జ్వరంతో వణుకుతున్న జిల్లా

ABN , First Publish Date - 2022-01-20T05:52:17+05:30 IST

జ్వరాలతో జిల్లా వణికిపోతోంది.

జ్వరంతో వణుకుతున్న జిల్లా
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌ పరీక్షలకోసం వచ్చిన బాధితులు

ఎక్కడో ఉందనుకున్న ఒమైక్రాన్‌ సునామీలా జిల్లాను ముంచెత్తింది.ఈ రోజో, రేపో అనుకుంటుండగానే మూడో వేవ్‌  ముట్టడి మొదలైపోయింది. ప్రభుత్వ లెక్కలకీ వాస్తవానికీ పొంతనే లేదు. కొవిడ్‌ బాధితుల సంఖ్య అధికారిక లెక్కలకన్నా వెయ్యి రెట్లు ఎక్కువే ఉండవచ్చని తెలుస్తోంది. జిల్లాలో లక్షల సంఖ్యలోనే జ్వరాలతో ఉన్నారని అంచనా.పరీక్షలు చేయకపోవడం వల్ల వీరిలో కొవిడ్‌ బాధితులు ఎందరో తెలీదు. ఆక్సిజన్‌ అవసరం లేకపోవడం, మరణాల సంఖ్య ఆందోళనకరంగా లేకపోవడం వల్ల అటు అధికార యంత్రాంగమూ, ఇటు ప్రజలూ కూడా కొవిడ్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారు. ప్రభుత్వం టెస్టుల సంఖ్యను గణనీయంగా తగ్గించేసింది. ప్రజలు కూడా పరీక్షలకు వెళ్లకుండా మాత్రలతో సరిపెట్టుకుంటున్నారు. అయితే, సెకండ్‌ వేవ్‌ కాలంలా వణికిపోయే పరిస్థితులు లేవుగానీ, అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం ప్రమాదకరస్థితికి దగ్గరయ్యేవారి సంఖ్య నిదానంగా పెరిగే ముప్పు పొంచివుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 


తిరుపతి- ఆంధ్రజ్యోతి

జ్వరాలతో జిల్లా వణికిపోతోంది. కరోనా జ్వరమా? సాధారణ  జ్వరమా అని నిర్ధారణ చేసే పరీక్షలు చేయకుండానే వేలాదిమంది బాధితులవుతున్నారు.  కరోనా పరీక్ష చేసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు వెళితే, కిట్లు లేవని తిప్పిపంపేస్తున్నారు. దీంతో కొందరు బాధితులు కరోనా ఉన్నట్టుగా భావిస్తూ దానికి సంబంధించిన మందులను షాపుల్లో కొనుక్కుని వాడుతున్నారు. ఇంకొందరేమో సాధారణ జ్వరాలకు వాడే పారాసిటమాల్‌ వేసేసుకుని ఉండిపోతున్నారు. మరికొందరు డబ్బులు ఖర్చుపెట్టుకుని ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. లేదా సెల్ఫ్‌ కిట్లతో చెక్‌ చేసుకుంటున్నారు.


