Tokyo Paralympics: భారత్‌కు వరుసగా మూడో పతకం

ABN , First Publish Date - 2021-08-30T00:50:01+05:30 IST

పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. నేడు ఒకే రోజు మూడు పతకాలు

Tokyo Paralympics: భారత్‌కు వరుసగా మూడో పతకం

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. నేడు ఒకే రోజు మూడు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. ఉదయం టేబుల్ టెన్నిస్‌లో భవీనా పటేల్ రజత పతకం సాధించగా, మధ్యాహ్నం హైజంప్‌లో నిషాద్ కుమార్ రజతం సొంతం చేసుకున్నాడు. తాజాగా, డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించి రికార్డు పుస్తకాల్లో తన పేరు లిఖించుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రో ఫైనల్‌లో వినోద్ కుమార్ 19.91 మీటర్ల దూరం విసిరి ఆసియా రికార్డును బద్దలుగొట్టాడు. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇది మూడో పతకం కాగా, మరో పతకం సాధిస్తే 2016 రియో గేమ్స్ మెడల్ రికార్డు సమమవుతుంది. భారత్‌ సొంతమైన మూడు పతకాలు నేడే రావడం, అది కూడా జాతీయ క్రీడా దినోత్సవం రోజునే కావడం విశేషం.


బీఎస్ మాజీ జవాను అయిన వినోద్ కుమార్‌ దురదృష్టవశాత్తు ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అచేతనంగా మారి పదేళ్లకు పైగా మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత పలు సవాళ్లు ఎదుర్కొని ఎట్టకేలకు కోలుకుని పారా స్పోర్ట్స్‌లో సత్తా చాటుతున్నాడు. 2016లో పారాలింపిక్స్‌ను స్ఫూర్తిగా తీసుకున్న వినోద్ కుమార్ తాను కూడా క్రీడల్లో సత్తా చాటాలని భావించాడు. ఆ వెంటనే శిక్షణ ప్రారంభించాడు. తాజాగా, పారాలింపిక్స్‌లో సత్తా చాటి దేశ పతాకను రెపరెపలాడించాడు.   

Updated Date - 2021-08-30T00:50:01+05:30 IST