ఉల్లం‘గనులు’

ABN , First Publish Date - 2021-05-12T05:58:02+05:30 IST

జిల్లా అత్యంత నాణ్యమైన బెరైటీ్‌సకు ప్రసిద్ధి. ముగ్గురాళ్లతోపాటు నాపరాళ్లు, సున్నపురాయి, క్వార్ట్జ్‌, గ్రానైట్‌ నిక్షేపాలకు నిలయం.

ఉల్లం‘గనులు’

యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌

పలువురు లీజుదారులకు లేని ఎక్స్‌ప్లోజివ్‌ అనుమతులు 

అనుభవం లేని కార్మికులతోనే బ్లాస్టింగ్‌లు

నైపుణ్య సిబ్బంది నియామకాల్లో నిర్లక్ష్యం 

చోద్యం చూస్తున్న నిఘా

జిల్లాలో సమగ్ర విచారణ చేస్తే.. భారీ అక్రమాలు


కలసపాడు మండలం మామిళ్లపల్లి సమీప ముగ్గురాళ్ల మైనింగ్‌ లీజు రద్దు పెండింగ్‌లో ఉందని, మైన్‌సేఫ్టీ, పర్యావరణ అనుమతులు లేవని, తవ్వకాలు చేయొద్దని మైనింగ్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయినా.. అధికార పార్టీ అండతో యథేచ్ఛగా భూగర్భ ముగ్గురాళ్ల తవ్వకాలు చేపట్టారు. ఫలితం పది మంది కూలీలు మృత్యువాత పడ్డారు. ఈ మైనింగ్‌లో మాత్రమే కాదు.. జిల్లాలో పలు గనులలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి నైపుణ్యం లేని కార్మికులతో ముగ్గురాయి, నాపరాళ్ల తవ్వకాలు చేస్తున్నారు.  సమగ్ర విచారణ చేస్తే.. మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. జిల్లాలో మైనింగ్‌ తవ్వకాల తీరుపై ప్రత్యేక కథనం.


(కడప - ఆంధ్రజ్యోతి): జిల్లా అత్యంత నాణ్యమైన బెరైటీ్‌సకు ప్రసిద్ధి. ముగ్గురాళ్లతోపాటు నాపరాళ్లు, సున్నపురాయి, క్వార్ట్జ్‌, గ్రానైట్‌ నిక్షేపాలకు నిలయం. ఇక్కడి ముగ్గురాయి నాణ్యమైనది కావడంతో గల్ఫ్‌ దేశాల్లో చమురు బావుల్లో మంటలు ఎగబడకుండా వినియోగిస్తున్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. పలు దేశాలకు ఇక్కడినుంచి ముగ్గురాయి ఎగుమతి అవుతోంది. నాపరాయిని జిల్లాలోనే కాక.. రాయలసీమ జిల్లాలకు రవాణా చేస్తున్నారు. బెరైటీస్‌, నాపరాళ్లు, క్వార్ట్జ్‌ తవ్వకాలకు జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖ 146 లీజులు (లైసెన్సు)లు జారీ చేసింది. మైనింగ్‌ నిబంధనల ప్రకారం పర్యావరణ, మైన్‌ సేఫ్టీ, ఎక్స్‌ప్లోజివ్‌ అనుమతులు తప్పనిసరి. అయితే.. వీటి అనుమతులు లేకుండానే పలువురు మైనింగ్‌ చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాపరాళ్ల గనుల్లో నిబంధనలు తుక్కు

యర్రగుంట్ల మండలం నిడుజువ్వి, పొట్లదుర్తి, జమ్మలమడుగు మండలం, దేవగుడి, సుగుమంచిపల్లి తదితర గ్రామాలు నాపరాళ్ల గనులకు ప్రసిద్ధి. నిడుజువ్వి గ్రామంలో నాణ్యమైన నాపరాయి దొరుకుతుంది. ఇక్కడ 10-15కు పైగా మైనింగ్‌ లీజులు ఉన్నట్లు తెలుస్తోంది. లీజు ముసుగులో యథేచ్ఛగా నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి ఎక్స్‌ప్లోజివ్‌ అనుమతులు ఉన్నాయి. ఆ వ్యక్తితో ఒప్పందం చేసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఎలాంటి అనుభవం లేని కూలీలతోనే నాపరాళ్ల బ్లాస్టింగ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఎక్కువ పరిమాణంలో తవ్వకాలు చేసి.. తక్కువ పరిమాణం రికార్డుల్లో చూపి రాయల్టీ రూపంలో ఖజానాకు గండి కొడుతున్నారు. దాడులు చేసి నియంత్రించాల్సిన మైనింగ్‌ యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

