Abn logo
Oct 20 2021 @ 03:30AM

గంజాయిపై ప్రతి ఒక్కరినీ విచారిస్తాం

  • నక్కా ఆనందబాబు వాంగ్మూలం రికార్డు చేశాం
  • బండారు, అయ్యన్నలకు నోటీసులు ఇస్తాం 
  • ఏవోబీలో 10 వేల ఎకరాల్లో గంజాయి సాగు
  • తోటల విధ్వంసానికి త్వరలో యాక్షన్‌ ప్లాన్‌ 
  • విశాఖ రేంజ్‌ డీఐజీ రంగారావు వెల్లడి
  • అయ్యన్నపాత్రుడు గంజాయి స్మగ్లర్‌ అన్న హోం మంత్రిని విచారిస్తారా?.. అన్న ప్రశ్నకు 
  • ఆ వీడియోను తాను చూడలేదని సమాధానం


విశాఖపట్నం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): విశాఖ ఏజెన్సీలో గంజాయి రవాణా, అమ్మకాలకు సంబంధించి సమాచారం ఉందన్న ప్రతి ఒక్కరినీ సాక్షులుగా పరిగణించి విచారిస్తామని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు చెప్పారు. మంగళవారం రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. గంజాయి రవాణాతో విశాఖ నేతలకు సంబంధం ఉందన్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబును మంగళవారం ఉదయం విచారించినట్టు తెలిపారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశామన్నారు. ఇదే తరహా ప్రకటనలు చేసిన విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు బండారు సత్యనారాయణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడులను కూడా సాక్షులుగా పరిగణిస్తూ నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పారు. గంజాయి స్మగ్లర్ల నుంచి తమనుతాము కాపాడుకునే సమయంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారని తెలిపారు. ఈ నేపథ్యంలో గంజాయి వ్యాపారం చేసే వారితో కొందరు స్థానిక నాయకులకు సంబంధం ఉందని గుంటూరులో  ఆనందబాబు వ్యాఖ్యానించారని చెప్పారు. దీంతో ఆయన నుంచి మరింత సమాచారం సేకరించేందుకు విశాఖ నుంచి పోలీసు బృందం ఒకటి సోమవారం రాత్రి గుంటూరుకు వెళ్లిందన్నారు. రాత్రి 10.40 గంటలకు ఆనందబాబుకు ఫోన్‌ చేస్తే తొలుత రావద్దన్నారని, ఆ తర్వాత ఆయనే ఫోన్‌ చేయడంతో ఇంటికి వెళ్లగా, తన వద్ద ఎలాంటి సమాచారం లేదని, అవసరమైతే మంగళవారం ఉదయం రావాలని చెప్పారని డీఐజీ వివరించారు. తిరిగి మంగళవారం ఉదయం ఆనందబాబు ఇంటికి వెళ్లినప్పుడు తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పినట్టు వివరించారు.


ఆయన నుంచి సరైన సమాధానం రాలేదని, అయితే సమాచారం కోసం 91 సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చామన్నారు. కేవలం సాక్షిగా మాత్రమే ఆయనకు నోటీస్‌ ఇచ్చి సమాచారం ఇవ్వాలని కోరామన్నారు. గంజాయి వ్యాపారంతో స్థానిక నేతలకు సంబంధాలు ఉన్నట్టు ఎవరి వద్ద వివరాలు ఉన్నా.. నోటీసులు ఇచ్చి కేవలం సాక్షులుగా విచారిస్తామన్నారు. అయితే, ఇదే సమయంలో.. ‘మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గంజాయి స్మగ్లర్‌’ అని ఆరోపించిన హోంమంత్రి మేకతోటి సుచరితను విచారిస్తారా? అన్న మీడియా ప్రశ్నకు డీఐజీ బదులిస్తూ, ఆమె మాట్లాడిన వీడియోను తాను చూడలేదని పేర్కొన్నారు. ఆ వీడియోను చూశాక స్పందిస్తానని తెలిపారు.


