ప్రబలుతున్న జ్వరాలు

ABN , First Publish Date - 2022-05-29T06:36:50+05:30 IST

నగర పరిధిలో వైరల్‌ ఫీవర్స్‌ పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు, తీవ్ర స్థాయిలో ఎండలు ఇందుకు కారణమని వైద్యులు పేర్కొంటున్నారు.

ప్రబలుతున్న జ్వరాలు

వాతావరణ మార్పులతో భారీగా పెరుగుతున్న బాధితులు

డెంగ్యూ, మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయంటున్న వైద్యులు

అప్రమత్తంగా ఉండాలని సూచన

కొంతకాలం బయట ఆహారానికి దూరంగా ఉండాలి

 

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పరిధిలో వైరల్‌ ఫీవర్స్‌ పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు, తీవ్ర స్థాయిలో ఎండలు ఇందుకు కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే అడపాదడపా కురుస్తున్న వర్షాల వల్ల దోమలు వ్యాప్తి చెందడంతో మలేరియా, డెంగ్యూ కేసులు కూడా వస్తున్నట్టు చెబుతున్నారు. గత వారం నుంచి వైరల్‌ ఫీవర్స్‌, డెంగ్యూ, మలేరియా కేసులు అధికంగా వస్తున్నాయంటున్నారు. వైరల్‌ ఫీవర్స్‌తో బాధపడుతున్న వారిలో ఎక్కువగా జలుబు, దగ్గు, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, గొంతునొప్పి ఉంటున్నాయంటున్నారు. దీనికి సడన్‌ వేరియేషన్స్‌ ప్రధాన కారణమంటున్నారు. అంటే, బయట తీవ్రమైన ఎండ నుంచి ఇళ్లు, ఆఫీస్‌లకు వచ్చి ఒక్కసారిగా ఏసీ రూముల్లో సేదతీరడం, దాహార్తిని తీర్చుకునేందుకు చల్లని నీటిని తాగడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ వైరల్‌ ఫీవర్స్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశముందని, అందువల్ల ఇంట్లో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్టయితే కొవిడ్‌ సమయంలో తీసుకున్నట్టు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఫుడ్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వల్ల వాంతులు, విరేచనాలు వంటి సమస్యతో కొంతమంది వస్తున్నారని, వారిలోనూ జ్వరం వంటి లక్షణాలుంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొద్దిరోజులపాటు బయట ఆహారానికి దూరంగా ఉండాలని  సూచిస్తున్నారు. 


డెంగ్యూ, మలేరియా

వైరల్‌ ఫీవర్స్‌తోపాటు డెంగ్యూ, మలేరియా కేసులు వస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట వర్షాలు కురిశాయి. దీంతో అనేకచోట్ల నీరు చేరింది. ఆయా ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ, మలేరియా ప్రబలుతున్నాయంటున్నారు. డెంగ్యూ బారినపడిన వారిలో సాధారణ జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు, వికారం, వాంతులు, మలేరియా బారినపడిన వారిలో తీవ్రమైన చలి జ్వరం కనిపిస్తాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.


కేసులు పెరిగాయి

- డాక్టర్‌ రామనరసింహం, ప్రముఖ వైద్య నిపుణులు

ఫీవర్స్‌ కేసులు కొద్దిరోజులుగా భారీగా వస్తున్నాయి. తీవ్రమైన ఒళ్లు నొప్పులు, జాయింట్‌ పెయిన్స్‌ ఉంటే డెంగ్యూగా, చలి జ్వరం వుంటే మలేరియాగా అనుమానించాలి. ఇక వైరల్‌ ఫీవర్స్‌తో బాధపడే వారిలో గొంతు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలుంటున్నాయి. ఐదు రోజులకు మించి జ్వరాలు ఉండవు. మొదటిరోజే వైద్యులను సంప్రతించి మందులు వాడాలి. డెంగ్యూ, మలేరియాకు తప్ప వైరల్‌ ఫీవర్‌కు పరీక్షలు అవసరం లేదు. వైద్యులు సూచన మేరకు మందులు వాడితే చాలు. 

Updated Date - 2022-05-29T06:36:50+05:30 IST