విశాఖ ఉక్కుకు..విలీనమే శరణ్యం!

ABN , First Publish Date - 2022-08-04T08:42:11+05:30 IST

విశాఖ ఉక్కుకు..విలీనమే శరణ్యం!

విశాఖ ఉక్కుకు..విలీనమే శరణ్యం!

కేంద్రం తలచుకుంటే ఖాయం

ప్రజలు అడిగితే చేస్తామని..పార్లమెంటులో ప్రకటించిన ప్రభుత్వం

ఇక భారమంతా రాష్ట్ర ఎంపీలపైనే!

మోదీ సర్కారుపై ఒత్తిడి పెంచాలి

సెయిల్‌లో కలపాలని ఇప్పటికే డిమాండ్లు

ఈ రెండింటితో ఎన్‌ఎండీసీనీ విలీనం చేస్తే ప్రపంచంలోనే అత్యంత పెద్ద కర్మాగారం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం మిగిలింది. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో దానిని విలీనం చేయడమే పరిష్కారమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రజలు డిమాండ్‌ చేస్తే ఆ దిశగా ప్రయత్నం చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కృష్ణారావ్‌ కరాడ్‌ రాజ్యసభలో మంగళవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలంతా ఈ దిశగా మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిపుణులు సూచిస్తున్నారు. 32 మంది ప్రాణాలు త్యాగం చేయడం వల్ల ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఆది నుంచీ సొంత ఉక్కు గనులు లేవు. వీటి కోసం రాష్ట్రప్రభుత్వం ఏనాడూ పెద్దగా డిమాండ్‌ చేసిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా కడపలో ఇంకా పెట్టని ఉక్కు కర్మాగారం కోసం మాత్రం సొంత గనులు కేటాయించాలని ఎప్పటికప్పుడు వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరుతుండడం గమనార్హం. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందన్న మిషతో విశాఖ ఉక్కును అమ్మేయాలని కేంద్రం నిర్ణయించుకోవడం.. పెట్టుబడుల ఉపసంహరణకు శ్రీకారం చుట్టడం.. ఆ దిశగా ఆర్థిక సలహాదారులను కూడా నియమించడం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు 538 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలూ వారికి మద్దతిస్తున్నాయి. అయినా దీనిని కేంద్రం ప్రజల డిమాండ్‌గా గుర్తించడం లేదు. పాలకపక్షమైన వైసీపీ మనస్ఫూర్తిగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకించడం లేదని, పైకి కేంద్రాన్ని అడుగుతున్నట్లు కనిపించినా.. అందులో చిత్తశుద్ధి లేదని రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నాయి.


పీఎ్‌సయూల విలీనం కొత్తేమీ కాదు..

వాస్తవానికి పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వాటిని సారూప్యం కలిగిన ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. బీజేపీ ప్రభుత్వమే ఇలా అనేక విలీనాలు చేసింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో గుజరాత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఓఎన్‌జీసీ నుంచి రూ.10 వేల కోట్లకు పైగా అందులో పెట్టుబడి పెట్టించి, ఆ తర్వాత దానిని విలీనం చేశారు. ఇదే ఓఎన్‌జీసీలో హెచ్‌పీసీఎల్‌ను కూడా విలీనం చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇకపై హెచ్‌పీసీఎల్‌ అనుబంధ సంస్థగానే కొనసాగుతుందనేది బహిరంగ రహస్యం. అంతేకాకుండా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల్లో ఉన్నాయని ఇటీవల వాటిని ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకులను యూనియన్‌ బ్యాంకులో కలిపేశారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ) 2019 ప్రాంతంలో నష్టాల్లో ఉందని అమ్మడానికి కేంద్రం ప్రయత్నించింది. మేనేజ్‌మెంట్‌ను కూడా మార్చేసింది. అప్పుడు ఎన్నికలు రావడం, కార్మిక సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు డీసీఐని కొనసాగించాలని కోరడంతో మేజరు పోర్టులతో దానిని కొనుగోలు చేయించి, ప్రభుత్వ సంస్థగానే నడుపుతున్నారు. మరి ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలను విలీనం చేసిన కేంద్రం... విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయనని ఎందుకు చెబుతోందో రాష్ట్ర ఎంపీలు ఆలోచించాల్సిన అవసరముందని నిపుణులు అంటున్నారు.