ఎప్పటికప్పుడు దాడులు

విశాఖ ఏజెన్సీలో ఏళ్ల తరబడి గంజాయి సాగు జరుగుతోందని, ఎప్పటికప్పుడు పోలీసు, ఎక్సైజ్‌ శాఖలు కలిసి దాడులు చేస్తున్నాయని డీఐజీ రంగారావు చెప్పారు. 2016లో 724 కేసుల్లో 2,290 మందిని అరెస్టు చేయగా, 2017లో 713 కేసుల్లో 2,406 మందిని, 2018లో 579 కేసుల్లో 2,174 మందిని, 2019లో 812 కేసుల్లో 2,565 మందిని, 2020లో 928 కేసుల్లో 2,900 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1,359 కేసుల్లో 4,059 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ప్రజలు సహకరిస్తే తప్ప గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించలేమని చెప్పారు. ఏవోబీ పరిధిలో ఏపీ భూభాగం(విశాఖ జిల్లా)లోని 6 వేల ఎకరాల్లో, ఒడిసా పరిధిలోని 4 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్టు చెప్పారు. గడచిన రెండేళ్లలో 54 సార్లు దాడులు చేసి 800 ఎకరాల్లో తోటలు ఽధ్వంసం చేశామన్నారు. విశాఖ జిల్లాలో గంజాయి తోటల ధ్వంసానికి డీజీపీ స్థాయిలో రూపొందించిన కార్యాచరణను త్వరలో అమలు చేస్తామని ప్రకటించారు. 


గంజాయి తరలిస్తూ దొరికిపోయారు

నర్సీపట్నం నుంచి హైదరాబాద్‌కు..,  విశాఖ నుంచి ముంబైకి

అంతర్రాష్ట్ర నిందితుడు, డ్రైవర్‌ అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి)/మునిపల్లి: గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితున్ని హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 40 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వనపలి నాగసాయి(24) నగరానికి గంజాయి తరలిస్తుంటాడు. తెలంగాణలోని నారాయణఖేడ్‌కు చెందిన గంజాయి వ్యాపారి ప్రేమ్‌సింగ్‌కు 40 కిలోల గంజాయి అందజేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ సమాచారంతో పోలీసులు సీబీఎస్‌ ఆటోపార్కింగ్‌ వద్ద నాగసాయిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న నాగసాయికి తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్‌, యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో గంజాయి వ్యాపారులతో లింకులు ఉన్నట్లు తేలింది.  కాగా.. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్‌ టోల్‌ప్లాజా వద్ద విశాఖ నుంచి ముంబై తరలిస్తున్న 240 కిలోల ఎండు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వాహనంలో  రెండు కిలోల బరువు గల 120 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు.


ఏపీ వర్సెస్‌ తెలంగాణ

గాలిపాడు తనిఖీలకు నల్లగొండ పోలీసులు అనుమతి తీసుకోలేదన్న డీఐజీ

చెప్పే వచ్చామన్న  నల్లగొండ పోలీసులు

విశాఖపట్నం, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): గంజాయి రవాణా చేస్తున్నవారిని పట్టుకునేందుకు విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి తెలంగాణ నుంచి పోలీసులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ఇరు రాష్ట్రాల పోలీసుల వాదనలు భిన్నంగా ఉన్నాయి. తాము తూర్పుగోదావరి, విశాఖపట్నం పోలీసులకు ముందుగానే చెప్పి రంగంలోకి దిగామని నల్లగొండ పోలీసులు ఇటీవల స్పష్టం చేశారు. అయితే.. దీనిపై విశాఖ రేంజ్‌ డీఐజీ రంగారావు భిన్నమైన వాదన వినిపించారు. ఏజెన్సీలో గంజాయి నిందితులను పట్టుకునేందుకు తెలంగాణ, ఇతర రాష్ట్రాల పోలీసులు గడచిన రెండు, మూడు వారాల్లో స్థానిక పోలీసుల సహకారాన్ని తీసుకున్నారని చెప్పిన ఆయన చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడుకు చెందిన నిందితులను పట్టుకునేందుకు మాత్రం నల్లగొండ పోలీసులు స్థానిక పోలీసుల సహకారాన్ని తీసుకోలేదని డీఐజీ తెలిపారు. విశాఖ రూరల్‌ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. గంజాయి నిందితులను పట్టుకునేందుకు నల్గొండ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం లేకుండా చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి వెళ్లారన్నారు. నిందితులను పట్టుకునే క్రమంలో స్థానికులు దాడికి దిగడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామన్నారు.