వానల్లో... వైరల్‌ వ్యాధి

ABN , First Publish Date - 2022-08-02T10:43:57+05:30 IST

వర్షాకాలంలో మరీ ముఖ్యంగా పిల్లలను వైరల్‌ వ్యాధులు వేధిస్తూ ఉంటాయి. చర్మం మీద నీటి బుగ్గలు, జ్వరం, నోట్లో పుండ్లు

వానల్లో... వైరల్‌ వ్యాధి

వర్షాకాలంలో మరీ ముఖ్యంగా పిల్లలను వైరల్‌ వ్యాధులు వేధిస్తూ ఉంటాయి. చర్మం మీద నీటి బుగ్గలు, జ్వరం, నోట్లో పుండ్లు లాంటి లక్షణాలతో బయల్పడే వైరల్‌ వ్యాధిని తేలికపాటి చికిత్సతో నయం చేయవచ్చు.


ఈ వైరల్‌ వ్యాధి ‘పికార్నోవిరిడే’ అనే ఎంటిరోవైరస్‌ వల్ల వ్యాపిస్తుంది. లాలాజలం, మలంలో తిష్ఠ వేసుకుని ఉండే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి 3 నుంచి 7 రోజుల్లో వ్యాపిస్తుంది. మలంలో వైరస్‌ 4 నుంచి 8 వారాల వరకూ సజీవంగా ఉంటుంది కాబట్టి మల విసర్జన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గు, తుమ్ములు, చీదడం, లాలాజలం, నీటి బుగ్గలు పగిలి రసి కారడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.


లక్షణాలు ఇవే!

కొద్దిపాటి జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, అరచేతులు, అరికాళ్లు, చేతుల, పిరుదులు మీద నీటి బుగ్గలు, దద్దుర్లు, నోట్లో పుండ్లు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఇది ఆటలమ్మ, మీజిల్స్‌, గజ్జి, అలర్జీ దద్దుర్లు, మంకీపాక్స్‌లను ఈ దద్దుర్లు పోలి ఉంటాయి. అయితే వ్యాధి తీరు, లక్షణాల ఆధారంగా, అసలు వ్యాధిని నిర్థారించవచ్చు. 


చికిత్స ఇలా

ఈ వ్యాధికి దానంతట అదే తగ్గిపోయే గుణం ఉంటుంది కాబట్టి ప్రత్యేక మందులకు బదులుగా జ్వరం, మంట, దురదలకు తగిన మందులు ఇవ్వవలసి ఉంటుంది. ఒంట్లో నీరు తగ్గి, డీహైడ్రేషన్‌కు గురవకుండా, ఎక్కువగా నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నరాలు, గుండెలకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడితే, ఆస్పత్రిలో చేర్చి, ద్రవాలు, ఇతర మందులు ఇవ్వవలసి ఉంటుంది. కొన్ని అరుదైన సందర్భాల్లో, వ్యాధి నిరోధకశక్తి సన్నగిల్లిన పరిస్థితుల్లో వ్యాధి తీవ్ర రూపం దాల్చే అవకాశం కూడా ఉంటుంది. మెదడు వాపు, శరీరం క్రమంగా చచ్చుబడిపోయే గిలియన్‌బారీ సిండ్రోమ్‌, న్యుమోనియా, ఊపిరితిత్తుల వాపు, రక్తస్రావం, గుండె కండరాలు బలహీనపడే మయోకార్డైటిస్‌; క్లోమంలో ఇన్‌ఫెక్షన్‌ లాంటివి మొదలుకావచ్చు. వీటికి ఆస్పత్రి చికిత్స అవసరం.


నివారణ ఇలా...

ఈ హ్యాండ్‌, ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌ తేలికగా, త్వరగా వ్యాపించే వ్యాధి కాబట్టి సమూహాల్లో తిరిగేవాళ్లు చేతులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. డయాపర్లు మార్చే తల్లులు కూడా చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఇంట్లో నేలనూ, పిల్లలు ఉపయోగించే ఆటబొమ్మలు, వస్తువులను డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌తో శుభ్రం చేయాలి. ఇతరులతో సన్నిహితంగా మెలగకూడదు. భోజన పాత్రలు పంచుకోకూడదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పిల్లలకు తగిన జాగ్రత్తలు నేర్పించాలి. లక్షణాల తీవ్రతనుబట్టి వైద్యులను సంప్రతించాలి.


డాక్టర్‌ నళిని

తల్లీ పిల్లల ఆరోగ్య కన్సల్టెంట్‌, లక్ష్మీదాస్‌ మెమోరియల్‌ క్లినిక్‌,

బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌.

Updated Date - 2022-08-02T10:43:57+05:30 IST