బుద్ధారంలో విషాదం

ABN , First Publish Date - 2020-10-27T10:56:59+05:30 IST

దసరా ముందు రోజే గ్రామంలో ఆరుగురు మృతి చెందడంతో వనపర్తి జిల్లా బుద్దారంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

బుద్ధారంలో విషాదం

ఒకే కుటుంబంలో ఐదుగురి మరణంతో శోకసంద్రంలో గ్రామస్థులు

దసరా పండుగను వాయిదా వేసుకుని అంత్యక్రియలు

అదే రోజు మరో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత

కుటుంబసభ్యులను పరామర్శించిన పలువురు ప్రముఖులు


వనపర్తి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : దసరా ముందు రోజే గ్రామంలో ఆరుగురు మృతి చెందడంతో వనపర్తి జిల్లా బుద్దారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రతీ ఏటా దసరా వేడుకులను ఈ గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, శనివారం రాత్రి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఇల్లు కూలి మృతి చెందగా, అదే గ్రామ పంచాయతీ పరిధిలోని పాటిగడ్డతండాకు చెందిన గోవింద్‌ అనే మరో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పండుగను వాయిదా వేశారు. 


ముఖ్యంగా శనివారం అర్ధరాత్రి గ్రామంలోని చెవ్వ మణెమ్మకె చెందిన మట్టి మిద్దె కూలడంతో ఆమెతోపాటు ఇద్దరు కోడళ్లు, ఇద్దరు మనుమరాళ్లు మృతి చెందడంతో గ్రామస్థులంతా కన్నీటిపర్యంతమయ్యారు. అర్ధరాత్రి విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు ఆ ఇంటికి చేరుకుని మట్టి శిథిలాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. గాయపడ్డ కుమారస్వామిని మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. దసరా పండుగను వాయిదా వేసి, వారి అంత్యక్రియాల్లో పాల్గొని శోకసంద్రంలో మునిగిపోయారు. బుద్దారం చెరువు వద్ద ముగ్గురు పెద్ద వారిని దహనం చేయగా, వైష్ణవి, అక్షయ మృతదేహాలను ఖననం చేశారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి నిరంజన్‌రెడ్డి గ్రామానికి చేరుకుని, దుర్ఘటన తీరును తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పి, ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే మాజీ మంత్రి చిన్నారెడ్డి గ్రామానికి వెళ్లి బాధితులను ఓదార్చారు.


టీడీపీ నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ అధ్యక్షుడు బి.రాములు తదితరులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి డి.చంద్రయ్య, కార్యవర్గ సభ్యులు జె.చంద్రయ్య, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కళావతమ్మ, తదితరులు మృతుల కుటుంబ సభ్యులను పరమార్శించారు. బాధిత కుటుంబబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - 2020-10-27T10:56:59+05:30 IST