పీటీడీ బస్సులు ఖాళీ

ABN , First Publish Date - 2020-08-04T10:14:31+05:30 IST

ప్రయాణికుల లేమి కారణంగా విశాఖ రీజియన్‌లో మరో 17 బస్సు సర్వీసులను పీటీడీ యాజమాన్యం తాత్కాలికంగా రద్దు చేసింది.

పీటీడీ బస్సులు ఖాళీ

రీజియన్‌లో మరో 17 సర్వీసులు రద్దు

ప్రస్తుతం నడుస్తున్నవి 103 మాత్రమే..


ద్వారకాబస్‌స్టేషన్‌, ఆగస్టు 3: ప్రయాణికుల లేమి కారణంగా విశాఖ రీజియన్‌లో మరో 17 బస్సు సర్వీసులను పీటీడీ యాజమాన్యం తాత్కాలికంగా రద్దు చేసింది.  ప్రస్తుతం బస్‌స్టేషన్‌ నుంచి బస్‌స్టేషన్‌కు 120 సర్వీసులు రవాణా సేవలందిస్తున్నాయి. మరీ తక్కువ ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) ఉన్న 17 రూట్లలో ఒక్కో బస్సును  తాత్కాలికంగా రద్దు చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా పీటీడీ బస్సుల్లో ప్రయాణించే వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు. బస్సు సీటింగ్‌ కెపాసిటీలో సగం సీట్లకే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. అంటే 48 సిట్టింగ్‌ కెపాసిటీ ఉన్న బస్సులో 24 మంది, 42 సిట్టింగ్‌  కెపాసిటీ ఉన్న బస్సులో 21 మంది ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నారు.


అయితే ఈ బస్సుల్లో కేవలం 10 నుంచి 14 మంది మాత్రమే ప్రయాణిస్తున్నట్టు పీటీడీ అధికారులు లెక్కలు కట్టారు. ఇలా బస్సులు నడిపితే ఇంధన ఖర్చులు కూడా రావడం లేదని భావించి, ఓఆర్‌ తక్కువగా ఉన్న సర్వీసులపై దృష్టి పెట్టారు. విశాఖ నుంచి నీలకంఠాపురం, ఇచ్చాపురం, సోంపేట, బత్తిలి, కొత్తూరు, శ్రీశైలం, అనకాపల్లి నుంచి దేవరాపల్లి, కొత్తపట్నం, మాడుగుల, రావికమతం, జోలాపుట్‌, నర్సీపట్నం డిపో నుంచి మంప, గుడ్లవల్లి, సీలేరు, పాడేరు డిపో నుంచి జోలాపుట్‌, కాకినాడ, రాజమండ్రి రూట్లలో ఒక్కో సర్వీసును రద్దు చేశారు.  120 సర్వీసులకు గాను  103 సర్వీసులను నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-08-04T10:14:31+05:30 IST