Abn logo
Sep 19 2021 @ 11:26AM

చిన్నారులను వెంటాడుతున్న వైరల్‌ ఫీవర్‌

             - వాతావరణంలో పెనుమార్పులు

             - ఆరోగ్యశాఖ అప్రమత్తం


బెంగళూరు: వాతావరణంలో చోటు చేసుకుంటున్న పెనుమార్పుల కారణంగా చిన్నారులలో వైరల్‌ ఫీవర్‌ అధికంగా ఉంటోందని, దీనికి కొవిడ్‌తో సంబంధంలేదని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. ఎండలతోపాటు అడపాదడపా కురుస్తున్న వర్షాల ప్రభావం కారణంగా వైరల్‌ ఫీవర్‌ కనిపిస్తోందని వైద్య శాఖ ఉన్నతాధికారి ఒకరు శనివారం మీడియాకు చెప్పారు. ఇలా జ్వరాలతో బాధపడుతున్న చిన్నారులతో బెంగళూరులోని కేసీ జనరల్‌, విక్టోరియా, జయనగర్‌ ప్రభుత్వ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇందిరాగాంధీ చిన్నారుల ఆసుపత్రిలో దాదాపు 400 మంది వైరల్‌ జ్వరాలకు చికిత్స పొందుతున్నారు. ప్రతి ఏటా జూలై నుంచి సెప్టెంబరు అవధిలో వాతావరణ మార్పుల కారణంగా వైరల్‌ జ్వరాల సహజసిద్ధమన్నారు. వైరల్‌ జ్వరాలలో జలుబు, దగ్గు, జ్వరంతోపాటు తలనొప్పి, కళ్లమంటలు అధికంగా ఉంటాయన్నారు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే తక్షణం పిల్లలను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని సూచించారు. రాజధాని బెంగళూరుతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చిన్నారులలో జ్వరాలు కనిపిస్తున్నాయని చెప్పారు. కోలారు జిల్లాలో కేవలం 17 రోజుల అవధిలో 231 మంది ఇలా జ్వరాలతో ఆసుపత్రి పాలయ్యారన్నారు. ఉత్తరకర్ణాటకలోని పలు జిల్లాల్లో చిన్నారులకు జ్వరాలు సోకుతున్నట్టు గుర్తించామన్నారు. చిన్నారులలో జ్వరాలపై అన్ని జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయాలను అప్రమత్తం చేశామని చెప్పారు. కొవిడ్‌ మూడోవేవ్‌ ప్రభావం ఎక్కువగా చిన్నారులపై ఉంటుందన్న కథనాల నేపథ్యంలో ప్రజలను జాగృత పరుస్తున్నామని చెప్పారు. ఇలాంటి జ్వరాలు చిన్నారులలో కనిపించినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైరల్‌ జ్వరాల కారణంగా ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా చిన్నారులు మృత్యువాత పడలేదని ఆయన స్పష్టం చేశారు.