వైరస్‌ ముంబై

ABN , First Publish Date - 2020-05-29T07:25:11+05:30 IST

దేశ వాణిజ్య రాజధాని ముంబైని కరోనా కమ్మేస్తోంది. అక్కడ గురువారం ఒక్క రోజే 1,438 కొత్త కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35,273...

వైరస్‌ ముంబై

  • ఒక్క రోజులో 1,438 మందికి కరోనా
  • మహారాష్ట్రలో 2,598.. ఢిల్లీలో 1,024 కొత్త కేసులు
  • దేశంలో కొత్తగా 6,566 కొవిడ్‌ కేసులు నమోదు


న్యూఢిల్లీ, మే 28 (ఆంధ్రజ్యోతి): దేశ వాణిజ్య రాజధాని ముంబైని కరోనా కమ్మేస్తోంది. అక్కడ గురువారం ఒక్క రోజే 1,438 కొత్త కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35,273కు చేరింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా గురువారం ఒక్క రోజే 194మంది మరణించారు. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,566 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాకు 4,531మంది బలయ్యారు. వారం రోజుల నుంచి ప్రతి రోజూ ఆరు వేలకుపైగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


కరోనాతో మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 2,598 కొత్త కేసులు నమోదయ్యాయి.  తాజా 134మంది పోలీసులకు కరోనా సోకింది. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడిన మహారాష్ట్ర పోలీసుల సంఖ్య 2,095కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో గురువారం 1,024 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 16వేలు దాటింది. బెంగాల్‌లో గురువారం ఒక్కరోజే 344 కేసులు నమోదయ్యాయి. బెంగాల్‌లో ఒక్కరోజులో ఇన్నికేసులు మొదటిసారి నమోదయ్యాయి. కేరళలో కూడా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గురువారం 84 కేసులు బయటపడ్డాయి. అసోంలో 24మందికి పాజిటివ్‌ వచ్చింది. గడచిన రెండునెలల్లో ఒక్క అహ్మదాబాద్‌లోనే 100కు పైగా వైద్యులు కొవిడ్‌ బారిన పడినట్లు భారతీయ వైద్యమండలి వెల్లడించింది. అందులో చాలామంది డిశ్చార్జ్‌ కూడా అయ్యారని పేర్కొంది. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లోని హమిపూర్‌లో క్వారంటైన్‌లో ఉన్న 15మందిని పరీక్షల ఫలితాలు రాకుండానే ఇళ్లకు పంపేయడం కలకలం సృష్టంచింది. వారికి కరోనా ఉన్నట్లు పరీక్షల్లో బయటపడడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.


తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గురువారం రాష్ట్రంలో 872 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 19,372కు పెరిగింది. చెన్నైలో 559 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తమ విమానాల్లో ప్రయాణించిన 12మందికి పాజిటివ్‌ వచ్చిందని ఇండిగో సంస్థ ప్రకటించింది. వారెవరికీ కరోనా లక్షణాలు లేవని పేర్కొంది.


ఢిల్లీ మునిసిపల్‌ కార్యాయంలో ఒక ఉద్యోగికి కరోనా సోకడంతో కార్యాలయాన్ని మూసివేశారు. కాగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే తా ను కరోనాబారిన పడ్డానని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవధ్‌ వెల్లడించారు. ఇంత తొందరగా తగ్గడం తన అదృష్టమన్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) వల్ల నష్టాల కన్నా.. ఉపయోగాలే ఎక్కువ ఉన్నందున, భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)  మార్గదర్శకాల ప్రకారం దీన్ని వాడొచ్చని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ అన్నారు. కేంద్ర ఆరోగ్యం, కుటుంబసంక్షేమశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 1,58,333 కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు తేలింది. 


సంబిత్ పాత్రకు కరోనా!

బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. గురువారం గురుగ్రామ్‌లోని తమ ఆస్పత్రిలో చేరినట్లు మెదంతా ప్రైవేట్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించాయి. సంబిత్ పాత్ర త్వరగా కోలుకుంటారని బీజేపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఢిల్లీ ఎయిమ్స్‌లో 195 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు ఆ ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి.  


Updated Date - 2020-05-29T07:25:11+05:30 IST