అష్ట దిగ్బంధనంతో భోపాల్‌‌లో బాలలపై పెరుగుతున్న హింస

ABN , First Publish Date - 2020-04-10T03:00:57+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో అమలు చేస్తున్న అష్ట

అష్ట దిగ్బంధనంతో భోపాల్‌‌లో బాలలపై పెరుగుతున్న హింస

భోపాల్ : కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నిరోధించే లక్ష్యంతో అమలు చేస్తున్న అష్ట దిగ్బంధనం కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ఇళ్ళలో బాలలపై హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజుల్లో చైల్డ్ హెల్ప్‌లైన్‌కు చాలా మంది బాలలు ఫోన్లు చేసి, తమ కష్టాలను ఏకరువు పెట్టడమే దీనికి నిదర్శనం. 


ఓ వ్యాపారి కుమార్తె ఫోన్ చేసి తనను తన ఇంటి నుంచి వేరొక చోటుకు తరలించాలని కోరింది. తన తండ్రి మద్యాన్ని తెచ్చుకుని , ఇంట్లో నిల్వ చేసుకున్నాడని, అది అయిపోయినప్పటి నుంచి తనపై హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాడని భోరున విలపించింది. 


కర్ఫ్యూ అమలవుతున్న సమయంలో అర్థరాత్రి వేళ ఓ తాగుబోతు తన భార్యాబిడ్డలను కిరాతకంగా కొట్టాడు. దీంతో వారిద్దరూ తమ స్నేహితుని ఇంటికి పారిపోయి, తలదాచుకున్నారు.  బాధితురాలు తన బిడ్డతో కలిసి భోపాల్ చైల్డ్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించారు. 


భోపాల్ చైల్డ్ హెల్ప్‌లైన్ డైరెక్టర్ అర్చనా సహాయ్ మాట్లాడుతూ బాధితురాలు తమ వద్దకు వచ్చినట్లు తెలిపారు. తన భర్త మద్యం కోసం డబ్బులు అడుగుతున్నాడని, ఇష్టానుసారం కొడుతున్నాడని ఆమె చెప్పారని, తాము ఆమెకు సహాయం చేశామని తెలిపారు.


దేశంలో అష్ట దిగ్బంధనం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 65 మంది బాలలు తమకు ఫోన్లు చేశారని తెలిపారు. మరొకవైపు కొందరు బాలలకు ఆహారం లభించడం లేదని చెప్పారు. 


Updated Date - 2020-04-10T03:00:57+05:30 IST