ప్రగతి లేని పల్లెలు!

ABN , First Publish Date - 2022-05-18T09:37:21+05:30 IST

హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మకూర్‌ గ్రామ జనాభా 2800. పల్లె ప్రగతి కార్యక్రం కింద ప్రధానంగా చేపట్టాల్సిన డ్రైనేజీ పనులు మొదలే కాలేదు.

ప్రగతి లేని పల్లెలు!

  • గత 4 విడతల్లో పల్లె ప్రగతి అంతంతే
  • ఊర్లలో అవే సమస్యలు, అసంపూర్తిగా పనులు
  • కనీస సదుపాయాలకు నోచుకోని ప్రజలు
  • ప్రత్యేక నిధుల్లేకనే అభివృద్ధి శూన్యం
  • మే 20 నుంచి జూన్‌ 5 వరకు ఐదో విడత
  • ఈసారైనా సమస్యలు పరిష్కారమయ్యేనా? 


( హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మకూర్‌ గ్రామ జనాభా 2800. పల్లె ప్రగతి కార్యక్రం కింద ప్రధానంగా చేపట్టాల్సిన డ్రైనేజీ పనులు మొదలే కాలేదు. ఎస్సీ, గౌండ్ల, యాదవ కాలనీల్లో మురుగు కాల్వలు లేవు.వర్షం పడితే నీళ్లన్నీ ఇళ్లలోకి వస్తున్నాయి. వైకుంఠదామం ఏర్పాటు చేసినా దహన వాటికను నిర్మించలేదు. డంపింగ్‌ యార్డూ అసంపూర్తిగా మిగిలిపోయింది.  ప్రకృతి వనాన్ని గ్రామం మధ్యలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్థలంలో కాకుండా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. ఇందులో అప్పటికే ప్రాధమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని నిర్మించారు. ఇప్పుడు ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఆడుకునేందుకు మైదానం లేకుండా పోయింది. ఊర్లో తాగునీటి సౌకర్యం లేదు. బిల్లులు రాలేదని మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్లు పనులను సగంలోనే నిలిపేశారు.  


ఇలా రాష్ట్రంలో పలు గ్రామంలో చూసినా పల్లె ప్రగతి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పట్టణాలకు దీటుగా పల్లెలను తీర్చిదిద్దాలన్న లక్ష్యం చాలా చోట్ల నెరవేరడం లేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు చేపట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో పచ్చదనం మెరుగుపర్చడం మినహా ప్రజలకు సౌకర్యాలను కల్పించే దిశగా అభివృద్ధి పనులపై ఏమాత్రం దృష్టిసారించ లేదు. గత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు ఫొటోలు దిగడం వంటి ప్రచార ఆర్భాటాలతోనే సరిపెట్టారనే విమర్శలున్నాయి. చాలా గ్రామాల్లో డ్రైనీజీ, విద్యుత్తు, తాగునీటి సమస్యలు తీరడం లేదని.. సీసీ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై   దృష్టి సారించడం లేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటిదాకా రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో నాలుగు విడతల్లో పల్లె ప్రగతి పనులు చేపట్టినా పనులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయిదో విడత పల్లె ప్రగతి పనులు మే 20 నుంచి జూన్‌ 5 వరకు నిర్వహించేందుకు సంబంధిత విభాగాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పల్లెల్లో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించింది. లక్ష్యానికి అనుగుణంగా ఇంకుడు గుంతల నిర్మాణ్నాన  పూర్తి చేయలేదు.


శిథిలావస్థకు చేరి, ప్రమాదకరంగా పరిణమించిన ఇళ్లను కూల్చడం లేదు. స్థలాల కొరత, స్థల వివాదాల కారణంగా చాలా చోట్ల డంపింగ్‌ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు పూర్తి కాలేదు. ఇంటింటికీ చెత్త ేసకరణ, చెత్తను వేరుచేయడం, ఎరువుగా మార్చడం వంటివి అమలుకు నోచుకోవడం లేదు. గ్రామాల్లో విద్యుత్తు తీగలు ప్రమాదకర స్థితిలో వేలాడుతున్నాయి. ఇంకొన్నిచోట్ల విద్యుత్తు స్తంభాలు ఓవైపు ఒరిగిపోయి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. తీగలను సరిచేసి, స్తంభాలను సరిచేయడమో, మార్చడమో చేయాలి. కొత్తగా ఏర్పడిన కాలనీలు, ఊరికి దూరంగా ఉన్న కాలనీల్లో విద్యుత్తు సమస్యకు తగిన పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. 


రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులివ్వాలి

ఉపాధి హామీ పథకం, 15వ ఆర్థిక సం ఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతోనే ప్రభుత్వం పల్లె ప్రగతి పనులను చేపడుతోంది. గ్రామ పంచాయతీలకు సాధారణంగా ఇచ్చే నిధులతోనే తప్ప ఈ కార్యక్రమం నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించడం లేదని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. గతంలో ఆర్థిక సంఘం నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు 50 శాతం, జిల్లా పరిషత్‌లకు 30 శాతం, మండల పరిషత్‌లకు 20 శాతం నిధులు వచ్చేవని, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక గ్రామ పంచాయతీలకు ప్రతినెలా ఇచ్చే సాధారణ నిధుల్లో సగం విద్యుత్తు బిల్లుల పేరిట ప్రభుత్వం కోత విధిస్తోంది. మిగిలిన నిధులు మల్టీపర్పస్‌ వర్కర్లకు వేతనాలు, చెత్త సేకరణ, డంపింగ్‌ యార్డు, ట్రాక్టర్ల నిర్వహణకు సరిపోవడం లేదు. గ్రామాల్లో మురుగు కాల్వల మరమ్మతు, ఇతర చిన్నపాటి అభివృద్ధి పనులు కూడా చేపట్టే అవకాశం తమకు లేకుండా పోయిందని కొందరు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదో విడత పల్లె ప్రగతిలోనైనా అభివృద్ధి పనులు చేపట్టేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని,  గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. 