తిరుపతిలోనే లక్షమందికి జ్వరం


తిరుపతిలోని స్విమ్స్‌, రుయాలతో పాటు కొన్ని ప్రైవేట్‌ ల్యాబ్స్‌, ఆస్పత్రులలో కొవిడ్‌ పరీక్షలు చేస్తారు. అయితే బుధవారం నుంచి పాజిటివ్‌లను ఆన్‌లైన్లో నమోదు చేయవద్దని ప్రైవేట్‌ వైద్య సంస్థలను జిల్లా యంత్రాంగం ఆదేశించినట్టు తెలుస్తోంది. పరీక్ష చేయించుకున్నవారికి ఫలితం చెప్పి మందులు ఇచ్చి హోం ఐసోలేషన్‌కు పంపేయండని సూచించినట్లు చెబుతున్నారు. దీంతో నగరాన్ని జ్వరాలు ముంచెత్తాయి. తిరుపతిలోనే దాదాపు లక్షమంది ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నట్టు ఒక అంచనా. ఫీవర్‌ సర్వే చేస్తేగాని ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో వాస్తవాలు అర్థంకావు. వీరిలో కొవిడ్‌ బాధితులు ఎందరో, సాధారణ జ్వరాలతో ఉన్నవారు ఎందరో తేలదు. స్టేట్‌ కొవిడ్‌ సెంటర్‌గా ఉన్న స్విమ్స్‌లో బుధవారం కేవలం 40 కొవిడ్‌ టెస్టులు చేసి కిట్లు లేవని తలుపులు వేసేశారు. దీంతో అప్పటివరకు క్యూలైన్లో వేచివున్న బాధితులు స్విమ్స్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇక  రుయాలో 66 మందికి పరీక్షలు చేస్తే అందరికీ పాజిటివ్‌ వచ్చినట్టు తెలుస్తోంది.అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో అయితే కుటుంబంలో పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యి, లక్షణాలతో వచ్చిన వారికి మాత్రమే పరీక్ష చేస్తున్నారు.


జిల్లా అంతా ఇదే స్థితి


చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో రోజుకు 100 నుంచి 300 వరకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించేవారు.అయితే ఇప్పడా సంఖ్య 30కి చేరుకుంది. దీనిపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అరుణ్‌ కుమార్‌ను వివరణ కోరగా కిట్ల కొరత వుందన్నారు. ఐసీఎంఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం తీవ్ర కొవిడ్‌ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మిగిలిన వారిని హోంఐసోలేషన్‌కు రెఫర్‌ చేస్తున్నామన్నారు. కుప్పంలో హైరిస్కు ఉన్నవాళ్లకు మాత్రమే పరీక్షలు చేస్తున్నామని ఐసీఎంఆర్‌ నిబంధనలు కూడా అదే చెబుతున్నాయని నియోజకవర్గ కొవిడ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ ప్రసాద్‌ తెలిపారు.వడమాలపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో బుధవారం 9 మందికి కొవిడ్‌ టెస్టులు చేశారు. తవణంపల్లె, యాదమరి మండలాల్లోని పీహెచ్‌సీల్లో కిట్ల కొరతతో పరీక్షలు చేయడంలేదని వైద్యాధికారి చెప్పారు. పుంగనూరులో కిట్ల కొరత కారణంగా రోజుకు 15 నుంచి 20 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. అది కూడా తీవ్ర లక్షణాలు ఉన్నవారికే! ఇక్కడ రోజుకు దాదాపు 500 మంది జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మరో 500 మంది చికిత్స కోసం వస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. కలికిరి మండలంలో తీవ్ర లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేస్తున్నారు. పీలేరులోని కమ్యూనిటీ వైద్యకేంద్రానికి రోజుకు 25 కిట్లు సరఫరా చేస్తున్నారు. అయితే బుధవారం కేవలం 5 కిట్లు మాత్రమే వచ్చాయి. పీహెచ్‌సీలకు కరోనా లక్షణాలతో వచ్చినవారికి మందుల కిట్లు ఇచ్చి ఇంట్లోనే వాడుకోమని సలహా ఇచ్చి పంపుతున్నారు. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో రోజుకు 20 మందికి మాత్రమే కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. 


 ఈ నెలలోనే ఇలా...

