Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 19 2021 @ 01:50AM

గంజాయి ఖిల్లాగా Visakha మన్నెం.. దేశవ్యాప్తంగా భారీగా సరఫరా!

  • వంద గ్రామాల్లో 25 వేల ఎకరాల్లో పంట
  • ఎకరా పంటకు రూ.10 లక్షల ఆదాయం
  • రైతులకు చెల్లిస్తున్నదే రూ.2000 కోట్లు
  • మార్కెట్‌ విలువ పది వేల కోట్లు పైనే
  • తెలంగాణలోనూ 3 జిల్లాల్లో సాగు
  • కొవిడ్‌ తర్వాత పల్లెలకు పాకిన వాడకం
  • హేయమైన నేరాలకు గంజాయి మత్తు ఆజ్యం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) :తెలుగు రాష్ట్రాలను గంజాయి మత్తు చాపకింద నీరుగా మెల్లగా కబళిస్తోంది. భారీ సంఖ్యలో యువత గంజాయి దమ్ముకు అలవాటు పడుతోంది. కొవిడ్‌ లాక్‌డౌన్‌కు ముందు నగరాలకే పరిమితమైన గంజాయి వ్యసనపరులు ఉపాధి లేక గ్రామాలకు తరలివచ్చి అక్కడ కూడా యువతకు అలవాటు చేశారు. ఈ క్రమంలో నిన్నటిదాకా ఇంటిపక్కన అమాయకంగా కనిపించిన వారు కూడా గంజాయి మత్తులో ఘోరమైన నేరాలకు పాల్పడి సభ్యసమాజం తలదించుకొనే పరిస్థితి కల్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని చిన్నారిపై యువకుడు గంజాయి మత్తులో అత్యాచారం చేసి చంపిన ఉదంతం తర్వాత తెలంగాణ సర్కారు గంజాయిపై ఉక్కుపాదం మోపింది. అమ్ముతున్న వారిని, రవాణా చేస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అరెస్టు చేసింది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో భారీ ఎత్తున పంటను ధ్వంసం చేసింది. తెలంగాణ పోలీసుల వేటలో గంజాయు నెట్‌వర్క్‌ మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయని తేలింది. ఆ జిల్లాలో ఒడిసా సరిహద్దును ఆనుకుని ఉండే ఎనిమిది గిరిజన మండలాలు భారతదేశపు గంజాయి ఉత్పత్తి హబ్‌గా మారాయి. అక్కడ వందకు పైగా పంచాయతీల్లో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. అటు సరిహద్దు ఆవల ఒడిసాలోనూ భారీ ఎత్తున గంజాయి పంట సాగు చేస్తున్నారు. దేశంలో ఏ మూలన గంజాయి పట్టుబడ్డా సరుకు మూలాలు ఇక్కడే తేలుతున్నాయి. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు నెలల్లో పది లక్షల ఆదాయం వస్తుండటంతో గిరిజన ప్రాంత రైతులు అన్నింటికీ తెగించి పంట సాగు చేస్తున్నారు. ఏడాదిలో రెండు పంటలు కూడా వేస్తున్నారు. దాంతో దేశం నలు మూలల నుంచి గంజాయి స్మగ్లర్లు వచ్చి, ముందుగా పెట్టుబడి పెట్టి సరుకు బుక్‌ చేసుకొని వెళ్తున్నారు. యువతను మత్తులో ముంచి జాతిని నిర్వీర్యం చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన ఽమాదక ద్రవ్యాలకు విశాఖ జిల్లా ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఒడిసాను పక్కనబెడితే ఒక్క విశాఖ జిల్లాలోనే ఏటా కోటి కిలోల గంజాయి ఉత్పత్తి జరుగుతోంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ సగటున 15 వేల కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. అందులో మన్యం రైతులకు చెల్లించేదే రెండు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 

