ఉద్యోగులపై వైరస్‌ పంజా

ABN , First Publish Date - 2022-01-18T09:50:13+05:30 IST

కొవిడ్‌పై పోరులో ముందువరుస యోధులు.. వైద్యులు, వైద్యసిబ్బందికి కరోనా! శాంతిభద్రతలు కాపాడే పోలీసులకు..

ఉద్యోగులపై వైరస్‌ పంజా

  • పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు కరోనా
  • ఉస్మానియాలో ఇప్పటిదాకా 150 మంది
  • సిబ్బందికి పాజిటివ్‌.. గాంధీలో 70 మందికి!
  • ఎర్రగడ్డ ఆస్పత్రిలో 9 మంది వైద్యులకూ
  • 900 మందికి పైగా పోలీసులకు పాజిటివ్‌
  • రాష్ట్రంలో కొత్త కేసులు 2447
  • అధికారిక లెక్కలకు మించి పాజిటివ్‌లు!
  • ఎమ్మెల్యే వనమా దంపతులకు కరోనా
  • భట్టి విక్రమార్కకు అపోలో ఆస్పత్రిలో చికిత్స
  • ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌
  • టీడీపీ నేత నారా లోకేశ్‌కు కరోనా


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): కొవిడ్‌పై పోరులో ముందువరుస యోధులు.. వైద్యులు, వైద్యసిబ్బందికి కరోనా! శాంతిభద్రతలు కాపాడే పోలీసులకు.. కరోనా!! పాలనలో కీలకమైన ఐఏఎ్‌సలు, అధికారులు, ప్రభుత్వోద్యోగులకు కరోనా! ‘ఇందుగలదందు లేదని సందేహం వలదు..’ అన్నట్టు విస్తరిస్తున కరోనా.. పాలనా యంత్రాంగంపై పంజా విసురుతోంది. ఆఫీసులో ఒకరిద్దరికి సోకితే చాలు.. ఒకటి రెండు రోజుల్లోనే మిగిలిన వారంతా వైరస్‌ బారినపడుతున్నారు. దీంతో పలు ప్రభుత్వ కార్యాలయాలు బోసిపోయి కనపడుతున్నాయి. రోజువారీ ప్రభుత్వ కార్యాకలపాలకు కొంత మేర బ్రేకు పడుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే మరో వారం, పది రోజుల తర్వాత తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో కీలక భూమిక పోషించే ఐఎఎస్‌, ఐపీఎస్‌ అధికారుల విషయానికి వస్తే.. సీఎంవోలోని ముఖ్యమైన ఐఎఎస్‌ అధికారి ఒకరికి ఇటీవల పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మైనారిటీ వ్యవహరాలు చూసే ఒక ఐపీఎస్‌ అధికారి, ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి కూడా కరోనా బారినపడ్డారు. వైద్య, ఆరోగ్యశాఖలో కీలకంగా ఉండే ఓ ఐఎఎస్‌ అధికారి ఇటీవలే కొవిడ్‌  బారిన పడి కొలుకున్నారు. అటు జనగామ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ (రెవెన్యూ) ఎ.భాస్కర్‌రావుకు కరోనా సోకింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎంపీడీవోతోపాటు, ఆయన కార్యాలయంలో పనిచేస్తున్న మరో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. సోమవారం ఇంటెలిజెన్స్‌, పోలీసు, న్యాయశాఖల్లో 150 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా వారిలో 40 మందికి కరోనా నిర్ధారణ అయింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 12 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు.


ప్రాణదాతలకు ‘పరీక్ష’

ఉస్మానియా వైద్య కళాశాలలో 40 మంది వైద్య విద్యార్థులు, 25 మంది విద్యార్థినులు, ఉస్మానియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఫ్రొఫెసర్లు, పీజీలు, హౌస్‌ సర్జన్లతో కలిసి 85 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఉస్మానియా పరిధిలో ఇప్పటిదాకా కరోనా బారిన పడిన వైద్య సిబ్బంది సంఖ్య సోమవారం నాటికి 150కి చేరింది. అటు గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పీజీ, హౌస్‌సర్జన్లు, జూనియర్‌ వైద్యులు అంతా కలిపి 70 మంది కరోనా బారిన పడ్డారు. అలాగే ఆ ఆస్పత్రిలోని 20 మంది పారిశుధ్య కార్మికులకు పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. ఇక, ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో సోమవారం 286 మంది మానసిక రోగులకు పరీక్షలు నిర్వహించగా 57మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ ఆస్పత్రిలో పనిచేస్తున్న 9 మంది వైద్యసిబ్బంది సైతం వైరస్‌ బారిన పడ్డారు. మంచిర్యాల ఆర్టీసీ డిపోలో నలుగురు సూపర్‌ వైజర్లకు, ఏడుగురు కార్మికులకు.. మొత్తం 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. కోల్‌బెల్ట్‌ సింగరేణిలో కరోనా కలకలం రేపుతోంది. సింగరేణిలో ప్రస్తుతం 913 యాక్టివ్‌ కేసులున్నాయి.


ట్రై కమిషనరేట్స్‌లో..

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 600 మందికి పైగా సిబ్బందికి, రాచకొండలో 120, సైబరాబాద్‌లో 180 మందికి.. మూడు కమిషనరేట్లలో కలిపి 900 మందికి వైరస్‌ సోకింది. తాజాగా పేట్‌బషీరాబాద్‌ పీఎ్‌సలో ఇద్దరు ఎస్‌లతో పాటు ఒక ట్రైనీ ఎస్‌ఐ, ఒక హోంగార్డు కరోనా బారిన పడ్డారు. హయత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ సీఐకి,మరో పది మంది సిబ్బందికి కూడా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. కంచన్‌బాగ్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఎస్‌హెచ్‌వోతో పాటు నలుగురు కానిస్టేబుల్స్‌, ముగ్గురు హోంగార్డులకు కరోనా వచ్చింది. కాగా, సిబ్బంది ఆర్థిక అవసరాలకు రూ.5 వేలు బ్యాంకు ఖాతాలో వేస్తున్నట్టు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. అటు.. యాదగిరిగుట్ట పీఎస్‌ ఏసీసీ, సీఐతోపాటు మరో 10 మంది కానిస్టేబుళ్లు వైరస్‌ బారిన పడ్డారు.


కరోనా సోకిందని ఆత్యహత్య!

కరోనా పాజిటివ్‌ వచ్చిందని హైదరాబాద్‌ నేరేడ్‌మెట్‌లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ ప్రైవేటు సంస్థలో పని చేసే అలెన్‌ ఎడ్వర్డ్‌ ఆంథోనీ(49)కి ఇటీవలే కరోనా సోకింది. దీంతో ఆయన ఆదివారం సీలింగ్‌కు ఉరేసుకున్నారు.

Updated Date - 2022-01-18T09:50:13+05:30 IST