Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 25 Jan 2022 02:20:52 IST

విరాట్‌చంద్రకు బాల పురస్కారం

twitter-iconwatsapp-iconfb-icon
విరాట్‌చంద్రకు బాల పురస్కారం

‘కిలిమంజారో’ని అధిరోహించిన తెలంగాణ బాలుడు

ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొన్న ఏపీ బాలిక

గురుగు హిమప్రియకు సాహస బాలల విభాగంలో..

దేశవ్యాప్తంగా 29 మంది బాలలకు పురస్కారాలు

ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు అందజేసిన ప్రధాని మోదీ


న్యూఢిల్లీ/తిరుమలగిరి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ చిన్నారి తేలుకుంట్ల విరాట్‌చంద్రకు జాతీయ బాల పురస్కారం లభించింది. దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన బాలలకు అందించే ఈ పురస్కారం విరాట్‌చంద్రకు క్రీడా విభాగంలో దక్కింది. దేశ వ్యాప్తంగా 14 మంది బాలికలు సహా మొత్తం 29 మందికి కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు బాలలు ఎంపికయ్యారు. వీరిలో ఒకరు హైదరాబాద్‌కు చెందిన విరాట్‌చంద్ర కాగా, మరొకరు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలిక గురుగు హిమప్రియ. ఆన్‌లైన్‌ ద్వారా కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఈ అవార్డులను అందజేశారు. అదే సమయంలో అవార్డు గ్రహీతలకు ప్రధాని నరేంద్రమోదీ.. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ద్వారా డిజిటల్‌ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. వారితో ప్రధాని మోదీ వర్చువల్‌గా సంభాషించారు. కాగా, ఉగ్రవాదులను ధైర్యంగా ఎదుర్కొన్నందుకుగాను సాహసబాలల విభాగంలో హిమప్రియకు అవార్డు దక్కింది. హిమప్రియ తండ్రి ఆర్మీలో పనిచేస్తున్న హవల్దార్‌ గురుగు సత్యనారాయణ, ఆయన భార్య పద్మావతి, ముగ్గురు పిల్లలతో జమ్ము కశ్మీర్‌లో ఆర్మీ నివాస క్వార్టర్లలో నివసిస్తున్నప్పుడు 2018 ఫిబ్రవరి 10న ఆయన ఇంట్లో లేని సమయంలో వారి ఇంటిపై దాడి చేయడానికి జైషే మహమ్మద్‌ సంస్థకు చెందిన ఉగ్రవాదులు వచ్చారు. వారి గ్రనేడ్‌కు పద్మావతి తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో తన తల్లిని, చెల్లెళ్లను కాపాడుకునేందుకు ఎనిమిదేళ్ల హిమప్రియ ధైర్యంగా గది తలుపులను తెరిచి ఏకంగా గంటసేపు ఉగ్రవాదులతో మాట్లాడి తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఒప్పించింది. ఆస్పత్రికి వెళ్తూ.. కొంతదూరం వెళ్లిన తర్వాత ఆర్మీ వర్గాలనూ అప్రమత్తం చేసింది. ఆమె ఽధైర్యసాహసాలకు మెచ్చి ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది.  


మైదానాల నుంచి కిలిమంజారో వరకు

సికింద్రాబాద్‌  తిరుమలగిరికి చెందిన తేలుకుంట్ల విరాట్‌ చంద్ర(7) బాలంరాయిలోని గీతాంజలి పాఠశాలలో 3వ తరగతి చదుతున్నాడు. క్రీడల పట్ల విరాట్‌ చంద్ర ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి శరత్‌చంద్ర, కోచ్‌ తమ్మినేని భరత్‌ వద్ద శిక్షణ ఇప్పించారు. లాల్‌ బజార్‌ పరిసర ప్రాంతాల్లోని రక్షణ శాఖ మైదానాల్లో రోజుకు 8 కిలోమీటర్లు వాకింగ్‌ చేసేవాడు. ప్రపంచంలోనే అతి పిన్న వయసులోనే కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించిన విరాట్‌కు ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వరించాయి. 


యువత కేంద్రంగా ప్రభుత్వ విధానాలు..

ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న విధానాలన్నీ దేశంలోని యువత కేంద్రంగా రూపొందిస్తున్నవేనని ప్రధాన నరేంద్రమోదీ అన్నారు. సోమవారం ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కార గ్రహీతలతో ఆన్‌లైన్‌ ముఖాముఖి కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో బాలికల సాధికారతకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. బాలికలను గౌరవించడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని ట్విటర్‌లో ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.