విశాఖ కార్మికోద్యమంలో చెరగని ముద్ర

ABN , First Publish Date - 2021-08-02T06:22:59+05:30 IST

ఐదు దశాబ్దాల క్రితం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) నాయకుడిగా విశాఖలో అడుగుపెట్టిన వి.వి.రామారావు...అనంతర కాలంలో ఏఐటీయూసీలో చేరి కార్మిక నేతగా అంచెలంచెలుగా ఎదిగారు.

విశాఖ కార్మికోద్యమంలో చెరగని ముద్ర
వీవీ రామారావు (ఫైల్‌ ఫొటో)

విద్యార్థి దశలోనే వామపక్ష భావాలు... ఏఐఎస్‌ఎఫ్‌లో చేరిక

‘నీలం’ ఆదేశాల మేరకు ఐదు దశాబ్దాల క్రితం విశాఖ రాక

పోర్టు ఏఐటీయూసీలో  పలు పదవుల నిర్వహణ

పోర్టు ట్రస్ట్‌ బోర్డులో కార్మిక ప్రతినిధిగా  సుదీర్ఘకాలం సేవలు

సీపీఐలోనూ కీలక పాత్ర.. జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు

1981లో విశాఖ కార్పొరేటర్‌గా ఎన్నిక

2005లో ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు

విశాఖ స్టీల్‌యూనియన్‌  గౌరవాధ్యక్షుడిగా పదేళ్ల నుంచి సేవలు

అనారోగ్యంతో చికిత్స పొందుతూ  తుదిశ్వాస విడిచిన కార్మిక నేత 

నేడు అంత్యక్రియలు... హాజరుకానున్న వామపక్ష నేతలు


విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి):

ఐదు దశాబ్దాల క్రితం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) నాయకుడిగా విశాఖలో అడుగుపెట్టిన వి.వి.రామారావు...అనంతర కాలంలో ఏఐటీయూసీలో చేరి కార్మిక నేతగా అంచెలంచెలుగా ఎదిగారు. పోర్టులోని కార్మిక కార్యాలయం కార్యదర్శి నుంచి పోర్టు కార్మిక యూనియన్‌ వరకు పలు పదవులు నిర్వహించారు. సీపీఐలోనూ కీలక పాత్రపోషించారు. జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి, ఉపాధ్యక్షునిగా పనిచేశారు. ఒక పర్యాయం కార్పొరేటర్‌ ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ రంగసంస్థల బలోపేతం, పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ కార్మికుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. దీంతో కార్మిక లోకంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

కృష్ణా జిల్లా కైకలూరు తాలూకా భైరవపట్నంలో వేమూరి వెంకటకృష్ణయ్య, సంపూర్ణమ్మ దంపతులకు 1947లో జన్మించిన వి.వి.రామారావు... పదో తరగతి వరకు గూడూరులో చదివారు. మచిలీపట్నంలో పీయూసీ, కర్నూలు జిల్లా నంద్యాలలో పాలిటెక్నిక్‌ పూర్తిచేశారు. పాలిటెక్నిక్‌ చదువుతున్నప్పుడు కమ్యూనిస్టు భావాలకు ఆకర్షితులై ఏఐఎస్‌ఎఫ్‌లో చేరి విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేశారు.  కమ్యూనిస్టు పార్టీ జాతీయ నేత నీలం రాజశేఖరరెడ్డి సూచనతో 1971లో విశాఖ వచ్చి, పోర్టు యూనియన్‌ కార్యాలయంలో కార్యదర్శిగా చేరారు. 1975లో యూనియన్‌ కార్యదర్శిగా, 1980లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నియకయ్యారు.  1984 నుంచి 25 ఏళ్లపాటు పోర్టు ట్రస్ట్‌ బోర్డులో కార్మిక ప్రతినిధిగా పనిచేశారు. కార్మికల స్థితిగతులను మెరుగుపరచడం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. 1995లో ఏఐటీయూసీ అనుబంధ సంస్థ పోర్టు డాక్‌ వాటర్‌ ఫ్రంట్‌ వర్క్‌ర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నియ్యారు.  2005లో ఢిల్లీలో జరిగిన మహాసభలో ఏఐటీయూసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నారు. విశాఖ స్టీల్‌ యూనియన్‌కు పదేళ్ల నుంచి గౌరవధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. చిట్టివలస జ్యూట్‌ కార్మిక సంఘానికి పదేళ్లపాటు గౌరవాధ్యక్షుడిగా పనిచేశారు.1987లో చెకోస్లొవేకియా సందర్శించిన సమైక్య ట్రేడ్‌ యూనియన్‌ ప్రతినిధివర్గానికి రామారావు నాయకత్వం వహించారు. 2003లో క్యూబాలో జరిగిన జాతీయ క్యూబన్‌ కార్మిక మహాసభతోపాటు వియత్నాంలో పర్యటించిన కార్మికవర్గ బృందంలో ఏఐటీయూసీ ప్రతినిధిగా హాజరయ్యారు.

సీపీఐలోనూ పలు బాధ్యతలు

రామారావు సీపీఐలోనూ పలు బాధ్యతలు నిర్వహించారు.  జిల్లా కార్యవర్గ సభ్యుడిగా, పట్టణ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, కార్యదర్శివర్గ సభ్యుడిగా పనిచేశారు. ఉద్యమాల సమయంలో  పోలీసులు అరెస్టు చేయడంతో కొంతకాలం జైలు జీవితం గడిపారు. 1981లో జరిగిన మునిసిపల్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 

 కాగా భౌతికకాయాన్ని సోమవారం ఉదయం ఆస్పత్రి నుంచి ఎంవీపీ కాలనీలోని ఆయన సగృహానికి తీసుకెళతారని, ప్రజలు, కార్మికుల సందర్శనం అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తారు పార్టీ నాయకులు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సీఐపీ, ఏఐటీయూసీ రాష్ట్ర, జాతీయ నేతలు హాజరుకానున్నట్టు చెప్పారు.  



కార్మిక నేత వి.వి.రామారావు కన్నుమూత

విశాఖ పోర్టు ఏయూటీయూసీలో నాలుగు దశాబ్దాలపాటు ముఖ్యభూమిక 

విశాఖపట్నం, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కార్మిక నేత, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు వి.వి.రామారావు(74) ఆదివారం ఉదయం విశాఖలో కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల చికిత్స నిమిత్తం నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులై సీపీఐలో చేరారు. 1971లో విశాఖ పోర్టు ట్రస్టులో ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాల నిమిత్తం విశాఖ చేరుకున్నారు. అప్పటి నుంచి పోర్టులో సీపీఐ అనుంబంధ ఏఐటీయూసీ బలోపేతానికి అవిరళ కృషి చేశారు. కార్మికుల సమస్యలపై ఎప్పుటికప్పుడు పోరాటాలు చేస్తుండేవారు. ఈ క్రమంలో విశాఖలో ప్రముఖ కార్మిక నేతగా ఎదిగారు. ఆల్‌ ఇండియా పోర్టు అండ్‌ డాక్‌యార్డ్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా, హార్బర్‌ అండ్‌ పోర్టు వర్కర్క్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షునిగా వ్యవహరించారు.  రామారావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతిపట్ల సీఐపీ, పలు కార్మిక సంఘాల నేతలు సంతాపం తెలియజేశారు.

Updated Date - 2021-08-02T06:22:59+05:30 IST