ఆధునిక పద్ధతుల్లోసాగు

విశాఖ మన్యంలో శాస్త్రీయ, ఆధునిక పద్ధతుల్లో గంజాయి సాగు చేస్తున్నారు. వాగుల నుంచి నిరంతర నీటి సరఫరా ఉండేట్లు జాగ్రత్త పడుతున్నారు. ఐదు నెలల పాటు మొక్కలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ప్రధానంగా సేంద్రీయ పద్ధతిలోనే సాగు చేస్తారు. చీడ పీడలు ఆశించినట్టు గుర్తిస్తే వెంటనే ఆకులను, పురుగులను తొలగిస్తారు. తప్పనిసరి అయితే పురుగు మందులు వాడతారు. ఫలితం కూడా అంతే ఉంటుంది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు లక్ష రూపాయలకు మించి వ్యయం కాదు. సుమారు 500 కిలోల (నాణ్యమైన శీలావతి రకం) దిగుబడి వస్తుంది. ఇళ్ల వద్దకే వచ్చి కిలో రూ.2 వేల చొప్పున కొనుగోలు చేస్తుంటారు. ప్యాకింగ్‌, అక్కడి నుంచి మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు, అందుకు అయ్యే వ్యయం అంతా స్మగ్లర్లే చూసుకుంటారు. ఐదు నెలల్లో లక్ష రూపాయల పెట్టుబడితో రూ.10 లక్షల ఆదాయం వస్తున్నది. ఖర్చులు పోను రూ.9 లక్షలు మిగులుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి స్మగ్లర్లు వచ్చి రైతులకు పెట్టుబడి పెడుతున్నారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ఖర్చును ముందే ఇచ్చేస్తున్నారు. బలిమెల రిజర్వాయర్‌ చుట్టూ బిందుసేద్యం పద్ధతుల్లో గంజాయి సాగవుతోంది. మావోయిస్టుల ప్రభావిత గ్రామాలు కావడం, పోలీసులు వచ్చే అవకాశం చాలా తక్కువ వుండడం కలిసి వస్తోంది. మావోయిస్టులు అండగా నిలుస్తున్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు. 


వ్యతిరేకించడం లేదు. స్మగ్లర్లు పోలీస్‌, ఎక్సైజ్‌, రెవెన్యూ, అటవీ శాఖల్లో కొంతమంది అధికారులు, సిబ్బంది సహాయంతో యధేచ్ఛగా గంజాయిని రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లే పూర్తి అండదండలు అందిస్తున్నారు. వారికి భారీ నెట్‌వర్క్‌ ఉంది. వారి మనుషులు మండల, పంచాయతీ కేంద్రాల్లో ఎవరికీ అనుమానం రాకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, అడ్వాన్సులు ఇవ్వడం ఈ నెట్‌వర్క్‌ పని. మరికొందరు గ్రామాల్లో నివాసం వుంటూ సాగు, కోత, ప్యాకింగ్‌తో పాటు ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి తరలించే బాధ్యత తీసుకుంటారు. ఇక్కడ నుంచి ఏటా కోటి కిలోలు రవాణా అవుతోంది. అందులో కేవలం ఐదు శాతం వివిధ రాష్ట్రాల పోలీసులకు చిక్కుతోంది. మావోయిస్టుల ప్రభావం వల్ల తోటలను ధ్వంసం చేయలేక  పోతున్నామని ఆంధ్రప్రదేశ్‌లోని సంబంధిత అధికారులు చెబుతున్నారు. గంజాయి రవాణాకు స్మగ్లర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. గతంలో గోనె సంచుల్లో తరలించేవారు. కొంతకాలం నుంచి చిన్న ప్యాకెట్లుగా మార్చి తరలిస్తున్నారు. తెలంగాణకు ప్రధానంగా సీలేరు, డొంకరాయి మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 28వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు రికార్డు స్థాయిలో 4,383కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. 


నిరుపేదలతో రవాణా

గంజాయి స్మగ్లర్లు మైదాన ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువకులు, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను, నిరుపేద కుటుంబాలకు చెందిన వారిని గంజాయి రవాణాలో పావులుగా వాడుకుంటున్నారు. కిలోకు రూ.1,000వరకు ఇస్తుండడంతో నిరుద్యోగ యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. పట్టుబడ్డ వారిలో 90 శాతం మంది వీరే. యువకులు, విద్యార్థులు బైక్‌ల ద్వారా రవాణా చేస్తున్నారు. ఆటోలు, జీపుల్లో ప్రయాణికుల మాదిరిగా గంజాయి బ్యాగులతో వెళుతుంటారు. ట్రిప్‌కు రూ.లక్ష వరకు చెల్లిస్తారు. పోలీసులు పట్టుకుంటే డ్రైవర్‌కు బెయిల్‌, అతను జైలులో ఉన్నంత కాలం కుటుంబ పోషణను స్మగ్లర్లే చూసుకుంటారు. బైక్‌పై తరలిస్తే రూ.25వేలు చెల్లిస్తారు. నల్లగొండ పోలీసుల ఆపరేషన్‌

తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా పోలీసులు ఎస్పీ రంగనాథ్‌ దిశా నిర్దేశంలో ఆంధ్రా-ఒడిసా సరిహద్దును పోలీసులు జల్లెడ పట్టగా 15 రోజుల వ్యవధిలో 700కేజీల గంజాయి, 20లీటర్ల విడాయిల్‌ (లిక్విడ్‌ రూపంలోని గంజాయి) లభ్యం కాగా 40 మందిని అరెస్టు చేసి 34 కేసులు నమోదు చేశారు. విచారణలో అందరి మూలాలు ఏవోబీలోనే ఉన్నాయని తెలిసింది. ఏఎస్పీ ఆధ్వర్యంలో 17 పోలీస్‌ బృందాలను ఏవోబీకి పంపారు. స్థానిక పోలీసులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా వారు రంగంలోకి దిగారు. స్మగ్లర్లు రోడ్డుకు అడ్డంగా టిప్పర్లను పెట్టి కత్తులు, గొడ్డళ్లతో దాడికి యత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఆదివారం జరిగిన ఘటనలో ఇద్దరి కాళ్లలోకి తూటాలు దిగాయి. వారి రాళ్ల దాడిలో పోలీస్‌ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు 1000కేజీల గంజాయిని, 35మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.


పల్లెలకు విస్తరించిన వ్యసనం

ఇంతకాలం హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాలకే పరిమితమైన గంజాయి వినియోగం కరోనా మూలంగా పల్లెపల్లెనా విస్తరించింది. హైదరాబాద్‌లో ఆటోలు నడిపేవారు, డ్రైవర్లుగా, బిల్డింగ్‌ వర్కర్లుగా పనిచేసేవారు, ఇంజనీరింగ్‌ విద్యార్థులు గంజాయి వినియోగదారుల్లో ప్రధానంగా ఉన్నారు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరంతా ఏడాదిన్నరగా పల్లెల్లోకి చేరడంతో స్థానికులకు వాటిని అలవాటు చేశారు. గంజాయి మత్తులో ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు హత్య కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు గంజాయి రవాణా వ్యవస్థ, అక్రమ విక్రయాలు, ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై నల్లగొండ పోలీసులు సంపూర్ణ నివేదికను రూపొందించినట్లు సమాచారం. దీన్ని బుధవారం నిర్వహించనున్న సమావేశంలో సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నారు. 


ఏపీలో గంజాయి సాగు చేసే ఊళ్లు

పాడేరు మండలం: ఇరడాపల్లి, కించూరు, బడిమెల, డోకులూరు, వంజంగి, గొండెలి

జి.మాడుగుల మండలం: బొయితిలి, కిల్లంకోట, నుర్మతి, లువ్వాసింగి, పెదలోచలి, పినలోచలి, గెమ్మెలి, సొలభం, పాలమామిడి, కుంబిడిసింగి.

పెదబయలు మండలం: గిన్నెలకోట, గోమంగి, లక్ష్మీపేట, పెదకోడాపల్లి, కిముడుపల్లి, గుల్లెలు, గిన్నెలకోట, ఇంజెరి, బొంగరం, జామిగుడ, కొరవంగి, కుంతుర్ల, రూడకోట.


ముంచంగిపుట్టు మండలం: బూసిపుట్టు, బుంగాపుట్టు, లక్ష్మీపురం, కుమడ, కరిముఖిపుట్టు, బరడ

చింతపల్లి మండలం: కోరుకొండ, బలపం, కుడుముసారె, తమ్మిగుల, చౌడుపల్లి, లోతుగె డ్డ

జీకేవీధి మండలం: దుప్పులువాడ, సీలేరు, ధారకొండ, అమ్మవారి ధారకొండ, జర్రెల, మొండిగెడ్డ, దామునాపల్లి, లక్కవరపేట, పెదవలస.

తెలంగాణలోనూ సాగు

తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌ అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో సాగు కన్నా ఇతర ప్రాంతాల నుంచి రవాణాయే ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఖమ్మం, వరంగల్‌ జిల్లాలలోని మారుమూల ప్రాంతాలు గంజాయి సాగుకు పేరుగాంచాయి. గత ఇరవయ్యేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రైతులు సాగు జోలికి పోవడం లేదు. అయితే, గంజాయి రవాణాకు ఖమ్మం జిల్లా కీలక మజిలీగా మారింది. ఏవోబీ నుంచి తొలుత ఖమ్మం జిల్లాకు వచ్చి, అక్కడి నుంచి సరకు ఇతర ప్రాంతాలకు వెళుతోంది. కోళ్లు, చేపల మాటున గంజాయిని రవాణా చేస్తున్నారు. 1980 నుంచి 1994 వరకు వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గం గంజాయి సాగుకు కేంద్రంగా పేరుగాంచింది. ఎంసీపీఐ నేత ఓంకార్‌ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో నర్సంపేట గంజాయి సాగు గురించి ఢిల్లీ వరకు చిలువలు పలువలుగా చెప్పుకొనే వారు. నక్సల్స్‌ కోసం ఏర్పాటు చేసుకున్న ఇన్ఫార్మర్‌ నెట్‌వర్క్‌ సాయంతో పోలీసులు గంజాయి మాఫియాను కూడా దెబ్బ తీశారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement