ధర్మానికి దయ, కరుణే మూలం

ABN , First Publish Date - 2020-08-24T06:48:25+05:30 IST

భారతీయతకు ధర్మం ఆధారం. ఒక రకంగా చెప్పాలంటే అదే మతంగా పరిణామం చెందింది. ధర్మం అనే శబ్దానికి.. ఆచారం, నీతి, న్యాయం, పుణ్యం, యజ్ఞం, వేదోక్తవిధి, సత్కార్యం, స్వభావం ఇలా అనేక అర్థాలు చెప్తారు. హిందూ సంస్కృతి హిందూ మహా సముద్రమంత పెద్దది...

ధర్మానికి దయ, కరుణే మూలం

భారతీయతకు ధర్మం ఆధారం. ఒక రకంగా చెప్పాలంటే అదే మతంగా పరిణామం చెందింది. ధర్మం అనే శబ్దానికి.. ఆచారం, నీతి, న్యాయం, పుణ్యం, యజ్ఞం, వేదోక్తవిధి, సత్కార్యం, స్వభావం ఇలా అనేక అర్థాలు చెప్తారు. హిందూ సంస్కృతి హిందూ మహా సముద్రమంత పెద్దది. ఇందులో ఎన్ని మహా నదులు కలుస్తాయో, ఒక్క నదికి ఎన్ని ఉపనదులు, ఆ నదులకెన్ని పిల్ల కాలువలు ఉన్నాయో చెప్పడం సాధ్యం కాదు. ఈ సంస్కృతినే మనం ‘భారతీయత’ అంటాం. భారతి అనగా సరస్వతి అని అర్థం. ఈ సంస్కృతి ఒక సరస్వతీ నదీ ప్రవాహం వంటిది. దీని తీరంలో ఎందరో మహర్షులు ఆశ్రమాలు నిర్మించుకొన్నారు.


అమృతత్వ సిద్ధి కోసం తపోసాధన చేశారు. ఇదంతా పైన జరిగే భౌతిక చర్య. ఆ సరస్వతీ నది ఎలా అంతర్వాహినిగా ప్రవహించిందో అలాగే మన భౌతిక ఆధ్యాత్మిక క్రియలన్నింటికీ ధర్మం ఆధారం. రామాయణంలో శ్రీరాముడు ‘‘రామో విగ్రహవాన్‌ ధర్మః’’ అనిపించుకొన్నాడు. రాముడిని వాల్మీకి మహర్షి ఒక్క మెట్టు కూడా కిందకు దించకుండా ధర్మంపై నడిపిస్తాడు. అలాగే భారతంలో పాండవాగ్రజుడైన యుధిష్ఠిరుడిని ధర్మరాజుగా సంబోధిస్తారు. స్వర్గారోహణ పర్వంలో నరుడు నరోత్తముడిగా మారి పైకి వెళ్లడం ‘ధర్మం’ ఆధారంగానే జరిగింది. ‘‘త్యజోద్ధర్మ దయాహీనం’’ అంటుంది శాస్త్రం. దయలేని ధర్మాన్ని విడిచిపెట్టాలని దీని అర్థం. అంటే.. మన మహర్షులు ధర్మాన్ని దయ, కరుణతో నింపేశారని గహ్రించాలి.


  • ధారణాద్ధర్మ మిత్యాహుః ధర్మోధారయతి ప్రజాః
  • ప్రభవార్ధాయ భూతానాం ధర్మప్రవచనం కృతం


ధరించేంది ధర్మం అని పెద్దలు చెప్తారు. ధర్మమే ప్రజల్ని నిలిపి ఉంచుతుంది. జీవుల ఉత్పత్తి స్థితుల కొరకు ధర్మ ప్రవచనం చేయబడిందని భారతం చెప్పింది. అయితే ధర్మవృక్షానికి వేర్లు దయ, కరుణ అనే గొప్ప గుణాలు. సంప్రదాయాలు మొత్తం ఆ వృక్షం పై భాగంలో కొమ్మలు మనకు లోపలున్న వేర్లు కన్పించవు. అందుకే చెట్టును నరికేసి వట్టిపోయిన కర్రలను అందమైన వస్తువులుగా మార్చి వాడుతుంటాం. అలాగే ధర్మం యొక్క మూల స్వరూపం తెలియకుండా ఆ వేర్లలోని సజీవరూపాలైన దయ, కరుణను వదిలేసి పైనున్న అందమైన వృక్షాన్ని (ధర్మాన్ని) వర్ణిస్తాం; వల్లిస్తాం. మహనీయులు దీనికి అతీతంగా జీవిస్తారు. కొన్నిసార్లు ఇలాంటి నిర్జీవత్వాన్ని తిరస్కరించినట్లు కన్పిస్తారు. కానీ, అది వేర్లకు నీరు పోయడం అని మనం గ్రహించాలి. రమణ మహర్షి అరుణాచలం వచ్చాక ఆయన మాతృమూర్తి వచ్చి అక్కడే ఉన్నారు. ‘‘నా కుమారుడే ఇక్కడ ఆశ్రమంలో గొప్ప గురువు’’ అని ఆమెకు ఒకింత అహంకారం. వంట వండే వాళ్లతో ఆమె ఉల్లి, వెల్లుల్లి గూర్చి గొడవపడేది. అవి తామ సమని ఆమె భావం. అప్పుడప్పుడు మహర్షి ఆమె వినేట్లుగా ‘‘వంటలో ఉల్లి, వెల్లుల్లి వేయవద్దు. అవి పర్వతాలుగా మారి మా అమ్మ మోక్షానికి అడ్డు వస్తాయి’’ అని వంట వారితో అనేవారు.


ధర్మ స్వరూపం తెలిసిన వారి స్వభావం ఇలా ఉంటుంది. అందుకే ధర్మ సంబంధమైన ఏ విషయమైనా దాని వెనుకున్న దయ, కరుణను పట్టుకోవాలి. ప్రతినియమం, ఆచారం, సంప్రదాయం, ఆధ్యాత్మిక ప్రక్రియల ప్రధాన ఉద్దేశం... జీవుడిని దయార్ద్రహృదయుడిగా మార్చడమే.

- డా. పి. భాస్కరయోగి


Updated Date - 2020-08-24T06:48:25+05:30 IST