సమావేశంలో పాల్గొన అఖిలపక్ష నాయకులు
అఖిల పక్ష కార్మిక సంఘాల జేఏసీ పిలుపు
విశాఖపట్నం, జనవరి 28: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 23న చేపడుతున్న విశాఖ బంద్, 24, 25 తేదీల్లో చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. టీడీపీ కార్యాలయంలో శుక్రవారం టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో జేఏసీ నిర్వహించిన విలేఖరుల సమావేశంలో నేతలు మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ఏడాదవుతోందని, ఉక్కు ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాడుతామన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందన్నారు. దేశ భవిష్యత్తు కోసం ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు, టీఎన్‌టీయూసీ నాయకుడు వి.రామ్మోహన్, ఏఐటీయూసీ నాయకుడు పడాల రమణ, వైఆర్‌టీయూసీ నాయకుడు వై.మస్తానప్ప, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ వి.నాగభూషణరావు, వెంకటలక్ష్మి, ఉప్పిలి రామక్రిష్ణ పాల్గొన్నారు.