పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati), లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి (Sai Pallavi) జంటగా వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో తెరకెక్కిన వైవిధ్యమైన చిత్రం ‘విరాటపర్వం’ (Virata Parvam). డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం జూన్ 17న విడుదలై.. పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సాయిపల్లవి నటనపై ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించారు. 30ఏళ్ల క్రితం జరిగిన ఒక యదార్థ సంఘటనని తీసుకుని దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే విడుదలైన రెండు వారాలలోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ చిత్రం జూలై 1వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా.. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
‘‘ప్రేమ మరియు స్వేచ్ఛ కోసం తీవ్రమైన తపన!. తెలుగు, మలయాళం మరియు తమిళంలో జూలై 1న నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతోన్న ‘విరాట పర్వం’ ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు సిద్ధంగా ఉండండి’’ అంటూ.. జూలై 1న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లుగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమ అధికార ట్విట్టర్లో వెల్లడించింది. కాగా, 1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రవన్న (Ravanna) పాత్రలో నటించగా.. వెన్నెల (Vennela) పాత్రలో సాయి పల్లవి నటించింది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథా చిత్రమిది. ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. డానీ సాంచెజ్ లోపెజ్, దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించగా, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చారు.