Abn logo
Sep 15 2021 @ 07:24AM

హైకోర్టు తీర్పు ఇచ్చినా సాగర్‌లోనే నిమజ్జనం..!

హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్‌ : ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వినాయక విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని హైకోర్టు తీర్పు ఇచ్చినా కొన్ని నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ఇళ్లు, కార్యాలయాల్లో పూజలు చేసిన పీఓపీ విగ్రహాలను కొందరు సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగాలు కేవలం మట్టి గణపతులను మాత్రమే సాగర్‌లో నిమజ్జనం చేయాలని సూచిస్తూ ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌లపై క్రేన్లను అందుబాటులో పెట్టలేదు. జలవిహార్‌ సమీపంలో ఉన్న బేబీ పాండ్‌లో మాత్రమే పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయాలని ఏర్పాట్లు చేయగా అక్కడ విపరీతమైన రద్దీ ఉంటోంది.

దీంతో చాలామంది ట్యాంక్‌బండ్‌ పై నుంచి, ఎన్టీఆర్‌ మార్గంలో ఫుట్‌పాత్‌ పై నుంచి చిన్నపాటి పీఓపీ వినాయక విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేస్తున్నారు. కొందరు యువకులు డబ్బులు తీసుకుని వాటిని సాగర్‌లో వదులుతున్నారు. ప్రజల సెంటిమెంట్‌ పేరుతో పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బేబీపాండ్‌ వద్దకు వెళ్లాలని ఒక్కోసారి పోలీసులు సూచిస్తున్నా ఎవరూ పాటించడం లేదు. ఐదో రోజున పెద్ద ఎత్తున విగ్రహాలు నిమజ్జనానికి వచ్చాయి. ఇందులో ఎక్కువగా 4 అడుగుల లోపు మాత్రమే ఉన్నాయి. రాబోయే రోజుల్లో అధికారులు నిమజ్జన ఏర్పాట్లు ఎలా చేస్తారో వేచిచూడాల్సిందే.