రోడ్లకు పగుళ్లు .. గోడలకు బీటలు

ABN , First Publish Date - 2020-05-23T09:48:11+05:30 IST

గ్రామాల మీదుగా ఇసుకను తరలిస్తున్న భారీ వాహనాలు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. సా

రోడ్లకు పగుళ్లు .. గోడలకు బీటలు

ఇసుక లారీలతో ఇబ్బంది పడుతున్న గ్రామీణులు


గద్వాల, మే 22 ( ఆంధ్రజ్యోతి) :  గ్రామాల మీదుగా ఇసుకను తరలిస్తున్న భారీ వాహనాలు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. సామర్థ్యం తక్కువగా ఉండే పల్లె రోడ్లపై భారీ వాహనాలు తిరుగుతుండడంతో అవి ధ్వంసమై కుంగిపోతున్నాయి. గ్రామాల్లో ఇళ్లు బీటలు వారుతున్నాయి. 


తుమ్మిళ ఇసుక రీచ్‌ నుంచి..

తుంగభద్ర నదిలో తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌ఎండీసీ (తెలంగాణ మినరరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ద్వారా ఇసుక అమ్మకాలను చేపట్టింది. ప్రభుత్వ ఖజానాకు, ఇసుక తవ్వకాలు చేపట్టిన కాంట్రాక్టర్‌కు, ఇసుక అమ్ముకుంటున్న కాంట్రాక్టర్లకు భారీగా లాభాలు వస్తున్నాయి. కానీ తుంగభద్ర సమీప గ్రామాల ప్రజలకు కష్టమొచ్చిపడింది. పగలంతా కష్టపడి, నిద్ర పోయే సమయానికి ఇసుకను తరలించే 16, 12 టన్నుల భారీ వాహనాల శబ్దం వారికి నిద్రను దూరం చేస్తోంది. . 


ఇబ్బంది పడుతున్న గ్రామాలు ఇవే..

రాజోలి, వడ్డేపల్లి, మానవపాడు మండలాల్లోని తుమ్మిళ్ల, పెద్ద తాండ్రపాడు, ముళ్లదిన్నె, కొంకల, జూలకల్‌ శాంతినగర్‌, కలుగొండ్ల, అమరవాయి, మానవపాడు గ్రామాల మీదుగా ఇసుక తరలించే భారీ టిప్పర్లు జాతీయ రహదారిపైకి చేరుకుంటాయి. ఆయా గ్రామాల పరిధిలో దాదాపు 20 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతింటున్నాయి.


24 గంటలు వాహనాల రాకపోకలు సాగుతుండడంతో రహదారి పక్కనున్న ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. అదే విధంగా చిన్న ధన్‌వాడ రీచ్‌ నుంచి రోజుకు మూడు వందలపైగా ట్రాక్టర్లు ఆయా గ్రామాల మీదుగా ఇసుక రవాణా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంకలతో పాటు అయిజ మండలంలోని చాల గ్రామాల ప్రజలు వాహనాలను అడ్డుకొని నిరసన తెలుపుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Updated Date - 2020-05-23T09:48:11+05:30 IST