Virat Kohli: క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలన్న సలహాలపై కోహ్లీ స్పందన ఇదే

ABN , First Publish Date - 2022-05-20T02:33:37+05:30 IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. గత కొంతకాలంగా అతడి బ్యాట్ నుంచి పరుగులు

Virat Kohli: క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలన్న సలహాలపై కోహ్లీ స్పందన ఇదే

ముంబై: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. గత కొంతకాలంగా అతడి బ్యాట్ నుంచి పరుగులు రావడం గగనమవుతోంది. అతడి బ్యాట్ మొరాయిస్తోంది. ఇక ఐపీఎల్‌లో అయితే, ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్కోరు ఒక్కటి కూడా అతడి ఖాతాలో లేదు. ఈ నేపథ్యంలో అతడు క్రికెట్‌కు కొంతంకాలం బ్రేక్ తీసుకుంటే బాగుంటుందని పలువురు మాజీ క్రికెటర్లు సూచించారు. వీరిలో మహమ్మద్ అజారుద్దీన్ నుంచి కెవిన్ పీటర్సన్ వరకు ఉన్నారు.  అయితే, సునీల్ గవాస్కర్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా స్పందించాడు.  కోహ్లి ఎంత ఎక్కువగా ఆడితే మళ్లీ పరుగులు సాధించే అవకాశాలు మెరుగవుతాయని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.


తనకు వస్తున్న సలహాలు, సూచనలపై తాజాగా కోహ్లీ స్పందించాడు. క్రికెట్‌ నుంచి విరామం తీసుకోమని చాలామంది చెప్పలేదన్నాడు. అలా అని చెప్పింది ఒకే ఒక్క వ్యక్తి అని, అతడు మరెవరో కాదని, రవిభాయ్ (రవిశాస్త్రి) అని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే రవిశాస్త్రి తనను ఆరేడేళ్లపాటు అతి దగ్గరగా తానున్న వాస్తవ పరిస్థితులను చూశాడని పేర్కొన్నాడు. ఏడేళ్లపాటు మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ చేయడం, దీనికి తోడు  10-11 సంవత్సరాలపాటు ఐపీఎల్‌లో నాన్ స్టాప్‌గా ఆడడం వల్ల ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నాడు. 


గత నెలలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. కోహ్లీ మరీ ఎక్కువ క్రికెట్ ఆడేశాడని, అంతర్జాతీయ క్రికెట్‌ను పొడిగించుకునేందుకు కొంత విశ్రాంతి అవసరమని అన్నాడు. జట్టులో ఎవరికైనా విశ్రాంతి అవసరం అనుకుంటే అది కోహ్లీకేనని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు కానీ, తర్వాత  కానీ రెండు నెలలు, లేదంటే నెలన్నరా అయినా కోహ్లీకి విశ్రాంతి అవసరమని శాస్త్రి వివరించాడు. కోహ్లీ మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్య కారణాలతో ఇటీవల బెన్‌స్టోక్స్ బ్రేక్ తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ.. విరామం తీసుకోవడం తప్పేమీ కాదన్నాడు.   

Updated Date - 2022-05-20T02:33:37+05:30 IST