ఊరూరా సారా గబ్బు!

ABN , First Publish Date - 2022-03-21T05:34:46+05:30 IST

జిల్లా మరో జంగారెడ్డిగూడెం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే విచ్చల విడితనం కొనసాగితే నాటు సారా మరణాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది.

ఊరూరా సారా గబ్బు!
సంగం మండలం పెరమనలో సెబ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న నాటు సారా, బెల్లపు ఊట డ్రమ్ములు (ఫైల్‌)

విచ్చలవిడిగా నాటు తయారీ, విక్రయాలు

ఏరులై ప్రవహిస్తున్న అక్రమ మద్యం

మరో జంగారెడ్డిగూడెంలా మారనున్న జిల్లా

ప్రభుత్వ వైఖరి, విధానాలే కారణం

స్పందించకుంటే తప్పదు ప్రాణనష్టం


నెల్లూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : 

జిల్లా మరో జంగారెడ్డిగూడెం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే విచ్చల విడితనం కొనసాగితే నాటు సారా మరణాలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. గతంలో ఎన్నికల సం దర్భంగా ఒకరిద్దరు నాయకులు పంచిన కల్తీ మద్యంతో మరణాలను చవిచూచిన జిల్లా ఇప్పుడు ఊరూరా తయారవుతున్న నాటుసారా, పక్కరాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జిల్లాకు చేరుతున్న అక్రమ మద్యం జిల్లా ప్రజలను పొట్టనపెట్టుకోనుంది.


ఊరూరా వాసన 

సీతారామపురం మండలం చింతోడు, పబ్బులే టిపల్లి, దేవరమ్మ చెరువు, వేంపల్లితోక, రాగిమానుదిన్నె ప్రాంతాల్లో నాటుసారా విక్రయాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి నాటు సారా దిగుమతి అవుతోంది. స్థానికంగా అటవీ ప్రాంతాల్లో యథేచ్ఛగా సారా కాస్తున్నారు. 

అల్లూరు మండలంలో పలు చోట్ల మద్యం అమ్మకా లు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా బయటి జిల్లాల నుంచి సారా సరఫరా అవుతోంది. 

ఉదయగిరి మండలం ఆర్లపడియ, పుల్లాయపల్లి, ఉదయగిరి దుర్గం తదితర అటవీ ప్రాంతాల్లో నాటుసారా కాచి  విక్రయిస్తున్నారు. 

అనంతసాగరం మండలం చిలకమర్రి, ఎగువపల్లి గ్రామాల్లో  నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ లీటరు సారా రేటు రూ.800 నుంచి 1000 వరకు అమ్ముతున్నారు. 

పొదలకూరు మండలం బ్రాహ్మణపల్లి, బిరుదవోలు, మర్రిపల్లి, చెన్నారెడ్డిపల్లె గ్రామాల్లో నాటుసారా తయారు చేసి బయటి ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇక్కడ లీటరు ధర రూ. 500లు.

కోట మండలంలోని మెట్ట గ్రామాలకు ప్రకాశం జిల్లా నుంచి క్యాన్లలో సారా సరఫరా అవుతోంది. 

దగదర్తి మండలం చెన్నూరులోని చింతకుంట చెరువు, దండిగం, బొడగుడిపాడు అటవీ ప్రాంతాల్లోనూ, ఉలవపాళ్ల, మనుబోలుపాడు, తిరిగివీధిపాడుల్లో విచ్చలవి డిగా సారా తయారీ చేస్తున్నారు. ఈ మండలంలో సారా తయారీ  ఉపాధిగా మారింది.

సంగం మండలం పెరమన గ్రామానికి చెందిన కొంతమంది సమీప అటవీ ప్రాంతంలో సారా తయారు చేసి చుట్టుపక్కల గ్రామాల్లో విక్రయిస్తున్నారు. 

ఏఎస్‌పేట మండలం గుడిపాడు సమీపంలోని వాగుల్లో నాటు సారా తయారీ జోరుగా సాగుతోంది. పోలీ సులు పలుసార్లు దాడులు చేసినా ప్రయోజనం  లేకుండా పోయింది.

డక్కిలి మండలం డీ వడ్డిపల్లి, దేవులపల్లి, కలుజు గుంట ప్రాంతాల్లోనూ, వెలుగొండ  ప్రాంతాల్లో గుట్టుచప్పు డు కాకుండా నాటుసారా తయారవుతున్నట్లు సమా చారం. ఇక్కడి నుంచి రాపూరు, సైదాపురం, పొదలకూరు మండలాలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. 

కావలి మండలం అన్నగారిపాలెం, తుమ్మలపెంట, బోగోలు మండలం తిప్ప పరిసర ప్రాంతాల్లో నాటుసారా ను తయారు చేస్తున్నారు.


