విజృంభిస్తున్న వైరల్‌ జ్వరాలు

ABN , First Publish Date - 2022-01-20T05:08:07+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం నగర పంచయతీలోని 14, 15వార్డులతో పాటు గాంధీనగర్‌, రామచంద్రాపురం, కట్టుబడిపాళెం, శాంతినగర్‌, ఖాజానగర్‌, కామాక్షికాలనీ తదితర ప్రాంతాలు, మండలంలోని గ్రామాల్లో వైరల్‌ జ్వరాలు విజృంభించడంతో ప్రజలు మంచం పట్టగా..

విజృంభిస్తున్న వైరల్‌ జ్వరాలు
జొన్నవాడ పీహెచ్‌సీలో వైద్యం కోసం వచ్చిన జ్వరపీడితులు

పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

 

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 19: బుచ్చిరెడ్డిపాళెం నగర పంచయతీలోని 14, 15వార్డులతో పాటు గాంధీనగర్‌, రామచంద్రాపురం, కట్టుబడిపాళెం, శాంతినగర్‌, ఖాజానగర్‌, కామాక్షికాలనీ తదితర ప్రాంతాలు, మండలంలోని గ్రామాల్లో వైరల్‌ జ్వరాలు విజృంభించడంతో ప్రజలు మంచం పట్టగా.. చిన్నారులతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడ చూసినా మురుగు దుర్గంధం వెదజల్లుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో  దోమల వాప్తి ఎక్కువైంది. ఇప్పటికే పలువురు డెంగ్యూ బారిన పడి నెల్లూరులోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మండలంలోని ప్రజలు ఒళ్లునొప్పులు, జ్వరాలు, దగ్గు, జలుబుతో అల్లాడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కోల్పోయిన పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక పలువురు   ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించుకుంటున్నారు. బుచ్చి ప్రభుత్వాసుపత్రిలో రోజుకు 175 దాకా ఓపీ ఉంటే వారిలో 100 వరకు జ్వరాల కేసులు నమోదవుతున్నాయి. జొన్నవాడ ఆరోగ్యకేంద్రంలో రోజుకు 70నుంచి 100 వరకు ఓపీ ఉండగా... అందులో 10నుంచి 15 వరకు జ్వరాల రోగులు ఉన్నారు. మండలంలో మొత్తం 13 సబ్‌ సెంటర్లలో గ్రామాల నుంచి మరో 30 జ్వరాల కేసులు నమోదవుతున్నట్లు వైద్యాధికారులు డాక్టర్‌ ఖాదర్‌బాషా, డాక్టర్‌ ప్రసన్నలక్ష్మి తెలిపారు. గ్రామాల్లో ఏఎన్‌ఎంలు, ఆశా వలంటీర్లు జ్వరాలపై  ప్రజలను అప్రమత్తం చేస్తూ నివారణ చర్యలు, పారిశుధ్యంతోపాటు బ్లీంచింగ్‌, స్ర్పేయింగ్‌ చేయిస్తున్నట్టు తెలిపారు. బుచ్చి నగర పంచాయతీలో మురుగు దుర్గంధంపై సత్వర చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.   

Updated Date - 2022-01-20T05:08:07+05:30 IST