ఆఖరి అవకాశం

ABN , First Publish Date - 2022-01-11T09:22:53+05:30 IST

దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్రాత్మక సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్న టీమిండియా.. మిగిలిన ఏకైక టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది.

ఆఖరి అవకాశం

తొలి సిరీస్‌ కోసం భారత్‌ ఆరాటం

బరిలోకి విరాట్‌ కోహ్లీ

నేటి నుంచి దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు 


దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్రాత్మక సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్న టీమిండియా.. మిగిలిన ఏకైక టెస్టులో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టెస్టును గెలిచి ఊపు మీదున్న జట్టుకు వాండరర్స్‌లో షాక్‌ తగలడంతో.. ఆఖరి మ్యాచ్‌లోనైనా సర్వశక్తులు ఒడ్డి అద్భుతాన్ని ఆవిష్కృతం చేయాలన్న పట్టుదలతో ఉంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగనుండడం సానుకూలాంశం కానుంది. 


కేప్‌టౌన్‌: భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య హోరాహోరీగా సాగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ చివరి అంకానికి చేరింది. ప్రస్తుతం సిరీస్‌ 1-1తో సమం కావడంతో కేప్‌టౌన్‌ టెస్టుకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. నిర్ణాయక మ్యాచ్‌ కోసం ఇరు జట్లు హోరాహోరీగా పోటీపడనున్నాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు టెస్టు సిరీస్‌ గెలవని భారత్‌కు ఇదే చక్కటి అవకాశం.  దక్షిణాఫ్రికా గడ్డపై తన కెప్టెన్సీలోనే జట్టుకు అపురూప విజయం అందించాలని కోహ్లీ తపన పడుతున్నాడు. అటు రెండో టెస్టులో గెలిచిన జోష్‌లో ఉన్న ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లోనూ పట్టు సడలించకూడదని భావిస్తోంది.

సిరాజ్‌ అవుట్‌.. కోహ్లీ ఇన్‌

తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఈ కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. కానీ పటిష్ట రిజర్వ్‌ బలంతో ఉన్న భారత్‌కు అతడి స్థానాన్ని సులువుగానే భర్తీ చేసే అవకాశం ఉంది. వెటరన్‌ ఇషాంత్‌ శర్మ లేదా ఉమేశ్‌ యాదవ్‌లలో ఒకరు తుది జట్టులోకి వస్తారు. రెండో టెస్టులో శార్దూల్‌ ఠాకూర్‌ మినహా ఎవరూ బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు వెన్నునొప్పి నుంచి కోలుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జట్టులో చేరడంతో బ్యాటింగ్‌ విభాగం పటిష్టం కానుంది. అలాగే కెరీర్‌లో అతడికిది 99వ టెస్టు మ్యాచ్‌ కావడం విశేషం. కానీ ఈ మ్యాచ్‌లో అతడిపై తీవ్ర ఒత్తిడే ఉంది. రెండేళ్లుగా బ్యాటింగ్‌లో విఫలమవుతున్న విరాట్‌ సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. అలాగే ఈ సిరీస్‌ విజయం అతడి కెప్టెన్సీకి కూడా అవసరం. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పుజార, రహానె అర్ధసెంచరీలు సాఽ ధించడంతో విహారికి ఈ మ్యాచ్‌లో చోటు దక్కకపోవచ్చు. బ్యాటింగ్‌ తీరుపై విమర్శలు ఎదుర్కొంటున్న పంత్‌పైనా ఒత్తిడి నెలకొంది. 

జోష్‌లో ఆతిథ్య జట్టు

రెండో టెస్టులో అనూహ్యంగా పోటీలోకొచ్చిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌.. బౌలింగ్‌ విభాగాల్లో అదరగొట్టింది. ముఖ్యంగా కెప్టెన్‌ ఎల్గర్‌ స్ఫూర్తిదాయక ఆటతీరు జట్టును కాపాడింది. అలాగే భారత్‌ను రెండుసార్లు ఆలౌట్‌ చేయడంలో పేసర్లు జాన్సెన్‌, ఒలివియెర్‌ కీలక పాత్ర పోషించారు. దాదాపుగా ఇదే జట్టుతో భారత్‌పై మరో దెబ్బ వేయాలని భావిస్తోంది.


జట్లు (అంచనా)

భారత్‌: రాహుల్‌, మయాంక్‌, పుజార, కోహ్లీ (కెప్టెన్‌), రహానె, పంత్‌, శార్దూల్‌, అశ్విన్‌, షమి, బుమ్రా, ఇషాంత్‌/ఉమేశ్‌.


దక్షిణాఫ్రికా:

ఎల్గర్‌ (కెప్టెన్‌), మార్‌క్రమ్‌, పీటర్సన్‌, డుస్సెన్‌, బవుమా, వెర్రెనీ, జాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, రబాడ, ఒలివియెర్‌, ఎన్‌గిడి.


పిచ్‌

పేసర్లకు స్వర్గధామంలాంటిది. అదనపు బౌన్స్‌తో పాటు చక్కటి పేస్‌ రాబట్టవచ్చు. ఇక్కడ సీమర్లను ఎదుర్కోవడం బ్యాటర్స్‌కు అంత సులువు కాదు. అందుకే నాలుగో ఇన్నింగ్స్‌లో చేజింగ్‌కన్నా ముందుగా బ్యాటింగ్‌కు దిగడం మేలు. ఇక్కడి న్యూలాండ్స్‌ మైదానంలో భారత్‌ ఇప్పటివరకు టెస్టు మ్యాచ్‌ను గెలవలేదు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు ఓటములు, రెండు డ్రాలున్నాయి.

Updated Date - 2022-01-11T09:22:53+05:30 IST