ఈ సారైనా వివక్ష వీడాలి...

ABN , First Publish Date - 2022-01-22T04:34:26+05:30 IST

ఈ సారైనా వివక్ష వీడాలి...

ఈ సారైనా వివక్ష వీడాలి...
మీడియా సమావేశంలో పాల్గొన్న వినయభాస్కర్‌, నరేందర్‌

 రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు సముచిత స్థానం కల్పించాలి

 లేకుంటే ఆందోళనలు చేస్తాం

 ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయభాస్కర్‌, ఎమ్మెల్యే నరేందర్‌

హనుమకొండ టౌన్‌, జనవరి 21: వచ్చే మాసంలో జరిగే కేంద్ర బడ్జెట్‌ సమావేశాల్లో రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు సముచిత స్థానం కల్పించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించి పంపిన నూతన రైల్వే లైన్లకు నిధులు కేటాయించాలని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయభాస్కర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం హనుమకొండలోని స్వాగత్‌ గ్రాండ్‌ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వినయభాస్కర్‌ మాట్లాడారు. 

తెలంగాణకు నూతన రైల్వే లైన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఉండి ఎందుకు స్పందించడం లేదన్నారు. తెలంగాణ పట్ల ప్రధాని మోదీ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘సంపద పెంచు.. పేదలకు పంచు’ అనే విధంగా పాలన సాగిస్తుంటే.. ప్రధాని మోదీ మాత్రం కార్పొరేట్‌ సంస్థలకు దేశ సంపదను ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. కాజీపేటకు రావాల్సిన కోచ్‌ ఫ్యాక్టరీని కాంగ్రెస్‌ పంజాబ్‌కు, బీజేపీ మహారాష్ట్రకు తరలించుకుపోయారని వినయభాస్కర్‌ విమర్శించారు. వ్యాగన్‌ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించడం లేదని, కాజీపేటను డివిజన్‌ చేసే విషయంలో కేంద్రం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని ఆయన దుయ్యపట్టారు. తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల విషయంలో, కాజీపేట స్టేషన్‌ అభివృద్ధి విషయంలో బడ్జెట్‌లో సముచిత స్థానం కల్పించకుంటే ఆందోళన చేస్తామని వినయభాస్కర్‌ హెచ్చరించారు. 

తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఏడేళ్లలో తెలంగాణకు నూతనంగా ఒక్క రైల్వే లైన్‌ ఇవ్వలేదన్నారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ విషయం, డివిజన్‌ హోదాను కేంద్రం బుట్ట దాఖలు చేసిందన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుంటే ఈ ప్రాంత బీజేపీ నేతలు గడ్డిపీకుతున్నారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే విభజన చట్టంలో పేర్కొన్న హామీలు నెరవేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అభివృద్ధిని గాలికి వదిలిన బీజేపీ.. బ్యాంగిల్స్‌ జనతా పార్టీగా మారిందని నరేందర్‌ ఎద్దేవా చేశారు. ఈ విలేకర్ల సమావేశంలో అజీజ్‌ఖాన్‌, పులి రజనీకాంత్‌, వీరేందర్‌, జనార్ధన్‌గౌడ్‌, సుహాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-22T04:34:26+05:30 IST