Ranchi Police : రెచ్చిపోతున్న అక్రమార్కులు... మహిళా ఎస్ఐ దారుణ హత్య...

ABN , First Publish Date - 2022-07-20T20:45:31+05:30 IST

గనుల దొంగలు, అక్రమ వ్యాపారస్థులు బరితెగిస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను

Ranchi Police : రెచ్చిపోతున్న అక్రమార్కులు... మహిళా ఎస్ఐ దారుణ హత్య...

రాంచీ : గనుల దొంగలు, అక్రమ వ్యాపారస్థులు బరితెగిస్తున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులనే హతమారుస్తున్నారు. హర్యానాలోని నుహ్‌లో చట్టవిరుద్ధ గనుల తవ్వకాలను ఆపేందుకు ప్రయత్నించిన డీఎస్‌పీ ర్యాంకు అధికారిపై నుంచి వాహనాన్ని నడిపి హత్య చేసిన సంఘటన జరిగిన కొద్ది గంటలకే జార్ఖండ్‌లోని రాంచీలో మరో దారుణం జరిగింది. ఆవుల అక్రమ రవాణాను ఆపేందుకు ప్రయత్నించిన మహిళా సబ్ఇన్‌స్పెక్టర్ సంధ్య టోప్నోపై నుంచి వాహనాన్ని నడిపి హత్య చేశారు. 


జార్ఖండ్ (Jharkhand) పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం, సబ్ ఇన్‌స్పెక్టర్ సంధ్య టోప్నో (Sandhya Topno) రాంచీలోని టుపుడన ఔట్‌పోస్ట్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒడిశా నుంచి ఓ లారీలో ఆవులను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆ లారీ రెండు చోట్ల గస్తీ బృందాల నిఘాను తప్పించుకోగలిగింది. చివరికి రాంచీ చేరుకుంది. సంధ్య టోప్నో ఆ లారీని ఆపాలని సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆ లారీని ఆపకుండా ఆమె పై నుంచి దూసుకెళ్ళేలా దాని డ్రైవర్ నడిపించాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. దానిని గమనించిన మిగిలిన పోలీసులు ఆ లారీని వెంబడించారు. వేగంగా వెళ్తున్న ఆ లారీ ప్రమాదానికి గురై, బోల్తా పడింది. దానిని నడుపుతున్న నిసార్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరొక వ్యక్తి తప్పించుకోగలిగాడు. 


రాంచీ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కౌశల్ కిషోర్ మాట్లాడుతూ, లారీని జప్తు చేశామని, దానిలోని 10 ఆవులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నదీ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 


రాంచీ పోలీసు సంఘం ప్రతినిధి ఆనంద్ ఖల్కో మాట్లాడుతూ. సంధ్య టోప్నో నిజాయితీగా తన కర్తవ్యాన్ని నిర్వహించేవారని, సమర్థతగల అధికారిణి అని చెప్పారు. ఆమె మరణానికి కారకులైన దోషులను కఠినంగా శిక్షించాలని, ఓ దృష్టాంతంగా నిలిచేవిధంగా ఆ శిక్ష ఉండాలని డిమాండ్ చేశారు. 


ఇదిలావుండగా, హర్యానాలోని నుహ్ వద్ద డీఎస్‌పీ ర్యాంక్ అధికారి సురేంద్ర సింగ్ బిష్ణోయ్‌పై నుంచి కూడా అక్రమ మైనింగ్ లారీ దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2022-07-20T20:45:31+05:30 IST