రాహుల్ ద్రవిడ్ రికార్డుపై కన్నేసిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ

ABN , First Publish Date - 2021-12-22T00:39:36+05:30 IST

టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డుపై టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై..

రాహుల్ ద్రవిడ్ రికార్డుపై కన్నేసిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ కోహ్లీ

సెంచూరియన్: టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ రికార్డుపై టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కన్నేశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై రాహుల్ 22 ఇన్నింగ్స్‌లలో 29.71 సగటుతో 624 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ ఇప్పుడీ రికార్డుకు చేరువలో ఉన్నాడు.


సాతాఫ్రికాలో కోహ్లీ కేవలం 10 ఇన్నింగ్స్‌లలో 55.80 సగటుతో 558 పరుగులు చేశాడు. ద్రవిడ్ రికార్డును బద్దలుగొట్టేందుకు కోహ్లీ 66 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ నెల 26న సెంచూరియన్‌లో ప్రారంభం కానున్న తొలి టెస్టులో కనుక కోహ్లీ ఈ పరుగులు సాధిస్తే ద్రవిడ్ రికార్డు బద్దలవుతుంది. 


సౌతాఫ్రికా గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లలో కోహ్లీ ఓవరాల్‌గా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో ద్రవిడ్‌ను కోహ్లీ అధిగమిస్తే రెండో స్థానానికి చేరుకుంటాడు. హైదరాబాద్ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ మూడో స్థానానికి దిగజారుతాడు. లక్ష్మణ్ 18 ఇన్నింగ్స్‌లలో 556 పరుగులు చేశాడు.


ఈ జాబితాలో కోహ్లీ అగ్రస్థానానికి చేరుకునేందుకు చాలా దూరంలో ఉన్నాడు. ఈ స్థానంలో బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ 15 టెస్టుల్లో 46.44 సగటుతో 1161 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

 

అయితే, భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్టుల్లో ద్రవిడ్ సాధించిన పరుగుల రికార్డును చేరుకోవాలంటే మాత్రం కోహ్లీ 177 పరుగులు చేయాల్సి ఉంటుంది. ద్రవిడ్ మొత్తంగా 1252 పరుగులు చేయగా,  కోహ్లీ 12 మ్యాచుల్లో 1075 పరుగులు చేశాడు. ఈ విషయంలోనూ సచిన్‌దే అగ్రస్థానం. టెండూల్కర్ 25 టెస్టుల్లో 1741 పరుగులు చేశాడు. సెహ్వాగ్ 15 టెస్టుల్లో 1306 పరుగులు చేశాడు. 

Updated Date - 2021-12-22T00:39:36+05:30 IST