రైతుల ఆందోళన.. ఇద్దరు రైతులపై నుంచి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్

ABN , First Publish Date - 2021-10-04T02:04:25+05:30 IST

కేంద్రమంత్రి కాన్వాయ్ కిందపడి ఇద్దరు రైతులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరిగిందీ ఘటన. కేంద్ర

రైతుల ఆందోళన.. ఇద్దరు రైతులపై నుంచి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్

లక్నో: కేంద్రమంత్రి కాన్వాయ్ కిందపడి ఇద్దరు రైతులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరిగిందీ ఘటన. కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా, ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్య పర్యటన సందర్భంగా రైతులు ఈ ఉదయం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.


కేంద్రమంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం రైతులను తొక్కించుకుంటూ పోయిందని, దానికిందపడి ఇద్దరు రైతులు మరణించారని రైతు యూనియన్లు ఆరోపించాయి. రైతులను తొక్కించుకుంటూ వెళ్లిన వాహనంలో కేంద్రమంత్రి కుమారుడు, బంధువులు ఉన్నారని పేర్కొన్నారు. 


అక్కడ జరిగిన హింసకు సంబంధించి వెలుగులోకి వచ్చిన వీడియోల్లో వాహనాలను ఓ వ్యక్తి వాహనాలను తగలబెడుతుండడం కనిపించింది. ఈ సందర్భంగా అతడు గాయపడి కిందపడిపోయాడు. పోలీసులు భారీగా మోహరించి ఉండడం ఆ వీడియోలో కనిపించింది. కాగా, ఈ ఘటనలో 8 మంది రైతులు గాయపడ్డారని, ఇద్దరు మరణించారని ఆరోపించారు. రోడ్డుపక్కన నిల్చున్న తమపైకి కేంద్రమంత్రి వాహనం దూసుకొచ్చిందని సంయుక్త కిసాన్ మోర్చా ట్వీట్ చేసింది. 


ఈ ఘటనపై లఖింపూర్ ఖేరి జిల్లా ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ లలిత్ కుమార్ మాట్లాడుతూ.. ఆసుపత్రికి తీసుకొచ్చే సరికే ఇద్దరు వ్యక్తులు మరణించారని, మరకొరికి తీవ్ర గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు పోస్టుమార్టం చేయలేదని తెలిపారు. కేంద్రమంత్రి మిశ్రా స్వగ్రామంలో ఓ కార్యక్రమం నిర్వహిస్తుండగా, డిప్యూటీ సీఎం అందులో పాల్గొనాల్సి ఉంది.


ఇటీవల మిశ్రా రైతు ఉద్యమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అది 10-15 మంది చేస్తున్న ఆందోళన అని, వారిని లైన్లో పెట్టడానికి రెండు నిమిషాలు సరిపోతుందని చెప్పడం రైతుల ఆగ్రహానికి కారమైంది. ఈ నేపథ్యంలో మిశ్రాను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూ రోడ్లను దిగ్బంధం చేశారు. 


ఉప ముఖ్యమంత్రి దిగకుండా ఆపేందుకు హెలిప్యాడ్ వద్ద ఘెరావ్ నిర్వహించాలని రైతులు నిర్ణయించారని, కార్యక్రమం ముగిసిన అనంతరం తిరగి వెళ్తున్న సమయంలో మూడు కార్లు అకస్మాత్తుగా రైతులపైకి దూసుకొచ్చాయని రైతు సంఘం నేత డాక్టర్ దర్శన్‌పాల్ అన్నారు.


ఈ ఘటనలో ఓ రైతు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పేర్కొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా నేత తేజీందర్ ఎస్ విరాక్ తీవ్రంగా గాయపడ్డారని, లఖింపూర్ ఖేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు.  

Updated Date - 2021-10-04T02:04:25+05:30 IST