Advertisement
Advertisement
Abn logo
Advertisement

HYD : విగ్రహాల నిమజ్జనంలో అంతా అయోమయం.. గందరగోళం.. ప్రభుత్వ వర్గాల విఫలం..!

హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్‌ : ట్యాంక్‌బండ్‌ పై నుంచి పీఓపీ విగ్రహాల నిమజ్జనం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయం తెలియక... ఆదివారం ఎంతో మంది నగరవాసులు ఇళ్లలోని విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు హుస్సేన్‌సాగర్‌కు వచ్చి క్రేన్లు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. మట్టి గణపతుల కోసం ఎన్టీఆర్‌ మార్గంలో 2 క్రేన్లను అమర్చారు. చిన్న పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి పీవీ నర్సింహారావు మార్గం జలవిహార్‌ సమీపంలో బేబీ పాండ్‌ను సిద్ధం చేశారు. అక్కడ మాత్రమే వాటిని వేయాలనే నిబంధన పెట్టడంతో చిన్న విగ్రహాలతో వచ్చిన వందలాది మంది అటువైపు వెళ్లారు. దీంతో అక్కడ క్రేన్‌ అవసరం ఏర్పడడంతో ఎన్టీఆర్‌ మార్గంలో ఉన్న 2 క్రేన్లలో ఒకదాన్ని అక్కడకు తరలించారు. మరో క్రేన్‌ పనిచేయకపోవడంతో ఎన్టీఆర్‌ మార్గంలో వినాయక విగ్రహాల నిమజ్జనం నిలిచిపోయింది.

ప్రచారం చేయడంలో విఫలం..

కోర్టు తీర్పు నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌లో పీఓపీ విగ్రహాల నిమజ్జనం నిలిపివేస్తున్నట్లు ప్రజలను చైతన్య పరచడంలో ప్రభుత్వ వర్గాలు విఫలమయ్యాయి. హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు అది కోర్టు వరకు చేరి తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు నిమజ్జనాలపై ఎలాంటి చర్యలూ తీసుకోవపోవడంతో వందలాది మంది అటు ట్యాంక్‌బండ్‌, ఇటు ఎన్టీఆర్‌ మార్గాల్లోకి వినాయక విగ్రహాలతో వచ్చి వెనుదిరగాల్సి వస్తోంది. వాహనాల్లో తెలుగుతల్లి చౌరస్తా నుంచి యూటర్న్‌ తీసుకొని నెక్లెస్‌రోడ్‌లోని బేబీ పాండ్‌కు వెళ్లాల్సి వస్తోంది. నెక్లెస్‌రోడ్‌లో ఆదివారం రాత్రి వరకు తీవ్రమైన ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.

Advertisement
Advertisement