వినరా ‘అన్నమయ్య’ వ్యథ!

ABN , First Publish Date - 2022-03-11T08:09:56+05:30 IST

వినరా ‘అన్నమయ్య’ వ్యథ!

వినరా ‘అన్నమయ్య’ వ్యథ!

గూడుకు నోచని బాధితులు

వరద ముంచెత్తి నాలుగు నెలలు

ఇంకా అమలుకాని జగన్‌ 5 లక్షల హామీ

జీవో రాలేదని పనులు ఆపిన అధికారులు

ఎండకు ప్లాస్టిక్‌ పట్టాల గుడారాల్లో నరకం

రాళ్లగుట్టలు, దిబ్బల్లో పాముల భయం 

అయినా..అక్కడే తలదాచుకున్న దైన్యం

అన్నమయ్య బాధితుల అవస్థలపై 

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం


బీభత్సం రేపి వరద వెళ్లిపోయింది. అయినా.. వాళ్ల బతుకులు  వరద వదిలిపెట్టిన దగ్గరే ఇప్పటికీ ఆగిపోయాయి. పక్కా గూడు హామీ ఇచ్చి..తాత్కాలిక గుడారాల్లో వదిలిపోయిన ప్రభుత్వం మళ్లీ వాళ్ల ముఖం చూడలేదు. దీంతో అన్నమయ్య వరద బాధితులకు ఇదిగో ఇలా ఎండవేడికి ఉడికిపోయే ప్లాస్టిక్‌ పట్టాలే గుడారం..రాళ్లూరప్పలే నేల.. చిరిగిన చీరే ఆచ్ఛాదనయ్యాయి.   


(కడప-ఆంధ్రజ్యోతి)

కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి ఉప్పెనలా చెయ్యేరు వరద ముంచేసిన బాధితులను ఆదుకుంటానని, పక్కా ఇంటి నిర్మాణానికి రూ. ఐదు లక్షలు చొప్పున అందిస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చి ఇప్పటికి నాలుగు నెలలు! అయితే.. ఇంకా ఉత్తర్వులు రాకపోవడంతో ఆ హామీ బాధితుల పాలిట ఎండమావే అయింది. ఉత్తర్వుల కోసం అధికారుల ఎదురుచూపులతో నిర్మాణాలు ఇంకా మొదలుకాలేదు. జీవో వస్తుందని కొన్నిచోట్ల పునాదులు తీసి.. ఆ తర్వాత వదిలేసి పోయారు. దీంతో వరద మిగిల్చిన రాళ్ల కుప్పలు, ఇసుక దిబ్బల మధ్యనే బాధితులు తాత్కాలిక గుడారాల్లో తల దాచుకుంటున్నారు. వాటిని ప్లాస్టిక్‌ పట్టలతో వేసుకోవడంతో ఎండ వేడికి ఈ గుడారాల కింద నరకం అనుభవిస్తున్నారు. పగలు మండుటెండలు.. రాత్రుళ్లు విషకీటకాల భయం వేధిస్తోంది. మరో రెండు నెలల్లో మొదలయ్యే వర్షాకాలంలో తమ పరిస్థితి ఏమిటని బాధితులు మరింత బెంగపడుతున్నారు. ఈ నేపథ్యంలో చెయ్యే రు వరద బాధితుల కన్నీటి వ్యథలపై ప్రత్యేక కథనం.


కరువు సీమలో చెయ్యేరు నదీతీర పల్లెలు కోనసీమను తలపించేవి. పచ్చని వరి పైరు.. మామిడి, అరటి, సపోటా వంటి పండ్ల తోటలు.. పాడిధారలతో నిత్యం కళకళలాడే ఈ పల్లెలను వరద ముంచెత్తింది. గత ఏడాది నవంబరు 19న అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఉవ్వెత్తున ఎగసిన వరద పులపత్తూరు, తొగూరుపేట, రామచంద్రాపురం, మందపల్లె తదితర గ్రామాలను ముంచేసింది. ఆవాసం ఇచ్చిన ఇళ్లు ఈ వరదకు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. ఇంట్లో సామగ్రి సైతం వరదపాలై సర్వం కోల్పోయిన అభాగ్యులు రోడ్డున పడ్డారు. వరద తగ్గిన తర్వాత సీఎం జగన్‌ ముంపు గ్రామాల్లో పర్యటించారు. రెండు నెలల్లో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. సీఎం హామీ కావడంతో అధికారులు ఓ వారం పది రోజులు హడావిడి చేసి ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఒక్కొక్కరికి ఐదు సెంట్ల స్థలం కేటాయించారు. లేఅవుట్లు వేశారు. రూ.1.80 లక్షలతో ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు నాలుగు నెలలు గడిచిపోయాయి. ఉత్తర్వులు రాకపోవడంతో పునాదులు తవ్వి వదిలేశారు. కొన్ని ఇళ్లకు పునాదులు కూడా తీయలేదు. 


రాజంపేట మండలం పులపత్తూరు, తొగూరుపేట, గండ్లూరు, రామచంద్రాపురం, మందపల్లె, శేషమాంబపురం, తాళ్లపాక, ఆర్‌.బుడుగుంటపల్లె గ్రామాలలో 404, నందలూరులో ఐదు ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఐదు లేఅవుట్లలో పక్కా ఇళ్ల నిర్మాణాలకు గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వరద బాధితులను గుర్తించి లేఅవుట్లలో ఒక్కొక్కరికి ఐదు సెంట్ల స్థలం పట్టా ఇచ్చారు. ఇంటి నిర్మాణం యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలు. ‘వరదకు సర్వం కోల్పోయాం.. మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు.. అప్పు చేసి ఇళ్లు కట్టుకోలేం’’ అని తమ గ్రామానికి వచ్చి న సీఎం జగన్‌తో బాధితులు మొరపెట్టుకున్నారు. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇస్తుందని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. పనులు చేస్తామని ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు కూడా సిమెంట్‌, ఇనుము ధరలు పెరగడంతో చేతులెత్తేశారు. యూనిట్‌ విలువ రూ.5 లక్షలకు పెంచాలని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి.. సీఎం జగన్‌కు విన్నవించారు. రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నానని, రెండు మూడు రోజుల్లో జీవో కూడా వస్తుందని హామీ ఇచ్చారు. నెలలు గడిచిపోయినా జీఓ రాలేదు. దీంతో పునాదులతోనే ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి.


