికే వసతి చూసుకుంటారని హోటళ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. 


వర్కర్లు అంతా ఊళ్లకు

రెస్టారెంట్లు, హోటళ్లు రెండు నెలలకుపైగా మూతపడడంతో అందులో పనిచేసేవారంతా ఇక్కడ ఇంటి అద్దెలు కట్టుకోలేక స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ప్రతిరోజూ కరోనా కేసులు నమోదవుతుండడంతో కొంతకాలంపాటు వారు విశాఖపట్నం వచ్చే అవకాశం లేదంటున్నారు. దాంతో వున్న సిబ్బందితోనే రెస్టారెంట్లను నడుపుకోవాలని, లేదంటే..కొత్తవారికి శిక్షణ ఇచ్చుకోవాలని యజమానులు చెబుతున్నారు. వెళ్లిన వారంతా సంక్రాంతి తరువాత వచ్చే అవకాశం ఉందని, అప్పటివరకు ఇబ్బందులు తప్పవంటున్నారు.


పరిశ్రమగా గుర్తించాలి.. తాళ్లూరి సత్యనారాయణ, సాయిరాం పార్లర్‌

హోటల్‌ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని ప్రభుత్వాలను ఎప్పటి నుంచో కోరుతున్నాము. పట్టించుకోలేదు. మాకు ఎటువంటి రాయితీలు లేవు. హోటళ్లకు హెచ్‌టీ విద్యుత్‌ కనెక్షన్లు వాడుతున్నాము. విద్యుత్‌ వాడినా, వాడకపోయినా మినిమం డిమాండ్‌ చార్జీలు చెల్లించాలి. ఇవి తడిసి మోపెడవుతున్నాయి. బ్యాంకులు కూడా పరిశ్రమలకు 6 శాతం వడ్డీకి రుణాలు ఇస్తే, హోటళ్లకు 11 శాతం తీసుకుంటున్నాయి. ప్రభుత్వం ఇప్పుడైనా పరిశ్రమగా గుర్తించి ఆదుకోవాలి.


రెస్టారెంట్లలో సగం సీట్లు తగ్గించాం.. ప్రశాంత్‌, జనరల్‌ మేనేజర్‌, హోటల్‌ దసపల్లా

దసపల్లా హోటల్‌లో అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. వాటిలో ధరణి, డింపుల్‌ మాత్రమే తెరుస్తున్నాము. వాటిని కూడా సీటింగ్‌ 320 నుంచి 160కి కుదించాము. ఇప్పట్లో బిజినెస్‌ వుండదని తెలిసినా తప్పదు కాబట్టి చేస్తున్నాము. రెగ్యులర్‌గా హోటల్‌కు వచ్చే ఐదు వేల మంది కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాము. విశాఖపట్నం మళ్లీ ఎప్పుడు వస్తారని అడిగితే...90 శాతం మంది ఏడాది తరువాత ఆలోచిస్తామని చెప్పారు. ఇప్పట్లో సమావేశాలు, వ్యాపార అవసరాలకు వచ్చే ఆలోచన లేదని స్పష్టంచేశారు.  

Updated Date - 2020-06-03T10:01:53+05:30 IST