నేటి నుంచి విశాఖ ఆర్గానిక్‌ మేళా

ABN , First Publish Date - 2021-12-03T06:02:28+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఎంవీపీకాలనీ ఏఎస్‌ రాజా మైదానంలో శుక్రవారం నుంచి ఐదో తేదీ వరకు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల నిమిత్తం ‘విశాఖ ఆర్గానిక్‌ మేళా-2021’ జరగనున్నది.

నేటి నుంచి విశాఖ ఆర్గానిక్‌ మేళా
గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా మోడల్‌ విలేజ్‌ నమూనా

ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు

120కి పైగా స్టాల్స్‌.. ప్రవేశం ఉచితం

ఎంవీపీ కాలనీ, నవంబరు 30: ఆంధ్రప్రదేశ్‌ గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఎంవీపీకాలనీ ఏఎస్‌ రాజా మైదానంలో శుక్రవారం నుంచి ఐదో తేదీ వరకు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల నిమిత్తం ‘విశాఖ ఆర్గానిక్‌ మేళా-2021’ జరగనున్నది. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా, వ్యవసాయ రంగం ప్రతిబింబించేలా సేంద్రీయ పద్ధతుల్లో స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం పది గంటలకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖా మంత్రి ఎస్‌.అప్పలరాజు ఈ మేళాను ప్రారంభించనున్నారు. నాబార్డ్‌ చైర్మన్‌ చింతల గోవిందరాజులు, ఎమ్మెల్సీ మాధవ్‌, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణలు, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణరాజు అతిథులుగా హాజరు కానున్నారు. వందకు పైగా స్టాల్స్‌ను ఈ మేళాలో ఏర్పాటు చేశారు. తొలిరోజు జరిగే రైతు సమ్మేళనానికి ఉత్తరాంధ్రకు చెందిన వెయ్యి మందికి పైగా రైతులు హాజరు కానుండగా, సేంద్రియ వ్యవసాయం చేస్తున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ  వ్యవసాయంలో తన అనుభవాలను వివరిస్తారు. అలాగే సేంద్రియ ఉత్తమ రైతులకు జైకిసాన్‌ అవార్డులను ప్రదానం చేస్తారు. గత ఏడాది ఫిబ్రవరి 11 నుంచి 13 వరకు తొలి ఆర్గానిక్‌ మేళాను ఇక్కడే నిర్వహించారు. కాగా గ్రామీణ వాతావరణం ఉట్టిపడే మోడల్‌ విలేజ్‌ నమూనాను ఈ సందర్భంగా రూపొందించారు. రోజూ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పది గంటల వరకు మేళా వుంటుందని, ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు రోజుల్లో సుమారు లక్ష మంది సందర్శకులు వస్తారని వారు భావిస్తున్నారు. భారతీయ కిసాన్‌ సంఘ్‌ కార్యవర్గ సభ్యుడు కుమారస్వామి ఆధ్వర్యంలో మేళా పనులను పూర్తి చేశారు.


Updated Date - 2021-12-03T06:02:28+05:30 IST