=========================================

తేదీ చేసిన టెస్టుల సంఖ్య పాజిటివ్‌లు పాజిటివిటీ నిష్షత్తి

===========================================  

జనవరి1       5260             27            194 ః1 

జనవరి5       5643             96            58 ః1

జనవరి10      5957             467           11ః1

జనవరి15      4638              1124         3ః1

జనవరి18      4878              1822         2ః1


ఒమైక్రాన్‌తో భయం లేదు


ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అవుతున్నవారిలో ఎక్కువమందిలో ఒమైక్రాన్‌ లక్షణాలే కనిపిస్తున్నాయి. డెల్టా కూడా కొందరిలో కనిపిస్తోంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమైక్రాన్‌  లక్షణాలు కొద్దిగా భిన్నంగా కనిపిస్తాయి. జలుబు, తలనొప్పి, గొంతు బొంగురుపోవడం, నీరసం, పొడి దగ్గు, నిద్ర పట్టకపోవడం, జ్వరం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలుంటే కొవిడ్‌గా అనుమానించాలి. కొంతమందికి వాంతులు,విరేచనాలు కూడా ఉంటున్నాయి. చిన్నపిల్లల్లో ఎక్కువమందికి జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, జలుబు  మాత్రమే కనిపిస్తున్నాయి. సెకండ్‌ వేవ్‌లో లాగా ఊపిరితిత్తుల మీద వైరస్‌ దాడి చేయడం లేదు. ఇందువల్ల ప్రమాద తీవ్రత దాదాపుగా తగ్గింది.  అట్లా అని నిర్లక్ష్యం పనికిరాదు. అప్రమత్తంగా ఉండాల్సిందే. మందుల షాపునుంచి మాత్రలు తెచ్చి వేసుకుని సరిపెట్టుకోవడం అన్ని సందర్భాల్లోనూ సరికాదు.  జ్వరం తగ్గకుండా ఉన్నా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతున్నా తప్పనిసరిగా వైద్యసాయం తీసుకోవాలి. పాజిటివ్‌ అని నిర్ధారణ అయినవారు పల్స్‌ ఆక్సీమీటర్‌ తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. వేలికి ఆక్సీమీటర్‌ పెట్టుకుని రీడింగ్‌ నమోదు చేసుకున్నాక, ఆరు నిమిషాల పాటు నడవాలి. నడక తర్వాత వెంటనే మళ్లీ రీడింగ్‌ చూడాలి. మునుపటికన్నా మూడు శాతం తక్కువ నమోదైనా లేక నడక ముగియక ముందే ఆయాసంగా ఉన్నా సమీపంలోని ఆస్పత్రిని సంప్రదించాలి. ఇక కొవిడ్‌ పాజిటివ్‌ అని తేలగానే అన్ని పరీక్షలకూ పరుగులు తీయాల్సిన అవసరం లేదు. మూడో రోజు రక్తపరీక్ష చేసుకున్నాక అవసరమైతే ఐదో రోజు దాన్ని బట్టి ఎనిమిదో రోజున రక్త పరీక్షలు చేసుకుంటే చాలు. సీఆర్పీ, సీబీసీ, డి-డైమర్‌ పరీక్షలు చేసుకోవచ్చు. ల్యాబ్‌ టెస్ట్‌ల ఆధారంగా చికిత్స ఎవరికివారు చేసుకోకూడదు. రోగి లక్షణాలను బట్టి డాక్టర్‌ అంచనాతో వైద్యం మొదలు పెట్టాలి. సీఆర్పీ 50 దాటితే, డి-డైమర్‌ 500 దాటినపుడు మాత్రమే డాక్టర్‌  సలహాతో మందులు వాడాలి.గతంలో వాడిన మందులే కదా అని అనవసరంగా స్టెరాయిడ్స్‌ వాడడం వల్ల కొవిడ్‌ తగ్గిపోయాక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. డి-డైమర్‌ ఎక్కువగా ఉందని వెంటనే కోఆగ్యులెంట్‌ మందులు అధిక మోతాదులో వాడేయరాదు. నీళ్లు ఎక్కువగా తాగడం, కాళ్లూచేతులు బాగా కదిలిస్తూ ఉండడం వంటివి చేయడం ద్వారా డి-డైమర్‌ పెరగకుండా చూడచ్చు. ఆందోళనతో ఆదుర్దా పడి, అనవసర మందులు వాడి, విపరీతంగా ఖర్చు పెట్టి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. కొవిడ్‌కు తొలినాళ్ల లా ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఒక సాధారణ అనారోగ్యమే.


- డాక్టర్‌ పి. అమరనాథరెడ్డి,

ఛాతీ వ్యాధుల నిపుణుడు, 

రుయాస్పత్రి, తిరుపతి

Updated Date - 2022-01-20T05:52:17+05:30 IST