జిల్లాల వారీగా గ్రామాల్లో సమస్యలు ఇలా.. 

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌లో డ్రైనేజీ సమస్య ఉంది. మురుగునీరు గ్రామ శివారుల్లోకి చేరి కుంటలను తలపిస్తోంది. వివాదం కారణంగా వైకుంఠ ధామం నిర్మాణం పూర్తికాలేదు. శిథిలావస్థకు చేరిన ఇళ్ల కూల్చివేతపై దృష్టి పెట్టలేదు. 


ఖమ్మం జిల్లా జగ్గారం గ్రామ పంచాయతీ పరిధిలోని వేంకటేశ్వరపురం జగ్గారం గ్రామాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ నీళ్ళతో మడుగులను తలపిస్తున్నాయి. వెంకటేశ్వరపురం గ్రామంలో గత వానాకాలంలో మలేరియా డెంగీ, కరోనా కారణంగా నెల వ్యవధిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు.  

ఆదిలాబాద్‌ జిల్లాలో కొత్తగా ఏర్పడిన డోర్లి గ్రామ పంచాయతీ పరిధిలో సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులున్నాయి.   గ్రామంలో బహిరంగ మల విసర్జన చేస్తుండటంతో పరిసరాలు కంపుకొడుతున్నాయి.

ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలోని గుండాల పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర కనీస సౌకర్యాల్లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఆ ఊర్లలో సరైన రోడ్లు లేవు. మండల కేంద్రానికి రావాలంటే రొంపల్లి వరకు కాలినడకన రావాల్సిందే. ఆరోగ్య ఉప కేంద్ర భవనం లేకపోవడంతో వైద్య ేసవలు అందడం లేదు.

మంచిర్యాల జిల్లా లింగాపూర్‌ు పంచాయతీ పరిధిలోని బిల్కగూడలో మిషన్‌ భగీరథ పథకం అమలు జరగలేదు. తాగునీరుకు చేతి పంపులే దిక్కవుతున్నాయి. అర్హులకు ఆసరా పింఛన్లు లేవు.  

సంగారెడ్డి జిల్లా... కోహిర్‌ మండలం గుర్జువాడలో ఇళ్లమధ్య ఉన్న పాడుబడ్డ బావిని మూయించాలని నిర్ణయించినా అది అమలు కావడం లేదు. గ్రామంలో పాత విద్యుత్తు స్తంభాలతో ప్రమాద పరిస్థితులున్నాయి. ఇళ్లపై వేలాడుతున్న కరెంటు తీగల వల్ల వర్షాకాలంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. 

జగిత్యాల జిల్లాలోని అల్యానాయక్‌ తండాకు వెళ్లే ప్రధాన దారిలో వీధి దీపాల్లేవు. మురుగు కాల్వలను నిర్మించకపోవడంతో మురికి నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. సొంత భవనంలేకపోవడంతో గ్రామ పంచాయతీ కర్యాలయం అంగన్వాడీ భవనంలోనే కొనసాగుతోంది. 

గద్వాల జిల్లాలోని కేటిదొడ్డి మండలం కేంద్రంలో చాలా చోట్ల విద్యుత్తు తీగలు ఇళ్లపై ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. మిద్దెలమీదికి వెళ్లాలంటే జనం భయపడుతున్నారు.   

నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల్‌లో ఎస్సీ, బీసీ కాలనీల్లో డ్రైనేజీ కాల్వల నిర్మాణాల్లేని కారణంగా ఇళ్ల ముందే మురుగునీరు పారుతోంది. గ్రామంలో  సీసీ రోడ్లు వేయలేదు విద్యుత్తు లైన్ల మరమ్మతులు లేకపోవడంతో ఇళ్లపై వేలాడే తీగలతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.   


ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే 

పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన జరగడం లేదు. ఉపాధి హామీ, 15 ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు తప్ప పల్లెప్రగతికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇవ్వడం లేదు. ఆ నిధుల ఖర్చుకు సంబంధించి సమగ్ర లెక్కలు కూడా లేవు. ఇది ఒకరంగా దోపిడీ లాంటిదే.. పల్లె ప్రగతి ద్వారా ప్రచార ఆర్భాటం తప్ప సామాన్యులకు ప్రయోజనం కనిపించడం లేదు.

- రాజేంద్రప్రసాద్‌ యాదవ్‌, జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు


పల్లె దవాఖానాలు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె దవాఖానాలను ఏర్పాటు చేయాలి. గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన, సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీల నిర్మాణం, విద్యుత్తు సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలి. ఈసారి పల్లె ప్రగతిలో భాగంగా అర్హులైన పేదలందరికీ రేషన్‌ కార్డులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు కొత్త పింఛను అందించాలి. గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు, ఇతరం అంశాలపై దృష్టి సారించాలి. 

- సుర్వియాదయ్య గౌడ్‌, సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Updated Date - 2022-05-18T09:37:21+05:30 IST