అష్ట దిగ్బంధనం నుంచి గ్రామాలకు సడలింపు?

ABN , First Publish Date - 2020-04-11T00:43:18+05:30 IST

మహమ్మారిపై పోరాటంలో భాగంగా అమలవుతున్న అష్ట దిగ్బంధనం ఈ నెల

అష్ట దిగ్బంధనం నుంచి గ్రామాలకు సడలింపు?

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా అమలవుతున్న అష్ట దిగ్బంధనం ఈ నెల 14తో ముగుస్తుందా? ఒడిశా, ఉత్తరాఖండ్, తెలంగాణా వంటి రాష్ట్రాలు దీనిని పొడిగించాలని కోరుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది?  పంట కోతల సమయం కావడంతో గ్రామీణ ప్రాంతాలకు సడలింపు ఉంటుందా?


ఈ ప్రశ్నలకు జవాబులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ముఖ్యమంత్రులతో నిర్వహించే వీడియో కాన్ఫరెన్సింగ్ తర్వాత లభించవచ్చు. ఈ సమావేశం అనంతరం అష్ట దిగ్బంధనం కొనసాగింపుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. 


ప్రభుత్వ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం పట్టణాల్లో కట్టుదిట్టంగా అష్ట దిగ్బంధనం అమలు చేస్తూ, గ్రామీణ ప్రాంతాలకు దశలవారీగా సడలింపు ఇవ్వబోతున్నట్లు తెలిసింది. పంట కోతల సమయం, పంటలను అమ్ముకునే సమయం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలతో అష్ట దిగ్బంధనాన్ని సడలించాలని భావిస్తున్నట్లు సమాచారం. 


వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల్లో ప్రజలు పరస్పర దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీని కోసం పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రతిపాదించిన విధానాన్ని పరిశీలిస్తోంది. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తీసుకురావడానికి తేదీలను ప్రకటించాలన్నది సింగ్ ప్రతిపాదన. రైతులను బృందాలుగా విభజించి, ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క రోజు చొప్పున కేటాయించాలని భావిస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఒకేసారి మార్కెట్లలో గుమిగూడే అవకాశం ఉండదు. మరోవైపు మార్కెట్లకు వచ్చినవారిని నిబంధనల ప్రకారం దూరం పాటించేలా చేయడం సులువవుతుంది. 


ఈ విధంగా ప్రతి జిల్లాకు ప్రణాళికను రూపొందించి, పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ముఖ్యంగా పంట కోతలు, హైవేలపై రవాణా వాహనాల ప్రయాణాలకు అష్ట దిగ్బంధనం నుంచి మినహాయింపు లభించే అవకాశం కనిపిస్తోంది. 


ప్రధాన మంత్రి వద్ద ప్రధాన కార్యదర్శి పీ కే మిశ్రా నేతృత్వంలో సాధికార బృందం సమావేశం శుక్రవారం కోవిడ్-19 సంక్షోభంపై చర్చించింది. వలస కార్మికులు, నిరాశ్రయుల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలను అధికారులు చర్చించారు. 


గ్రామీణ ప్రాంతాలను అష్ట దిగ్బంధనం నుంచి మినహాయించి, పట్టణ ప్రాంతాల్లో కట్టుదిట్టంగా అమలు చేయడంపై సమాలోచనలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2020-04-11T00:43:18+05:30 IST