 ప్రభుత్వ విధానాలే కారణం

జిల్లాలో నాటుసారా తయారీ, అక్రమ మద్యం విచ్చల విడిగా చెలామణి అవుతోందంటే అందుకు ప్రధాన కారణం ప్రభుత్వ విధానాలే.  మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నప్పుడు జిల్లాలో నాటుసారా, అక్రమ మద్యం జాడ కనిపించేది కాదు. మద్యం దుకాణదారులు వారివారి ప్రాంతాల్లో  సారా, అక్రమ మద్యంపై నిఘా ఉంచేవారు. ఏదైనా సమాచారం అందితే వెంటనే ఎక్సైజ్‌ అధికారులకు తెలియజేసేవారు. ఎక్సైజ్‌ అధికారులు  కూడా వేగంగా  స్పందించేవారు. ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యాపారంలోకి దిగడంతో నాటుతయారీ సమాచారం అందించేవారే కరువయ్యారు. ఒకవేళ అందిం చినా ఎక్సైజ్‌ అధికారులు గతంలో లాగా స్పందించడం లేదు. కారణం ప్రభుత్వ మద్యం దుకాణాల వల్ల వీరికి ప్రత్యేకంగా ఒరిగేది ఏమిలేదు. 


ధరలు పెరగడమే కారణం 

ఊరూరా నాటు సారా తయారీకి మరో ప్రధాన కారణం మద్యం రేట్లు పెరగడమే. మూడు నెలల క్రితం వరకు చీప్‌ క్వార్టర్‌ రూ. 350లు. ఈ డబ్బు పెడితే రెండు క్వార్టర్ల నాటు దొరుకడంతో మందుబాబులు సారా కోసం ఎగబడుతున్నారు. పైగా రాష్ట్ర మద్యం తాగితే ఏమౌతా మో అనే భయం మరో వైపు. మందుబాబులు ఎవరైనా ఆసుపత్రికి వెళితే....మందు మానండి...ఒకవేళ సాధ్యం కాకుంటే మన స్టేట్‌ మందు తాగొద్దండి...పక్క రాష్ట్రాల మందు తాగండి.. అని సలహా ఇస్తున్నారు. మన రాష్ట్ర బ్రాండ్లు అంత భయంకరంగా ఉన్నాయనే భావన మందు బాబుల్లో బలంగా నాటుకుపోవడంతో కుదిరితే నాటు లేదంటే...పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన మందు తాగుతు న్నారు. ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా మద్యం అమ్మకాలను పెంచడానికి విచలవిడిగా బెల్టుషాపులకు పచ్చజెండా ఊపింది. 


ఏమైనా జరగవచ్చు..

జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 25  మంది  వర కూ మరణించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఏ క్షణ మైనా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం లేకపో లేదు. ఎందుకంటే జిల్లాలో నాటుసారా, అక్రమ మద్యం అంత విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. సెబ్‌ అధికారులు మూడు నెలల కాలంలో అక్రమ మద్యానికి సంబంధించి 469 కేసులు నమోదు చేసి, 377 మందిని అరెస్టు చేశా రంటే పరిస్థితి ఎంత  తీవ్రంగా ఉందో, సారా, అక్రమ మ ద్యం రూపంలో ఎంత ప్రమాదం ముంచుకురాబోతుందో ఊహించుకోవచ్చు. జనవరి నుంచి మార్చి 13వ తేదీ వరకు నాటు సారా తయారీ, అమ్మకాలకు సంబంధించి 171 కేసులు నమోదయ్యాయి. 60 మందిని అరెస్టు చేశా రు. 521 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 60,380 లీటర్ల సారా ఊట ధ్వసం చేశారు. నాన్‌ డ్యూటీ పైయిడ్‌ లిక్కర్‌ విషయానికి వస్తే 629 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని 18మందిని అరెస్టు చేశారు. నాటుసారా, అక్రమ మద్యం ఎంత ప్రమాదకరమో జిల్లా ప్రజలు ఇదివరకే చూశారు. వీటి తయారీలో ఎక్కడ పొరపాటు జరిగినా ప్రాణ నష్టం తప్పదు. 


ప్రభుత్వం కళ్లు తెరవాలి 

 కేవలం దాడులతో మాత్రమే నాటు సారా, అక్రమ మద్యానికి కళ్లెం వేయడం సాధ్యం కాదని గుర్తించాలి. ముందు ప్రభుత్వ మద్యంలో నాణ్యత పెంచడం, ధరలు తగ్గించడం, విచ్చలవిడి బెల్టుషాపులను కట్టడి చేయడం ద్వారానే పరిస్థితిని చక్కదిద్దగలమేనే సత్యాన్ని ప్రభుత్వం గ్రహించాలి. లేని పక్షంలో ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోక తప్పదు. 

Updated Date - 2022-03-21T05:34:46+05:30 IST