విశాఖా ఓ విశాఖా నీకేమయింది?

ABN , First Publish Date - 2021-06-20T05:45:06+05:30 IST

విశాఖపట్నం అంటే ఒక సుందర నగరం. ఈ నగరం పేరు వినగానే అందమైన బీచ్‌లు, సముద్రపు ఘోష, ఏజెన్సీని తలపించేలా మినీ ఘాట్ రోడ్లు, పచ్చటి కొండలు, పోర్టు, షిప్‌యార్డ్‌, స్టీల్‌ ప్లాంట్‌...

విశాఖా ఓ విశాఖా నీకేమయింది?

విశాఖపట్నం అంటే ఒక సుందర నగరం. ఈ నగరం పేరు వినగానే అందమైన బీచ్‌లు, సముద్రపు ఘోష, ఏజెన్సీని తలపించేలా మినీ ఘాట్ రోడ్లు, పచ్చటి కొండలు, పోర్టు, షిప్‌యార్డ్‌, స్టీల్‌ ప్లాంట్‌ లాంటి ప్రభుత్వ సంస్థలు తప్పకుండా గుర్తుకు వచ్చి తీరతాయి. దేశంలో పురాతనమయిన రెండో మునిసిపాలిటిగా పేరుగాంచిన భీమిలి నేడు విశాఖ నగరంలో అంతర్భాగం. ప్రసిద్ధి చెందిన బెల్లం మార్కెట్‌ ఉన్న అనకాపల్లి కూడా నేడు నగరంలో భాగమే. తొట్లకొండ, పావురాలకొండ, బావికొండ, బొజ్జన్నకొండ వంటి ప్రసిద్ధ బౌద్ధారామాలు నగరంలో ఉన్నాయి. బ్రిటిష్‌ కాలంలోనే నిర్మించిన ఆంధ్ర యూనివర్సిటీ పేరెన్నిక గలది. వీటిని చూడడానికే అనేక మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి విశాఖకు వస్తుంటారు. ఆసియా ఖండంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాలలో ఇదొకటి. మన రాష్ట్రంలో అతిపెద్ద నగరం. సుందర నగరంగానే కాక ఉమ్మడి రాష్ట్రంలో పారిశ్రామిక రాజధానిగానూ పేరుపొందింది. ఇవన్నీ ఒక్కసారిగా కాక అనేక దశాబ్దాలుగా క్రమేణా వచ్చిన మార్పులు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విశాఖను పరిపాలనా రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించిన తరువాత ఈ నగరం ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోవడం ప్రారంభమయింది. రాజధాని వస్తోందని ఆనందం వెలిబుచ్చిన వారు కూడా విస్తు పోయేలా అనేక మార్పులు సంభవిస్తున్నాయి. గత రెండు సంవత్సరాల నుంచి, మరీ ముఖ్యంగా గత సంవత్సరం పైగా దేశమంతా ప్రాణభయంతో ఉంటే, విశాఖ నగర ప్రజలు మాత్రం జంట భయాలతో ఉన్నారు. 


గ్రేటర్‌ విశాఖ నగరం 682 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి, దేశంలోనే మూడో అతి విశాల నగరంగా ఉంది. రాష్ట్రంలోని మిగిలిన నగరాలతో పోలిస్తే విశాఖ నగరంలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయి. విశాలమయిన ప్రదేశాలలో బ్రిటిష్‌ కాలంలోనే నిర్మించిన భవంతులున్నాయి. జిల్లా కలెక్టరు కార్యాలయంతో సహా అనేక ప్రభుత్వ సంస్థలు వీటి నుంచే పని చేస్తున్నాయి. బీచ్‌ రోడ్డులో ఉన్న హవామహల్‌ ప్రపంచ హెరిటేజ్‌ గుర్తింపు పొందింది. ఈ నగరంలో ఉన్నన్ని పార్కులు బహుశా ఈ స్థాయి నగరాలలో మరెక్కడా ఉండకపోవచ్చు. అయితే ఇదంతా గతం మాట. నేడు ఇవన్నీ ఒకటొకటిగా హరించుకు పోతున్నాయి. ఇప్పటికే విశాఖ, భీమిలి మధ్య ఉన్న సుమారు 25 కిలోమీటర్ల తీర ప్రాంతంలో అత్యధికం ఏదో రూపంలో ప్రైవేటు వ్యక్తుల పరమయింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బిల్డ్‌ ఎపి పేరుతో రూపొందించిన ప్రణాళికలో అమ్మకాలకు పెడుతున్న భూములలో కూడా అత్యధికం విశాఖ నగరంలోనే ఉన్నాయి. జిల్లా కలెక్టరు కార్యాలయం, రెండు తహశీల్దార్‌ ఆఫీసులు, ప్రాంతీయ కంటి ఆసుపత్రి, ఆర్ అండ్ బి ఆఫీసు, రెవిన్యూ ఉద్యోగుల క్వార్టర్స్‌, ప్రభుత్వ ఐటిఐ, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, గెస్టుహౌస్‌లు, రైతుబజార్‌, డైరీఫాం, ఆఖరుకు వికలాంగుల శిక్షణా కేంద్రం వంటి ప్రభుత్వ సంస్థలకు చెందిన వందల ఎకరాల స్థలాలను అమ్మకానికి లేదా తనఖా పెట్టాలని ప్రభుత్వం పథకాలు రూపొందించింది. ప్రసిద్ధ బౌద్ధారామాలు కూడా వేరే రూపంలో చేతులు మారవచ్చని వార్తలు వచ్చాయి. ఇటీవలే, నగరంలో ప్రఖ్యాతి గాంచిన 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముడసర్లోవ పార్కును ఎన్నికైన పాలకమండలిని కూడా పక్కన పెట్టి పిపిపి పేరుతో ప్రైవేటు వారికివ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. 


రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం ఎపిఎస్‌డిసిను ఏర్పాటు చేసింది. పేరుకు అది డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అయినా ఆచరణలో మాత్రం దివాళా కార్పొరేషన్‌గా మారిపోయింది. వివిధ ప్రభుత్వ సంస్థల స్థలాలున్నాయి కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పని పూర్తి చేయడానికి కలెక్టరు గారి ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. 


గంగవరం పోర్టుకు గత ప్రభుత్వం 2852.26 ఎకరాల భూమిని తన పెట్టుబడిగా కేటాయించింది. ఇందులో 1800 ఎకరాల భూమికి గాను పోర్టులో 10.39 శాతం వాటాను, ఆ వాటాకు అనుగుణంగా ప్రతి ఏడు పోర్టు ఆదాయంలో 2.1 శాతాన్ని ప్రభుత్వం పొందుతోంది. మిగిలిన 1052.26 ఎకరాలకు ప్రభుత్వం కౌలు రూపంలో ఆదాయం పొందుతోంది. ఇప్పుడు ప్రభుత్వం తన మొత్తం వాటాను అదాని సంస్థకు అమ్మేయాలని నిర్ణయించింది. దీని అర్థం ఏమిటంటే ఈ మొత్తం భూమిని అమ్మేయడమే. ఈ అమ్మకాలు ఇలాగే కొనసాగితే ఇక విశాఖ నగరంలో ప్రభుత్వ భూములంటూ ఇంకేవీ మిగలవు. రాష్ట్రంలో మూడు శివారు నగరాలను పిపిపి పద్ధతిలో నిర్మిస్తామని ప్రత్యేకంగా ఇటీవల రాష్ట్ర ఆర్థికమంత్రి తన బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. వాటిలో విశాఖ ఒకటి. ఆ పేరుతో పెద్దఎత్తున భూసేకరణ జరుగుతుందని చెప్పనవసరం లేదు. 


ఇక కేంద్రప్రభుత్వం విశాఖ నగర స్వభావాన్నే మార్చే విధంగా ప్రైవేటీకరణకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటును 22,372 ఎకరాల భూమితో సహా మొత్తంగా అమ్మేయాలని నిర్ణయించింది. విశాఖ రైల్వేస్టేషన్‌ను ప్రైవేటుపరం చేయడానికి యత్నిస్తూ అభివృద్ధి పేరుతో రైల్వే స్థలాలను అమ్మకానికి పెడుతోంది. విశాఖపట్నం పోర్టులో మొత్తం బెర్తులు, ఇనుప ఖనిజం ప్లాంట్‌ లను అదాని, వేదాంత వంటి కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేశారు. 


వెరసి రాష్ట్ర ప్రభుత్వం రిటైల్‌గా భూములమ్ముతుంటే, కేంద్రప్రభుత్వం హోల్‌సేల్‌ గానే ఏకంగా భూములతో సహా పరిశ్రమలనే అమ్మేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఒరవడి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో విశాఖ రూపు సమూలంగా మారిపోతుందనడంలో సందేహం లేదు. సర్వం ప్రైవేటుపరమై నిలువ నీడ, ఉపాధి లేకపోతే ఇక రాజధాని రాక వల్ల సామాన్యులకు ఒరిగేదేమిటన్నది పెద్ద ప్రశ్న. రాజధాని రాకుండానే ఇలా ఉంటే వస్తే ఇంకెలా ఉంటుందో అనే సందేహం, భయాందోళనలు నేడు అత్యధిక మంది ప్రజలలో నెలకొన్నాయి. వీటిని నివృత్తి చేసే బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పైనే ఉంది. తానే అమ్మకాలు చేస్తుంటే, అదే పని చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించే నైతికతను కూడా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. విశాఖ నగరం అసలైన అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూముల అమ్మకాలను తక్షణం విడనాడాలి. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాన్ని విడనాడేలా కేంద్రప్రభుత్వంపై చిత్తశుద్ధితో ఒత్తిడి తేవాలి. ఈ నగరానికి ఏమైంది అనేది ధూమపాన నిషేధ ప్రకటన. ఇప్పుడు సుందర విశాఖ స్థితి కూడా అలాగే తయారయింది. ప్రభుత్వం తన విధానాలను మార్చుకుని భూముల అమ్మకాన్ని విరమించుకునేలా నగర పౌరులు, అభివృద్ధి కాముకులు నడుం బిగించాలి. 

ఎ. అజ శర్మ

ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక

Updated Date - 2021-06-20T05:45:06+05:30 IST