కోహ్లీ ఒక్కడే

ABN , First Publish Date - 2022-01-12T09:19:49+05:30 IST

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ తొలిరోజే ఆలౌటైంది. అయితే విరాట్‌ కోహ్లీ (201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 79) మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలిచి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.

కోహ్లీ ఒక్కడే

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 223 ఆలౌట్‌

రబాడకు 4 వికెట్లు 

దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌ 17/1


భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎట్టకేలకు బ్యాట్‌ ఝుళిపించాడు. రెండేళ్ల విరామం తర్వాత సుదీర్ఘ సమయం క్రీజులో నిలిచిన అతడు కళాత్మక ఇన్నింగ్స్‌ను ప్రదర్శించాడు. పేసర్‌ రబాడ నిప్పులు చెరిగే బంతులను దీటుగా ఎదుర్కొన్న కోహ్లీ.. తన బలహీనతగా మారిన ఆఫ్‌ స్టంప్‌నకు ఆవలి బంతులను వదిలేస్తూ సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగాడు. అయితే శతకానికి కాస్త దూరంలో వెనుదిరగాల్సి వచ్చింది. పుజార, పంత్‌ మినహా మరెవరూ కెప్టెన్‌కు అండగా నిలవలేకపోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.


కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ తొలిరోజే ఆలౌటైంది. అయితే విరాట్‌ కోహ్లీ (201 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో 79) మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలిచి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆతిథ్య పేసర్లు రబాడ (4/73), జాన్సెన్‌ (3/55) కట్టుదిట్టమైన బంతులతో ఇబ్బందిపెట్టారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 77.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. పుజార (77 బంతుల్లో 7 ఫోర్లతో 43), పంత్‌ (50 బంతుల్లో 4 ఫోర్లతో 27) మాత్రమే ఓ మాదిరిగా ఆడారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికాను బుమ్రా వణికించాడు. వేసిన 4 ఓవర్లలో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా కెప్టెన్‌ ఎల్గర్‌ (3)ను అవుట్‌ చేయడంతో సఫారీలకు గట్టి షాక్‌ తగిలింది. చివరకు మంగళవారం ఆట ముగిసేసరికి ఆ జట్టు 8 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 17 రన్స్‌ చేసింది. క్రీజులో మార్‌క్రమ్‌ (8 బ్యాటింగ్‌), కేశవ్‌ (6) ఉన్నారు. రెండోరోజు భారత బౌలర్లు శక్తిమేరా చెలరేగాలి. 


ఆదుకున్న పుజార, కోహ్లీ:

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. తొలి గంటపాటు ఆతిథ్య జట్టు బౌలర్లదే హవా నడిచింది. ముఖ్యంగా రబాడ, ఒలివియెర్‌ కట్టుదిట్టమైన బంతులకు పరుగులు రావడం కష్టమైంది. ఫామ్‌లో ఉన్న రాహుల్‌ (12), మయాంక్‌ అగర్వాల్‌ (15) వరుస ఓవర్లలో పెవిలియన్‌ చేరడంతో భారత్‌కు షాక్‌ తగిలింది. ఒలివియెర్‌ వేసిన షార్ట్‌బాల్‌ను ఆడడంలో విఫలమైన రాహుల్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. ఇక రబాడ ఓవర్‌లో మయాంక్‌ బంతిని మిడాన్‌లో పుష్‌ చేద్దామని ప్రయత్నించి స్లిప్‌లో మార్‌క్రమ్‌కు చిక్కాడు. దీంతో 33 రన్స్‌కే జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పుజార, కోహ్లీ ప్రమాదకర బంతులను టచ్‌ చేయకుండా ఓపిగ్గా ఆడారు. ఆత్మవిశ్వాసంతో కనిపించిన పుజార నాలుగు బౌండరీలు సాధించాడు. మరోవైపు కోహ్లీ ఆచితూచి ఆడాడు. దీంతో భారత్‌ 75/2 స్కోరుతో లంచ్‌ బ్రేక్‌కు వెళ్లింది.


పట్టుదలగా..:

రెండో సెషన్‌లోనూ రబాడ నుంచి వచ్చిన బుల్లెట్‌లాంటి బంతులను ఎదుర్కోవడంలో కోహ్లీ అద్భుత డిఫెన్స్‌ను కనబరిచాడు. 41వ ఓవర్‌లో పుల్‌ షాట్‌తో సూపర్‌ సిక్సర్‌ సాధించాడు. ఈ సెషన్‌లో 66 పరుగులు సాధించిన భారత్‌ 2 వికెట్లను కోల్పోయింది. కుదురుకున్న పుజారను జాన్సెన్‌ అవుట్‌ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక 12 బంతులే ఆడిన రహానె (9).. రబాడ ఓవర్‌లో అవుటై నిరాశపరిచాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన పంత్‌ను ప్రత్యర్థి బౌన్సర్లతో ఇబ్బందిపెట్టినా వికెట్‌ కాపాడుకున్నాడు.


