Viral Video: ఆ గ్రామస్తులకు విసుగొచ్చి.. దున్నపోతుతో రిబ్బన్ కట్ చేయించి మరీ వినూత్నంగా నిరసన!

ABN , First Publish Date - 2022-07-21T19:39:49+05:30 IST

దున్నపోతు మీద వాన కురిసినా వాటికి ఏమీ పట్టదు. అలాగే ఎన్నికలు పూర్తయ్యాక కొంత మంది రాజకీయనాయకుల వైఖరీ, ప్రభుత్వ అధికారుల పని తీరూ ఇలానే ఉంటుంది. అటువంటి ప్రభుత్వ పెద్దల పనిత

Viral Video: ఆ గ్రామస్తులకు విసుగొచ్చి.. దున్నపోతుతో రిబ్బన్ కట్ చేయించి మరీ వినూత్నంగా నిరసన!

ఇంటర్నెట్ డెస్క్: దున్నపోతు మీద వాన కురిసినా వాటికి ఏమీ పట్టదు. అలాగే ఎన్నికలు పూర్తయ్యాక కొంత మంది రాజకీయనాయకుల వైఖరీ, ప్రభుత్వ అధికారుల పని తీరూ ఇలానే ఉంటుంది. అటువంటి ప్రభుత్వ పెద్దల పనితనం పట్ల ఓ గ్రామ ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఓ దున్నపోతు (Buffalo)తో బస్ షెల్టర్‌‌కు రిబ్బన్ కట్ చేయించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ హాట్ టాపిక్‌కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


కర్ణాటకలోని గడగ్ జిల్లా బాలెహుసుర్ గ్రామంలో సుమారు 40ఏళ్ల క్రితం నిర్మించిన బస్ షెల్టర్.. శిథిలావస్థకు చేరుకుని కొన్నేళ్ల క్రితం ధ్వంసం అయింది. దీంతో ఆ ప్రాంతం అంతా డంప్ యార్డ్‌గా మారిపోయింది. అయితే.. స్కూలుకు, కాలేజీకి వెళ్లే పిల్లలకు బస్‌ షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో ప్రయాణికుల కష్టాలు వర్ణాతీతం. ఈ క్రమంలోనే గ్రామ ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తలాకొంత డబ్బులు వేసుకుని కొబ్బరి మట్టలతో తాత్కాలికంగా బస్ షెల్టర్‌ను నిర్మించారు. అలా నిర్మించిన బస్ షెల్టర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దున్నపోతును ముఖ్య అథితిగా తీసుకెళ్లి.. దానితో రిబ్బన్ కట్ చేయించారు.





అంతేకాకుండా ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్థానిక  MLA, MPకి ఎన్నిసార్లు తమ సమస్య గురించి వివరించినా పట్టించుకోలేదని వాపోయారు. ప్రభుత్వ అధికారుల వైఖరీ అలానే ఉందని అసహనం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగానే ఈ పని చేసినట్టు వెల్లడించారు. అయితే ఈ విషయంపై స్థఆనిక ఎమ్మెల్యే రామప్ప లమని స్పందించారు. సమస్య గురించి కానీ.. బస్ షెల్టర్ ప్రారంభోత్సవం గురించి కానీ తనకు తెలియదన్నారు. అయితే.. ఆ గ్రామస్తుల సమస్య తెలుసుకుని సమస్య పరిష్కరిస్తానన్నారు. కొత్త బస్ షెల్టర్ నిర్మాణానికి కావాల్సిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. 


Updated Date - 2022-07-21T19:39:49+05:30 IST