ముంబై చేరుకున్న కోహ్లీ.. ఆ వెంటనే కొవిడ్ రిలీఫ్ పనుల్లోకి!

ABN , First Publish Date - 2021-05-06T23:44:20+05:30 IST

ఐపీఎల్ వాయిదా పడడడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంబై చేరుకున్నాడు. ఆ వెంటనే

ముంబై చేరుకున్న కోహ్లీ.. ఆ వెంటనే కొవిడ్ రిలీఫ్ పనుల్లోకి!

ముంబై: ఐపీఎల్ వాయిదా పడడడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ముంబై చేరుకున్నాడు. ఆ వెంటనే కొవిడ్ సహాయక కార్యక్రమాలకు సంబంధించిన పనుల్లో బిజీ అయిపోయాడు. ఈ నెల 1న బర్త్ డే జరుపుకున్న అనుష్క శర్మ ఓ వీడియోను షేర్ చేసింది. తాను, కోహ్లీ కలిసి కొవిడ్ రిలీఫ్ కోసం ‘ఓ ఉద్యమం’ చేపట్టనున్నట్టు అందులో పేర్కొంది. తాజాగా ముంబై చేరుకున్న కోహ్లీని శివసేన యూత్ వింగ్ సభ్యుడు రాహుల్ ఎన్. కనల్‌ను కలిసి కరోనా సహాయ కార్యక్రమాలకు సంబంధించి చర్చించాడు. కోహ్లీని కలిసి చర్చించిన విషయాన్ని రాహుల్ ట్వీట్ చేశారు. కెప్టెన్‌ను కలిశానని, అతడు మొదలుపెట్టిన కొవిడ్ రిలీఫ్ ‘ఉద్యమం’పై గౌరవం, ప్రేమ ఉన్నాయని అందులో పేర్కొన్నారు. కోహ్లీని కలిసి మాట్లాడుతున్న ఫొటోలను షేర్ చేశారు.   


కోహ్లీ ఫ్రాంచైజీ ఆర్సీబీ కూడా కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఆక్సిజన్ సంబంధిత సేవలు, మౌలిక సదుపాయాల కోసం అవసరమైన ఆర్థికసాయం అందిస్తామని ఇది వరకే ప్రకటించింది. అలాగే, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సంఘీభావంగా బ్లూ జెర్సీ ధరించాలని యోచిస్తున్నట్టు తెలిపింది. అయితే, అంతకంటే ముందే టోర్నీ వాయిదా పడింది. ఐపీఎల్‌లోని పలు జట్ల ఆటగాళ్లు కరోనా బారినపడడంతో అప్రమత్తమైన బీసీసీఐ టోర్నీని నిరవధికంగా వాయిదా వేసింది. ఫలితంగా ఐపీఎల్ అర్ధంతరంగా ముగిసింది. 

Updated Date - 2021-05-06T23:44:20+05:30 IST