ఆ 611 ఇళ్ల మాటేమిటి?

అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి రాజంపేట, నందలూరు మండలాల్లో 409 ఇళ్లు కుప్పకూలాయి. అదే నెలలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో మరో 202 ఇళ్లు పూర్తిగా పడిపోయాయి. వరద ఇళ్లకు యూనిట్‌ రూ.5 లక్షలు ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. చెయ్యేరు వరద ముంచిన ఇళ్లకు మాత్రమే రూ.5 లక్షలు మంజూరు చేస్తారా..? వరద, అధిక వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్న 611 ఇళ్లకు మంజూరు చేస్తారా..? అన్నది ప్రశ్నగా మిగిలింది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చి వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. 


గూడు చెదిరి బతుకు ఛిద్రం

పులపత్తూరు, తొగూరుపేట, రామచంద్రాపురం గ్రామాల్లో వరదకు కొట్టుకుపోయిన ఇంటి శిథిలాలను చదును చేసి ప్లాస్టిక్‌ పట్టలతో గుడారాలు వేసుకుని బాధితులు జీవనం సాగిస్తున్నారు. పెరుగుతున్న ఎండలతో ప్లాస్టిక్‌ పట్టల వేడికి వృద్ధులు, పిల్లలు, బాలింతలు అవస్థలు పడుతున్నారు. పులపత్తూరు బాధితులకు బతుకు మరింత దుర్భరంగా మారింది. దాతలు ఇచ్చిన తిండి సరుకులు తరిగిపోతుంటే.. రేపు ఎలా..? అన్న భయంతో బతుకుబండి లాగిస్తున్నారు.ప్రభుత్వం వెంటనే ఇళ్లు నిర్మించి ఇస్తే ఇబ్బందులు తీరుతాయని కోరుతున్నారు.


మా కష్టాలు పగోడికి కూడా రాకూడదయ్యా..!

‘‘మా ఇంట్లో ఐదుగురం ఉంటున్నాం. అన్నమయ్య ప్రాజె క్టు తెగిపోయి.. ఉప్పెనలా వచ్చిన చెయ్యేరు వరదకు మా ఇల్లు ఆనవాలు కూడా లేకుండా కొట్టుకుపోయింది. ప్రభుత్వం ఇల్లు కట్టిస్తామని 5 సెంట్లు స్థలం ఇచ్చింది. కానీ పునాదులు కూడా వేయలేదు. ప్లాస్టిక్‌ పట్టలతో వేసుకున్న గుడారాల్లో మండుటెండలకు దుర్భరంగా బతుకున్నాం. మా కష్టాలు పగోడికి కూడా రాకూడదయ్యా..! ప్రభుత్వం తక్షణమే మాకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి’’ 

- ఒంటిమిట్ట నర్సమ్మ, పులపత్తూరు


నీడను వెతుక్కుంటున్నాం 

‘‘మాయదారి వరద మా ఇంటి ని రాళ్ల కుప్పగా మార్చింది. రూ.లక్షలు నష్టపోయాం. ప్లాస్టిక్‌ పట్టలతో గుడారాలు వేసుకొని ఆరుగురం బతుకీడుస్తున్నాం. మధ్యాహ్నం ఎక్కడ నీడ కనిపిస్తే అక్కడికి పరుగులు పెడుతున్నాం’’ 

- ఈతమాపురం లక్ష్మీదేవి, పులపత్తూరు


పునాది తవ్వి వదిలేశారు

‘‘ఇంట్లో ఆరుగురు ఉన్నాం. గుడారాల్లో ఎండ వేడికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్ల శిథిలాల మధ్య నుంచి విషకీటకాలు వస్తున్నాయి. ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పింది. నెలలు గడిచినా పునాది కూడా వేయలేదు. వరదలో చిక్కుకున్న 25 మందిని కాపాడిన మా అన్న వరదకు కొట్టుకుపోయి చనిపోయాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి’’

- చంద్ర పల్లం, పులపత్తూరు


చిన్న గుడారంలో 8 మందిమి ఉన్నాం

‘‘నాలుగు నెలలుగా చలి గాలులకు.. మండుటెండలకు గుడారాల్లో పడుతున్న అవస్థలు ఎన్నో. గాలులకు గుడారం పట్టలు లేచిపోతే మళ్లీ వేసుకోవాలి. ఆరేడు అడుగుల గుడారంలో ఎనిమిది మంది కాలం వెళ్లదీస్తున్నాం. ఇంటి నిర్మాణం దిశగా చర్యలు లేవు’’ 

- అవసాని వెంకటరమణ, పులపత్తూరు


ఉత్తర్వులు రాగానే పనులు చేపడతాం 

‘‘వరద బాధితుల ఇళ్ల యూనిట్‌ విలువ రూ.5 లక్షలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. కానీ, ఉత్తర్వులు రాలేదు. దీంతో పనులు ఆగిన మాట నిజమే. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే పనులు మొదలు పెడతాం’’

- కృష్ణయ్య, పీడీ, గృహ నిర్మాణ శాఖ, కడప


Updated Date - 2022-03-11T08:09:56+05:30 IST