ఏడాది క్రితమే సెఫీ తీర్మానం

దేశంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న 16 స్టీల్‌ప్లాంట్లలో పనిచేసే 25 వేల మంది అధికారులతో కూడిన స్టీల్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెఫీ).. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని గత ఏడాది ఏప్రిల్‌ 4వ తేదీన ఢిల్లీలోనే తీర్మానం చేసి కేంద్ర ఉక్కు శాఖకు పంపింది. ఈ డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. సెయిల్‌ ప్రస్తుతం లాభాల్లో ఉంది. ఇది కూడా 2014 నుంచి నష్టాల బాటలో పయనిస్తుంటే.. 2018-19లో ప్రధాని మోదీ అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు తయారీ కోసం సెయిల్‌కు కేటాయించిన గనుల్లో ముడి ఇనుము మిగిలిపోతున్నందున దానిని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. స్టీల్‌ తయారీకి ఇచ్చిన ముడి ఇనుమును అందుకే వినియోగించాలి. అలా నిబంధనలకు విరుద్ధంగా అమ్ముకున్నారనే కారణంతోనే బ్రహ్మణి స్టీల్స్‌ విషయంలో గాలి జనార్దన్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మిని జైలుకు పంపించారు. సెయిల్‌ ఆ విధంగా ముడి ఇనుము అమ్ముకోవడంతో నష్టాల నుంచి బయటపడి, లాభాల బాటన పడింది. ఈ రోజుకు కూడా సెయిల్‌ లాభాలలో అత్యధిక వాటా.. ముడి ఇనుము అమ్మకాలదే. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. సెయిల్‌ వద్ద అవసరానికి మించి ముడి ఇనుము ఉంది. అందుకే ఈ రెండింటితో పాటు ఎన్‌ఎండీసీని కూడా విలీనం చేస్తే.. ప్రపంచంలో అత్యంత పెద్ద ఉక్కు కర్మాగారం అవుతుంది. 2030-31 నాటికి కేంద్రం నిర్దేశించుకున్న 300 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించుకోవడానికి మార్గం సుగమమవుతుందని నిపుణులు అంటున్నారు.

జనం నిరసిస్తేనే ఉపసంహరణ! 

మోదీ ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవలసి  వస్తే... అందుకు సుదీర్ఘ సమయం తీసుకుంటోంది. ప్రజా పోరాటాలు ఎంతవరకు వెళ్తాయో వేచి చూసి నిర్ణయం తీసుకుంటోంది. పార్లమెంటులో చేసిన రైతుచట్టాలను రద్దు చేయడానికి ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. డీసీఐ విషయంలోనూ కొందరు కార్మికులు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే... మిత్రపక్షం జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఆ దీక్షకు మద్దతిస్తే... నిర్ణయం ఉపసంహరించుకుంది. ఇపుడు విశాఖ ఉక్కును విక్రయించవద్దని ఏపీ సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాశారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా విశాఖ ఉక్కును విక్రయించకూడదని కేంద్రాన్ని కోరారు. పవన్‌ కల్యాణ్‌ ఉక్కు కార్మికుల దీక్షకు మద్దతు ఇచ్చారు. ఇలా అంతా ప్రైవేటీకరణ వద్దనే కోరుకుంటున్నారు. ఇంత కంటే ప్రజాభిప్రాయం అంటే.. మొత్తం ఎంపీలంతా వెళ్లి ఢిల్లీలో ధర్నా చేయడమే!


నేరుగా విలీనం చేయాలి

బ్యాంకులను విలీనం చేసినట్లు.. ఓఎన్‌జీసీలో హెచ్‌పీసీఎల్‌ను కలిపేసినట్లు.. సెయిల్‌లో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నేరుగా కేంద్రమే కలపాలి. దీనికి మళ్లీ బిడ్డింగ్‌ పిలవడం, ప్రైవేటు సంస్థలతో పాటు పాల్గొనడానికి ప్రభుత్వ సంస్థలకు అనుమతి ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకోకూడదు. విశాఖ ఉక్కును యథాతథంగా కొనసాగించడానికి నేరుగా సెయిల్‌లో విలీనం చేయాలి. అదే మేం కోరుకుంటున్నాం.

- కేవీడీ ప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి, 

విశాఖ ఉక్కు అధికారుల సంఘం


మెగా విలీనానికి ప్రయత్నం

సెయిల్‌లో విశాఖ ఉక్కుతోపాటు ఎన్‌ఎండీసీ కూడా కలిస్తే మెగా మెర్జర్‌ అవుతుంది. ఇది మూడింటికీ లాభదాయకం. ఈ దిశగా రాష్ట్ర బీజేపీ తరఫున మా వంతు ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పకుండా సాధించి తీరతాం.

- పీవీఎన్‌ మాధవ్‌, బీజేపీ ఎమ్మెల్సీ

Updated Date - 2022-08-04T08:42:11+05:30 IST