మానవాళిపై వైర(స్‌) ప్రేమ

ABN , First Publish Date - 2020-04-02T05:47:26+05:30 IST

నా యోగం ఎలా ఉందని నా క్షేమం తెలుసుకోవాలని రాత్రనక పగలనక పలకరించిన మిత్రులారా, పేరు తెలియని వారి మరణాలకు చలిస్తున్న ప్రపంచ మానవులారా!...

మానవాళిపై వైర(స్‌) ప్రేమ

నా యోగం ఎలా ఉందని 

నా క్షేమం తెలుసుకోవాలని

రాత్రనక పగలనక పలకరించిన మిత్రులారా, 

పేరు తెలియని వారి మరణాలకు

చలిస్తున్న ప్రపంచ మానవులారా!


కంటికి కనిపించని కోవిడ్‌

కలచివేసి ప్రపంచాన్ని

పలుకరిస్తూ ఎందరినో,

అందిన వారిలో కొందరి

జీవాన్ని నిద్ర పుచ్చుతూ

మిగిలిన వారిలో భయాన్ని మేల్కొలుపుతూ.


మానవులందరినీ మట్టుపెట్టే

మారణాయుధాల గుట్టలపై

కూర్చున్న మనిషి

తన కంటే కోటిరెట్లు పెద్దయిన మనిషి

తనని తాకలేడని నిరూపిస్తూ, పరిహసిస్తూ

మానవుని మేలుకోమంటున్నది.


‘మానవజాతి, సృష్టిలో లక్షల జాతుల్లో

ఒకటి మాత్రమే’ అని

జీవశాస్త్రం బోధిస్తున్నది.


మనిషి మనిషిని మనిషిగా 

మాత్రమే గుర్తిస్తే

మనుషులందరూ ఒక్కటే.


భయపడకండి!

కోవిడ్‌ కూడా ప్రకృతిలో భాగమే!

వందల కోట్ల జీవ చరిత్రలో

నిన్న మొన్న పుట్టిన మనల్ని

తనతో పోటీ పడమని 

మన రోగ నిరోధక శక్తిని పరీక్షిస్తూ

‘దీర్ఘాయుష్మాన్‌’ అని దీవిస్తున్నది.


మనిషి పురోగమనానికి

ప్రకృతి కొత్త ద్వారాలు తెరుస్తుంది.

మానవ పరిణామంలో

కోవిడ్‌ ఒక కొత్త మెట్టు

ఎక్కుదాం మరిన్ని మెట్లు

కలశపూడి శ్రీనివాసరావు, న్యూయార్క్‌

Updated Date - 2020-04-02T05:47:26+05:30 IST