సెక్స్ వర్కర్లపై కరోనా ఎఫెక్ట్.. థాయ్‌ల్యాండ్‌లో..

ABN , First Publish Date - 2020-04-06T06:55:19+05:30 IST

కొవిడ్-19 దెబ్బకు ప్రపంచదేశాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. కరోనాను కట్టడి చేసే క్రమంలో లాక్‌డౌన్ విధించడంతో కంపెనీలు మొత్తం మూతపడ్డాయి.

సెక్స్ వర్కర్లపై కరోనా ఎఫెక్ట్.. థాయ్‌ల్యాండ్‌లో..

బ్యాంకాక్: కొవిడ్-19 దెబ్బకు ప్రపంచదేశాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. కరోనాను కట్టడి చేసే క్రమంలో లాక్‌డౌన్ విధించడంతో కంపెనీలు మొత్తం మూతపడ్డాయి. కంపెనీలతో పాటు రెస్టారెంట్లు తదితర చిన్న చిన్న వ్యాపారాలు కూడా మూతపడటంతో అనేక మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితమైపోయారు. మరోపక్క పడుపు వృత్తిపై ఆధారపడ్డ వారు ప్రస్తుతం ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నామని తమ ఆవేదనను వెల్లగక్కుతున్నారు. ముఖ్యంగా థాయ్‌ల్యాండ్‌లో పడుపు వృత్తిపై ఆధారపడి బతికే వారు చాలా మంది ఉంటారు. కరోనాను నియంత్రించే క్రమంలో థాయ్‌ల్యాండ్ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో బ్యాంకాక్ నుంచి పట్టాయ్ వరకు రెస్టారెంట్లు మొత్తం మూతపడ్డాయి. రాత్రి పది గంటల నుంచి ఉదయం నాలుగు వరకు కర్ఫ్యూను విధించారు. దీంతో పడుపు వృత్తిపై ఆధారపడ్డ దాదాపు మూడు లక్షల మందికి ఉపాధి లేకుండా పోయింది. 


ఏ సమయంలో అయితే తమకు వ్యాపారం ఉంటుందో అదే సమయంలో కర్ఫ్యూ విధించడంతో తమకు డబ్బులు వచ్చే మార్గం లేకుండా పోయిందని సెక్స్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల నుంచి తనకు ఒక్క కస్టమర్ కూడా దొరకలేదని, చెల్లించాల్సిన బిల్లుల సంఖ్య మాత్రం పెరిగిపోతోందని పిమ్ అనే సెక్స్ వర్కర్ తన ఆవేదనను చెప్పింది. ఇదిలా ఉండగా.. ఉపాధి కోల్పోయిన వారికి మూడు నెలల పాటు థాయ్ ప్రభుత్వ ఎమర్జెన్సీ పథకం కింద 150 డాలర్లు(రూ. 11, 450) చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటిచింది. అయితే ఈ పథకానికి పడుపు వృత్తి చేసేవారు అనర్హులు కావడంతో.. ప్రభుత్వం తమను కూడా ఆదుకోవాలని వారు కోరుతున్నారు. తమ లాంటి వారిని ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని పడుపు వృత్తి చేసేవారు తమ కష్టాలను చెప్పుకుంటున్నారు. 

Updated Date - 2020-04-06T06:55:19+05:30 IST