కోహ్లీకి సహకారం కరవు:

ఆఖరి సెషన్‌లో సఫారీ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. వీరి ధాటికి చివరి 6 వికెట్లను భారత్‌ 56 పరుగులు వ్యవధిలోనే కోల్పోయింది. కోహ్లీ-పంత్‌ నుంచి కీలక భాగస్వామ్యం ఏర్పడుతున్న దశలో జాన్సెన్‌ మరోసారి భారత్‌ను దెబ్బతీశాడు. ఐదో వికెట్‌కు 51 రన్స్‌ జత చేరాక పంత్‌ వికెట్‌ను జాన్సెన్‌ తీశాడు. తన మరుసటి ఓవర్‌లోనే అశ్విన్‌ (2)ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. అటు ఫోర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ ఆ తర్వాత వేగం పెంచి జాన్సెన్‌ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. కానీ మరో ఎండ్‌లో వికెట్ల పతనం జోరందుకుంది. ఉన్న కాసేపు సిక్స్‌, ఫోర్‌తో వేగం చూపిన శార్దూల్‌ ఠాకూర్‌ (12)ను కేశవ్‌ అవుట్‌ చేయగా.. కాసేపటికే బుమ్రా డకౌటయ్యాడు. దీంతో ఏకాగ్రత కోల్పోయిన కోహ్లీ చివరకు రబాడ చేతికే చిక్కాడు. 73వ ఓవర్‌లో కీపర్‌ వెర్రెన్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆఖరి వికెట్‌ను ఎన్‌గిడి తీయడంతో భారత్‌ ఆలౌటైంది. 


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) వెర్రెన్‌ (బి) ఒలివియెర్‌ 12; మయాంక్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) రబాడ 15; పుజార (సి) వెర్రెన్‌ (బి) జాన్సెన్‌ 43; కోహ్లీ (సి) వెర్రెన్‌ (బి) రబాడ 79; రహానె (సి) వెర్రెన్‌ (బి) రబాడ 9; పంత్‌ (సి) పీటర్సన్‌ (బి) జాన్సెన్‌ 27; అశ్విన్‌ (సి) వెర్రెన్‌ (బి) జాన్సెన్‌ 2; శార్దూల్‌ (సి) పీటర్సన్‌ (బి) కేశవ్‌ 12; బుమ్రా (సి) ఎల్గర్‌ (బి) రబాడ 0; ఉమేశ్‌ (నాటౌట్‌) 4; షమి (సి) బవుమా (బి) ఎన్‌గిడి 7; ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 77.3 ఓవర్లలో 223 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-31, 2-33, 3-95, 4-116, 5-167, 6-175, 7-205, 8-210, 9-211, 10-223. బౌలింగ్‌: రబాడ 22-4-73-4; ఒలివియెర్‌ 18-5-42-1; జాన్సెన్‌ 18-6-55-3; ఎన్‌గిడి 14.3-7-33-1; కేశవ్‌ 5-2-14-1.


దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌:

ఎల్గర్‌ (సి) పుజార (బి) బుమ్రా 3; మార్‌క్రమ్‌ (బ్యాటింగ్‌) 8; కేశవ్‌ మహరాజ్‌ (బ్యాటింగ్‌) 6; మొత్తం: 8 ఓవర్లలో 17/1. వికెట్ల పతనం: 1-10.బౌలింగ్‌: బుమ్రా 4-4-0-1; ఉమేశ్‌ 2-0-10-0; షమి 2-0-7-0.


2019 తర్వాత కోహ్లీ 200+ బంతులెదుర్కోవడం ఇదే తొలిసారి

టెస్టు కెరీర్‌లో కోహ్లీకిది రెండో నెమ్మదైన అర్ధసెంచరీ (158 బంతుల్లో). 2012/13లో ఇంగ్లండ్‌పై ఎక్కువ (171) 

బంతులు ఆడాడు.

దక్షిణాఫ్రికాలో జరిగిన టెస్టుల్లో ఎక్కువ పరుగులు (690) చేసిన రెండో భారత బ్యాటర్‌గా విరాట్‌ కోహ్లీ. ద్రవిడ్‌ (624)ను అధిగమించగా జాబితాలో సచిన్‌ (1161) ముందున్నాడు.

Updated Date - 2022-01-12T09:19:49+05:30 IST