ఓ పాకిస్థానీగా నేను చెప్పేది ఇదే అంటూ.. కోహ్లీని ఆకాశానికెత్తేసిన Shoaib Akhtar

ABN , First Publish Date - 2022-06-01T00:47:15+05:30 IST

పరుగుల యంత్రంగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్ గత కొన్నేళ్లుగా కలవరపెడుతోంది. 2019 నుంచి

ఓ పాకిస్థానీగా నేను చెప్పేది ఇదే అంటూ.. కోహ్లీని ఆకాశానికెత్తేసిన Shoaib Akhtar

కరాచీ: పరుగుల యంత్రంగా పేరుగాంచిన విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్ గత కొన్నేళ్లుగా కలవరపెడుతోంది. 2019 నుంచి ఒక్క అంతర్జాతీయ సెంచరీ కూడా అతడి ఖాతాలో చేరలేదు. ఇటీవలే ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లోనూ అంచనాల మేర రాణించలేకపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ 16 మ్యాచుల్లో 341 పరుగులు మాత్రమే సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీపై మాజీ క్రికెటర్లు మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 


పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) మాత్రం కోహ్లీకి అండగా నిలిచాడు. అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ గురించి మంచే చెప్పాలని, అతడి గౌరవించాలని పేర్కొన్న అక్తర్.. కోహ్లీ ఆల్‌ టైం గ్రేటెస్ట్ ప్లేయర్ అని కొనియాడాడు. ఓ పాకిస్థానీగా తాను చెబుతున్నది ఇదేనని అన్నాడు. కోహ్లీ 110 సెంచరీలు చేస్తాడని, ఈ విషయంలో పందెం కాయడానికి కూడా తాను సిద్ధమని ‘స్పోర్ట్స్‌కీడా క్రికెట్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 


ఆ తర్వాత కోహ్లీకి నేరుగా ఇచ్చిన సందేశంలో.. ‘‘నువ్వెవరికీ భయపడకు. 45 ఏళ్ల వచ్చే వరకు ఆడగలవు. ప్రస్తుత పరిస్థితులు నిన్న 110 సెంచరీలు సాధించే దిశగా పురికొల్పుతున్నాయి. కొందరు నీ భార్య, చిన్నారిపై ట్వీట్లు చేస్తారు. ఇంతకుమించిన దరిద్రం ఉండదు. ఆ ప్రకృతే నిన్న 110 సెంచరీలు సాధించేలా నిన్న సన్నద్ధం చేస్తోంది. నా మాటలు నీ మనసులో పెట్టుకో. ఈ రోజు నుంచే నువ్వు కఠిన సాధన ప్రారంభించు’’ అని అక్తర్ సూచించాడు. అక్తర్ వ్యాఖ్యలు కోహ్లీలో ప్రేరణ నింపాలని, మరోమారు మునుపటి ఫామ్‌ సాధించి అద్భుతాలు చేయాలని కోహ్లీ అభిమానులు ఆశిస్తున్నారు.


Updated Date - 2022-06-01T00:47:15+05:30 IST