పులివెందుల్లోనూ ఇదే పరిస్థితి

సీఎం జగన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో వేముల మండలం భూమయ్యగారిపల్లి, వేముల, వేల్పుల, బి.కొత్తపల్లి, లింగాల మండలం ఇప్పట్ల, కుర్నూతల, పులివెందుల మండలం వెంకటాపురం, వేంపల్లి మండలం రాజుపాలెం, కొత్తూరు, తంగేడుపల్లి, బక్కన్నగారిపల్లి గ్రామాల్లో నాణ్యమైన బెరైటీస్‌ నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ బెరైటీస్‌ తవ్వకాలకు పలువురికి మైనింగ్‌ అధికారులు లీజు ఇచ్చారు. అత్యధిక లీజుదారులు అధికార పార్టీ అండదండలున్న బడాబాబులే. ఇక్కడ కూడా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. మైనింగ్‌ సేఫ్టీ నిబంధనల ప్రకారం క్వాలిఫైడ్‌ మేనేజర్‌, నైపుణ్యం కలిగిన ఫోర్మెన్‌, మైన్‌మేట్‌ బ్లాస్టర్‌లను నియమించుకోవాలి. వీరి పర్యవేక్షణలోనే బ్లాస్టింగ్‌ జరగాలి. మెజారిటీ గనుల్లో ఇది అమలు కావడం లేదు. అధికారులు దాడులు చేసినప్పుడు వెలికితీసిన ముగ్గురాయిని సీజ్‌ చేస్తున్నారు. కొన్నాళ్లకు అది మాయమవుతుంది. అది ఎక్కడికి వెళ్లిందో తెలియని పరిస్థితి. లీజుదారులకు అధికారుల అండదండలు ఉండడంతో నామమాత్రపు దాడులతో సరిపుచ్చుతున్నారనే ఆరోపణలున్నాయి.

రెవెన్యూ అదికారుల పర్యవేక్షణ ఏదీ..? 

మైనింగ్‌ లీజు తీసుకున్న యజమాని ఖనిజ తవ్వకాలు చేపట్టే సమయంలో బ్లాస్టింగ్‌ చేస్తే.. తప్పక రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ప్రతి మైనింగ్‌ లీజుదారుడికి ఎక్స్‌ప్లోజివ్‌ లైసెన్సు ఉండాలి. లేదా ఎక్స్‌ప్లోజివ్‌ లైసెన్సుదారుడితో వర్క్‌ ఆర్డర్‌ అగ్రిమెంట్‌ ఉండాలి. అనుభవజ్ఞులైన కార్మికులతో మైనింగ్‌ తవ్వకాలకు రంధ్రాలు (ఘాతాలు) వేయించాలి. బ్లాస్టింగ్‌ చేసే సమయంలో ఫోర్మెన్‌, మైన్‌మేట్‌, బ్లాస్టర్‌ ఆధ్వర్యంలోనే ఇవి చేపట్టాలి. అంతకుముందు సంబందిత మండల రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తే.. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ లేదా సమాన అర్హత కలిగిన రెవెన్యూ అధికారి ఏ మోతాదులో బ్లాస్టింగ్‌ చేస్తున్నారో పరిశీలించి రికార్డు నమోదు చేయాలి. బ్లాస్టింగ్‌ సమయంలో సుమారు 2 కి.మీ వరకు జనసంచారం లేకుండా కట్టడి చేయాలి. ఈ నిబంధనలు మెజారిటీ మైనింగుల్లో అమలు కావడం లేదు. అంతేగాకుండా బ్లాస్టింగ్‌ అనుమతులు ఉన్న గనులవద్ద పేలుడు పదార్థాల భద్రత, కార్మికుల భద్రతపై పోలీసు, కార్మిక శాఖ తరచూ తనిఖీలు చేయాలి. ఆ దిశగా చర్యలు శూన్యమనే విమర్శలున్నాయి.

ఆ ఒక్క మైనింగ్‌పైనే విచారణ సాగుతుందా..?

పది మంది కూలీల మరణానికి కారణమైన కలసాడు మండలం మామిళ్లపల్లి సమీపంలోని కొండగంగమ్మతల్లి మైనింగ్‌పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కడప జేసీ (రెవెన్యూ) గౌతమి చైర్‌పర్సన్‌గా ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఈకమిటీలో రెవెన్యూ, మైనింగ్‌, ఎక్స్‌ప్లోజివ్‌, మైన్‌ సేఫ్టీ, పోలీసు అధికారులు సభ్యులుగా ఉన్నారు. దుర్ఘటన జరిగిన మైనింగ్‌ పైన మాత్రమే ఈ కమిటీ విచారిస్తుందా..? జిల్లాలో లీజు కలిగిన 146 మైనింగ్‌లను పరిశీలిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. ప్రమాదం జరిగిన మైనింగ్‌ ఒక్కటే కాకుండా జిల్లాలో అన్ని మైనింగ్‌లపై సమగ్ర దర్యాప్తు చేపడితే.. భారీ అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ దిశగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. 


నిత్యం దాడులు చేస్తున్నాం

- రవిప్రసాద్‌, ఏడీ, గనులు, భూగర్భ వనరుల శాఖ, కడప

జిల్లాలో బెరైటీస్‌, నాపరాళ్లు, క్వార్ట్జ్‌ తదితర ఖనిజ తవ్వకాలకు 146 లీజులు మంజూరు చేశాం. తరుచూ దాడులు చేస్తున్నాం. ఈ ఏడాది నిబంధనలు ఉల్లంఘించిన లీజుదారుల నుంచి రూ.2.50 కోట్లు పెనాల్టీ వేశాం. పలువురు లీజుదారులకు నోటీసులు జారీ చేశాం.


 

Updated Date - 2021-05-12T05:58:02+05:30 IST