రైతులపై దౌర్జన్యం

ABN , First Publish Date - 2021-09-02T06:09:25+05:30 IST

రైతుల తలలు పగలగొట్టమని ఆదేశించిన ఆ ఐఎఎస్‌ అధికారిని హర్యానా ప్రభుత్వం బుధవారం బదిలీచేసింది. కర్ణాల్‌ సబ్‌డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఆయుష్‌ సిన్హా ఏ తప్పూ చేయలేదని మొన్నటికిమొన్న గట్టిగా...

రైతులపై దౌర్జన్యం

రైతుల తలలు పగలగొట్టమని ఆదేశించిన ఆ ఐఎఎస్‌ అధికారిని హర్యానా ప్రభుత్వం బుధవారం బదిలీచేసింది. కర్ణాల్‌ సబ్‌డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఆయుష్‌ సిన్హా ఏ తప్పూ చేయలేదని మొన్నటికిమొన్న గట్టిగా వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఇప్పుడు సదరు అధికారిని ఎందుకు బదిలీ చేసినట్టు? ఆయుష్‌ సిన్హా ఉపయోగించిన భాష సరిగా లేదుకానీ, శాంతిభద్రతలు కాపాడాల్సిన కర్తవ్యాన్ని ఆయన ఎంతో చక్కగా నిర్వహించాడని అంతగట్టిగా సమర్థించుకొచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు బదిలీకి ఆదేశించారంటే ఆయన తప్పుచేశాడని ఒప్పుకున్నట్టేనా? తన తప్పు దిద్దుకున్నట్టేనా?


పోలీసుల లాఠీదెబ్బలకు పగిలిన తలలకంటే, ఖట్టర్‌ వ్యాఖ్యలు రైతులను మరింత గాయపరిచివుంటాయి. నెత్తురోడుతున్న రైతులను చూసి ఎంతోమంది మనసులు ద్రవించిపోతే, ముఖ్యమంత్రికి మాత్రం తన అధికారి మాటలు శ్రవణానందకరంగా ఉన్నాయి. వెరీ సింపుల్‌ అండ్‌ క్లియర్‌... లాఠీతో ఉతికేయండి..చితకబాదేయండి... ఒక్కడు ఇక్కడకు వచ్చినా వాడి తలపగలాల్సిందే... అంటూ ఆ అధికారి చక్కని భాషలో చెప్పిన తరువాత పోలీసులు మాత్రం ఎందుకు ఊరుకుంటారు? ఎనీ డౌట్‌ అని ఆయన అనడమూ నో సార్‌ అని ఎదురుగా ఉన్న పోలీసులు ఉత్సాహంగా ప్రతిస్పందించడంలోనూ తలలుపగలగొట్టాలన్న ఉన్మాదం, ఉద్దేశం విస్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కేంద్రప్రభుత్వం తెచ్చిన కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా నెలలతరబడి ఉద్యమిస్తున్న రైతుల ప్రధాన లక్ష్యం పాలకుల దృష్టిని ఆకర్షించడం మాత్రమే. వారికి ఎవరితలలూ పగలగొట్టాలన్న ఆలోచనే ఉండదు. ఖట్టర్‌ బీజేపీ ముఖ్యమంత్రి కూడా కనుక, ఆయన ఓ పార్టీ సమావేశంలో పాల్గొనేందుకు అక్కడకు వస్తున్నట్టు తెలిసి, ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని నిరసన తెలియచేయాలని రైతులు అనుకున్నారు. టోల్‌ప్లాజా వద్దకు వారు పెద్దసంఖ్యలో చేరుకోవడంతోనే పోలీసులు లాఠీచార్జీ చేశారు. అనేకమంది రైతుల తలలుపగిలాయి, ఒళ్ళంతా గాయాలైనాయి, ఒక రైతు కన్నుమూశాడు. చాలామంది రైతులను పోలీసులు అరెస్టు చేసి జైళ్ళలోనూ కుక్కారు. ఆయుష్‌ సిన్హా ఆదేశాలే ఈ హింసకు కారణమన్న విమర్శ కాదనలేనిది. రైతుల తలలు పగలగొట్టమని అంతస్పష్టంగా పోలీసులను ఆదేశించిన ఆ అధికారి చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందే అని ఉపముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా ఏవో నాలుగు ఉపశమనవ్యాఖ్యలకు కనీసం ప్రయత్నమైనా చేశారు. కానీ, ముఖ్యమంత్రి మాత్రం పూర్తి భిన్నంగా పుండుమీద కారం పూశారు. 


రెండురోజులు నిద్రలేకపోవడంతో అలా మాట్లాడానని సదరు అధికారి చెబుతున్నారట. కానీ, మోదీ ప్రభుత్వ పుణ్యమాని రైతులు కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోయి తొమ్మిదినెలలైంది. భయానక వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి వారు ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. నిరసన హక్కు రాజ్యాంగబద్ధమైనది కనుక వారితో ఎంత సంయమనంగా వ్యవహరించాలో సదరు అధికారికి తెలియదనుకోలేం. కానీ, రైతులతో తనబోటి అధికారులు ఎలా వ్యవహరించాలని పాలకులు కోరుకుంటున్నారో ఆయనకు అవగాహన ఉన్నది కనుకనే, అంతటి దూకుడు ప్రదర్శించాడు. పైనుంచి స్పష్టమైన ఆదేశాలేవీ లేకుండా రైతులను పోలీసులు ఇలా వేటాడి, వెంటాడి చావగొట్టడం జరగదు. శనివారం రైతులపై విరిగిన లాఠీ ఆ ఉద్యమంపట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కఠినవైఖరిని మరోసారి తెలియచెప్పింది. ఎన్నిమాసాలైనా సడలని రైతుల ఆత్మవిశ్వాసం, పట్టుదల ప్రశంసనీయమైనవి. పార్లమెంటులో ఎటువంటి లోతైనచర్చలూ చేయకుండా, ఎవరి అభిప్రాయాలకూ విలువనివ్వకుండా దాటించుకొచ్చిన ఈ చట్టాలను రైతులు నిరసించడం, దీర్ఘకాలంగా ఉద్యమించడం కేంద్రప్రభుత్వానికి కొరుకుడుపడటం లేదు. పదకొండుసార్లు చర్చలు జరిగినా ఎవరూ దిగి రాలేదు, వివాదం పరిష్కారం కాలేదు. దేశ రాజధాని శివార్లలో వేలాదిమంది నిద్రాహారాలు మాని నిరసిస్తుంటే, పాలకుల్లో ఏమాత్రం చలనం లేకపోయింది. ఇతరత్రా విషయాల్లో సులువుగా భావోద్వేగానికి లోనయ్యే పెద్దలకు రైతులు మాత్రం శత్రువుల్లా కనిపిస్తున్నారు. మీ కొత్త సాగుచట్టాలు మాకు హానిచేస్తాయనీ, ఉనికినే దెబ్బతీస్తాయని రైతులు మొత్తుకుంటున్నా, అవి మీ మేలుకేనని దబాయిస్తూ అమలుచేయబూనడంలో నిజాయితీ కనిపించదు. పార్లమెంటును, సమాఖ్యస్ఫూర్తినీ, రాష్ట్రాల హక్కులనూ కాదని, రైతులపై వారు వద్దంటున్న చట్టాలను ఇలా రుద్దుతున్నారు కనుకనే అవి కార్పొరేట్ల మేలుకే తయారైనాయన్న విమర్శకు మరింత విలువా విశ్వసనీయతలు సమకూరుతున్నాయి.

Updated Date - 2021-09-02T06:09:25+05:30 IST