రైల్వేకు విశాఖ డీజీల్‌ లోకోషెడ్‌ ఆభరణం

ABN , First Publish Date - 2022-05-28T05:04:04+05:30 IST

ఆసి యాలో అతి పెద్దదైన వాల్తేరు డివిజన్‌ డీజిల్‌ లోకోషెడ్‌ భారతీయ రైల్వేకు ఆభరణమని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతీ అన్నారు.

రైల్వేకు విశాఖ డీజీల్‌ లోకోషెడ్‌ ఆభరణం
లోకోషెడ్‌ వార్షికోత్సవం సందర్భంగా 400 లోకోమోటివ్‌ ప్రారంభిస్తున్న డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతీ, ఇతర అధికారులు

డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతీ

ఘనంగా 57వ వార్షికోత్సవం

విశాఖపట్నం, మే 27: ఆసియాలో అతి పెద్దదైన వాల్తేరు డివిజన్‌ డీజిల్‌ లోకోషెడ్‌ భారతీయ రైల్వేకు ఆభరణమని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సత్పతీ అన్నారు. యాభై ఏడేళ్ల క్రితం (1965లో) ఒకే ఒక 13వ డబ్ల్యూడీఎం-1 లోకోతో ప్రారంభమైన షెడ్‌ అభివృద్ధిలో దూసుకుపోతూ నేడు 400 లోకోలు నిర్వహించే స్థాయికి చేరుకుందని కితాబిచ్చారు. లోకోషెడ్‌ 57వ వార్షికోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది.


ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్‌ఎం మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ డీజిల్‌తోపాటు ఎలక్ట్రికల్‌ లోకోల నిర్వహణ విజయ వంతంగా చేపడుతున్నట్లు తెలిపారు. కేవలం రైల్వే సంస్థ అభివృద్ధి కోసమే కాకుండా కరోనా వంటి విపత్కర సమయంలో ఉద్యోగులు, అధికారుల సంరక్షణ కోసం అనేక ఆవిష్కరణలు చేపట్టి సంస్థ నిధులను ఆదా చేసిందన్నారు.


అనంతరం డీఆర్‌ఎం లోకోషెడ ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్‌ఎంలు సుధీర్‌ కుమార్‌ గుప్తా, మనోజ్‌కుమార్‌ సాహు,  సీనియర్‌ డివిజినల్‌ ఇంజనీర్‌ (డీఎల్‌ఎస్‌) సంతోష్‌కుమార్‌, వాల్తేరు డివిజన్‌ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పారిజాత సత్పతీ, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


400 లోకోమోటివ్‌ ప్రారంభం

డీజిల్‌ లోకోషెడ్‌ వార్షికోత్సవం సందర్భంగా 400వ లోకోమోటివ్‌ను శుక్రవారం డీఆర్‌ఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ లోకోషెడ్‌ మరో మైలురాయికి చేరిందని, ప్రస్తుతం వివిధ సామర్థ్యాల 176 ఎలక్ట్రికల్‌ లోకోలతో సహా మొత్తం 400 లోకోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం విస్తరణలో భాగంగా నిర్మించిన ఎలకా్ట్రనిక్‌ టెస్ట్‌ బెంచ్‌ని కూడా ప్రారంభించారు.  

Updated Date - 2022-05-28T05:04:04+05:30 IST