విరాట్‌.. ది బాస్‌

ABN , First Publish Date - 2020-03-29T09:53:32+05:30 IST

భారత క్రికెట్‌కు సంబంధించి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ‘బాస్‌’లాంటి వాడని ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి కొనియాడాడు. జట్టు సాధించే విజయాల్లో అతడిదే కీలక పాత్ర అని ...

విరాట్‌.. ది  బాస్‌

కోచ్‌ రవిశాస్త్రి  ప్రశంస

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌కు సంబంధించి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ‘బాస్‌’లాంటి వాడని ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి కొనియాడాడు. జట్టు సాధించే విజయాల్లో అతడిదే కీలక పాత్ర అని స్పష్టం చేశాడు. అయితే అతడిపై ఒత్తిడి పడకుండా సహాయక సిబ్బంది సిద్ధంగా ఉంటారని తెలిపాడు. సొంత గడ్డపై వరుసగా 12 టెస్టు విజయాలను నమోదు చేసిన ఏకైక సారథిగా విరాట్‌ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ‘జట్టుకు కెప్టెన్‌ బాస్‌లాంటి వాడే. అదే విషయాన్ని నేనెప్పుడూ నమ్ముతుంటా. మ్యాచ్‌లో ముందుండి నడిపేది అతడే. ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు మేమంతా ఉన్నా కూడా మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సింది కెప్టెన్‌గా కోహ్లీనే. ఇక సహచర ఆటగాళ్లకు అతడు ప్రేరణగా నిలవడంలో ముందుంటాడు. మరోవైపు వారిని సదా సిద్ధంగా ఉంచుతూ మైదానంలో ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొనేలా సహాయక సిబ్బంది ప్రయత్నిస్తుంటారు’ అని రవిశాస్ర్తి వివరించాడు. 


ఫిట్‌నె్‌సలో మార్పు తెచ్చాడు..: భారత క్రికెటర్లలో ఇంతకుముందు కంటే ఇప్పుడు ఫిట్‌నె్‌సపై ఆసక్తి పెరిగిపోయింది. దీనికి ఓ రకంగా కోహ్లీ కారణంగా చెప్పవచ్చు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో విరాట్‌ తర్వాతే ఎవరైనా.. అందుకే అతడిని ప్రేరణగా తీసుకుని మిగతా ఆటగాళ్లు కూడా జిమ్‌లో ఎక్కువగా గడుపుతున్నారని కోచ్‌ శాస్త్రి తెలిపాడు. ‘ఫిట్‌నెస్‌ విషయం తీసుకుంటే విరాట్‌ కోహ్లీ గురించి చెప్పుకోవాల్సిందే. బద్ధకాన్ని దరి చేరనీయడు. ఓ మ్యాచ్‌ ఆడుతున్నాడంటే అందరికంటే అత్యుత్తమ ఫిట్‌నెస్‌ కలిగిన క్రికెటర్‌గా ఉండాలని తపిస్తాడు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తన శరీరాన్ని దృఢంగా మార్చుకుంటాడు. ఇదంతా కేవలం శిక్షణ ద్వారానే సాధించలేదు. సరైన డైట్‌ కోసం ఇష్టమైన ఆహారపు అలవాట్లను కూడా త్యాగం చేశాడు. అందుకే ఓ రోజు హఠాత్తుగా.. ‘రవీ, నేనిప్పుడు శాకాహారిగా మారా’ అని చెప్పాడు. అతడి కఠినమైన అలవాట్లు ఇప్పుడు ఇతరులు కూడా ఫాలో అవుతున్నారు’ అని రవిశాస్త్రి ప్రశంసించాడు.

Updated Date - 2020-03-29T09:53:32+05:30 IST