పల్లెలపై రియల్‌ పంజా

ABN , First Publish Date - 2022-01-28T05:45:29+05:30 IST

పల్లెలపై రియల్‌ పంజా

పల్లెలపై రియల్‌ పంజా

ప్లాట్లుగా మారుతున్న సాగు భూములు

విచ్చలవిడిగా వెంచర్‌లు, ఫాం హౌస్‌లు

నిబంధనలు గాలికొదిలి రూ.కోట్లలో వ్యాపారం

పట్టించుకోని అధికారులు


గీసుగొండ, జనవరి 27: వరంగల్‌ మహానగర శివారులో రియల్‌ దందా జోరుగా సాగుతోంది. నిబందనలను గాలికొదిలి  ఇష్టానుసారంగా వెంచర్లు చేస్తూ అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ‘కుడా’ అధికారులు మాత్రం  కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్‌ ఆజంజాహి మిల్లు గ్రౌండ్‌లో జిల్లా కలెక్టరేట్‌ను నిర్మిస్తారనే ప్రకట నల రావటంతో ఒక్కసారిగా గీసుకొండ మండలంలో రియల్‌ భూమ్‌ ఊపం దుకుంది. దీనికి తోడు శాయంపేటహవేలి -స్టేషన్‌చింతలపల్లి సమీపంలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో ఇప్పటికే రెండు కంపెనీలు పరిశ్రమలను నిర్మిస్తున్నాయి. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు.. ధర్మారం నుంచి గంగదే విపల్లి వరకు అధిక ధరలకు భూములను కొనుగోలు చేసి వెంచర్లు చేస్తు న్నారు. అప్పట్లో మొగిలిచర్ల సమీపంలో కలెక్టరేట్‌ ఏర్పడబోతుందని ప్రచారం జరగడంతో ఆ ప్రాంతంలోనూ గుట్టుచపుడు కాకుండా పెద్దఎత్తున రూ.100కోట్ల వరకు భూముల కొనుగోళ్లు జరిగాయి. అయితే కొద్ది నెలలు స్తబ్ధుగా ఉన్న భూముల కొనుగోళ్లు..  జిల్లా కేంద్రం ఏర్పాటుపై స్పష్టత రావటంతో మళ్లీ ఊపందుకున్నాయి. 


ప్రధాన రహదారుల విస్తరణతో నగర శివారు కీర్తినగర్‌ క్రాస్‌ నుంచి గీసు గొండ వరకు నగర వాతావరణాన్ని తలపిస్తోంది. జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ధర్మారం-జాన్‌పాక, స్తంభంపల్లి, కొనాయిమాకుల, వంచనగిరి, ఊకల్‌, గీసుగొండ, గంగదేవిపల్లి, మచ్చాపురం. కొమ్మాల వరకు సుమారు 100వరకు వెంచర్లు వెలిశాయి. ధర్మారం నుంచి కొనాయిమాకుల వరకు వరంగల్‌- నర్సం పేట ప్రధాన రహదారిలో గతంలో ఎకరం రూ.కోటిన్నర ఉండగా ఇపుడు రూ.3కోట్లు పలుకుతోంది. ఊకల్‌-చింతలపల్లి మధ్యలో రూ.70లక్షల వరకు ఉండగా, ఇపుడు కోటిన్నరకు చేరుకుందని రియల్‌ వ్యాపారులు చెబుతున్నా రు. ధర్మారంనుంచి గీసుగొండ వరకు ప్రధాన రోడ్డుకు పక్కన గజానికి రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. లోపలికి వెళితే గజం రూ.5 నుంచి రూ.15 వేల వరకు ప్లాట్లు అమ్ముడవుతున్నాయి. ఈ ప్రాం తాల్లోని వెంచర్లలో గజం రూ.3 నుంచి రూ.5వేల మధ్య ఉందని అంటున్నారు. 

  

 నేషనల్‌ గ్రీన్‌ హైవే ప్రతిపాదనతో..

