పోరాటాలతో మోదీని సాగనంపాలి

ABN , First Publish Date - 2021-10-28T06:49:12+05:30 IST

రైతాంగ పోరాటాల ద్వారా కేంద్రంలోని బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ కార్యదర్శి విమలక్క పిలుపునిచ్చారు.

పోరాటాలతో మోదీని సాగనంపాలి

రైతు కూలీ సంఘం మహాసభలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ కార్యదర్శి విమలక్క
అమరవీరుల స్తూపం వద్ద నివాళులు
జగ్గంపేట, అక్టోబరు 27 : రైతాంగ పోరాటాల ద్వారా కేంద్రంలోని బీజేపీని, ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ కార్యదర్శి విమలక్క పిలుపునిచ్చారు. ఏపీ రైతుకూలీ సంఘం జిల్లా మహాసభలు జగ్గంపేటలోని ట్రావెలర్స్‌ బంగ్లాలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రమేష్‌ అధ్యక్షతన బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశానికి జీవనాధారమైన వ్యవసాయ రంగం పట్ల కేంద్రం ద్రోహపూరిత విధానాలతో వ్యవహరిస్తోందని విమర్శించారు. శిశుపాలుడు వంద తప్పులు చేసినట్టుగానే మోదీ చేసిన తప్పులకు రోజులు దగ్గర పడ్డా యన్నారు. భూసంస్కరణల చట్టం ద్వారా మిగులు తేలిన భూములు ఇప్పటికీ భూస్వాముల చేతుల్లోనే ఉన్నాయన్నారు. 1990 తర్వాత వ్యవసాయంలో వచ్చిన సంస్కరణల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కేంద్రం తయారు చేసిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నా మోదీ ప్రభుత్వానికి చీమ కుట్టి నట్టు లేదన్నారు. పైగా ఆందోళనకారులపై కాన్వాయ్‌ ఎక్కించి ప్రాణాలు తీసుకుందని మండిపడ్డారు. హోంమంత్రి అమిత్‌ షా అహంకారం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. తక్షణమే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశా రు. తెలుగు రాష్ట్రాల్లో లక్షల కోట్లు అప్పులు చేసి, ప్రజలపై భారాన్ని మోపుతున్నారని మండిపడ్డారు. పెట్రోలు, డీజిల్‌ ధర లు కొండెక్కిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో రైతులు, కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా గ్రామాలను ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. బి.బాబూరావు, కె.దుర్గారావు, పి.దివ్య, ఆర్‌.సతీష్‌, రాజబాబులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T06:49:12+05:30 IST