కాగా ఇటీవల దామెర క్రాస్‌ రోడ్డు, మొగిలిచర్ల, బొడ్డుచింతపల్లి, మను గొండ, రాంపురం, గంగదేవిపల్లి మీదుగా 225ఫీట్ల వెడల్పుతో నేషనల్‌ గ్రీన్‌ హైవేకు సర్వే చేసి హద్దులు నిర్ణయించారు. దీనిపై నేషనల్‌ హైవే అథారిటీ గెజిట్‌ను కూడా విడుదల చేయటంతో ఒక్కసారిగా రియల్‌ వ్యాపారుల దృష్టి అటువైపు మళ్లింది. గతంలో ఈ ప్రాంతంలో ఎకరానికి రూ.30లక్షలు ఉండగా ఇప్పుడు రూ.కోటికి చేరింది. కాగా వరంగల్‌-నర్సంపేట రహదారిలో కొనుగోలు చేయటం కంటే ఇక్కడే అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రాం తాల్లో బీటీ లింక్‌ రోడ్లు ఉండటంతో వ్యాపారస్థులు మరింత ఆసక్తి చూపుతు న్నారు. ఇటీవల గంగదేవిపల్లి, మనుగొండ, రాంపురం మధ్యలో ప్రతిపాదిత హైవేకు సమీపంలో కొనుగోల్లు జోరుగా సాగుతున్నాయి. నగరంలోని కొందరు బడా వ్యాపారులు ఇప్పటికే ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసి ఫాంహౌస్‌లుగా మార్చుకుంటున్నారు. 


రెండు వెంచర్లకు మాత్రమే అనుమతులు

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వెంచర్లలో నిబంధనల ప్రకారం 40ఫీట్ల రోడ్లు, డ్రెయినేజీలు, పార్కు, విద్యుత్‌ సౌకర్యం వంటివి తప్పనిసరిగా ఉండాలి. కానీ కొందరు వ్యాపారులు కేవలం భూమిని చదును చేసి ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. కొనుగోలుదా రులకు అమ్మే సమయంలో రోడ్లు, విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని నమ్మబలికి ఆ తర్వాత పట్టించుకోవటం లేదని కొనుగోలుదారులు వాపోతున్నారు. కొన్నిచో ట్ల ‘కుడా’ లేవుట్‌ అప్రూవల్‌ లేకున్నా ఉందంటూ కొనుగోలుదారులను మభ్య పెడుతున్నారు. ఇప్పటివరకు మండలంలో రెండు వెంచర్లకు మాత్రమే ‘కుడా’ అనుమతులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొందరు రియల్‌ వ్యాపా రులు ‘కుడా’, జీపీ, నాలా అనుమతులు ఏవి లేకుండానే ప్లాట్లు చేసి విక్రయి స్తున్నారు. ఇటీవల కొనాయిమాకులతోని ఓ వెంచర్‌లో ఆర్చి గేటు నిర్మి స్తుండగా ఓ కూలీ విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందాడు. ‘కుడా’ నిబం ధనలకు విరుద్ధంగా వెంచర్‌ చుట్టూ రోడ్లను బ్లాక్‌ చేస్తున్నారు.  


నాలా లేకుండానే అమ్మకాలు

ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్లకు అనుమతివ్వకపోవడంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొత్తమార్గాన్ని ఎంచుకుంటున్నారు. నాన్‌ అగ్రికల్చరల్‌ లాండ్‌ (నాలా)గా మార్చకుండానే ప్లాట్లు చేసి అగ్రికల్చర్‌ లాండ్‌గానే అమ్ముతు న్నారు. అయితే ఇలాంటి వెంచర్లలో స్థానిక సర్పంచ్‌లు, అధికారులు రియల్‌ వ్యాపారులు కుమ్మక్కవుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. వరంగల్‌ - నర్సంపేట రోడ్డుకు ఆనుకొని ఉన్న గ్రామాల సర్పంచ్‌లకు ఈ వెంచర్‌లతో కాసులపంట పండుతుందని స్థానికులు అంటున్నారు. ఒక ఎకరంలో పాట్లు చేస్తే రూ.5లక్షల వరకు సర్పంచ్‌లు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. పంచా యతీరాజ్‌ అధికారులు ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నట్లు ఆరోప ణలు వినిపిస్తున్నాయి. 


తగ్గుతున్న సాగు విస్తీర్ణం

గీసుగొండ మండల పరిధిలో సుమారు 20వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం ఉండగా, అది క్రమంగా తగ్గిపోతుంది. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ల ఏర్పాటుతో సుమారు 3వేల ఎకరాల వరకు సాగు విస్తీర్ణం తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. 


Updated Date - 2022-01-28T05:45:29+05:30 IST