మా ఊరికి రావొద్దు!

ABN , First Publish Date - 2020-03-25T09:28:41+05:30 IST

కరోనా కట్టడికి ఊళ్లకు ఊళ్లే ఏకమై స్వీయ చర్యలు తీసుకుంటున్నాయి. బయటి వ్యక్తులెవరూ ఊళ్లోకి అడుగు పెట్టకుండా ఊరు చుట్టూ...

మా ఊరికి రావొద్దు!

కర్రలతో ‘కరోనా’కు అడ్డుకట్టలు.. సరిహద్దులు మూసేస్తున్న గ్రామాలు


  • బయటి వ్యక్తులను రానివ్వొద్దని తీర్మానాలు
  • పొలిమేరల్లో సొంత చెక్‌పోస్టులూ ఏర్పాటు
  • అనంత, పశ్చిమ, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో చర్యలు 


(న్యూస్‌నెట్‌వర్క్‌-ఆంధ్రజ్యోతి) : కరోనా కట్టడికి ఊళ్లకు ఊళ్లే ఏకమై స్వీయ చర్యలు తీసుకుంటున్నాయి. బయటి వ్యక్తులెవరూ ఊళ్లోకి అడుగు పెట్టకుండా ఊరు చుట్టూ కంచెలు వేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం కోయఅంకంపాలెం గ్రామంలోకి ఇతరులెవరినీ రానీయకూడదని గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామ సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. అలాగే, రెడ్డిగణపవరం గ్రామస్థులు జల్లేరువాగుపై వంతెనను మూసివేసి తెలంగాణ వాసులు ఇటువైపు రాకుండా చేశారు. ముంపు మండలాల్లో ఒకటైన కుక్కునూరులోనూ సరిహద్దులను మూసివేశారు. జీలుగుమిల్లి మండలం లంకపల్లి గ్రామంలోనూ ఇదే పరిస్థితి.


తాళ్లపూడి మండలం రావూరుపాడు గ్రామస్తులు సరిహద్దుల్లో ముళ్ల కంచెను వేశారు. అలాగే, శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గొండ్యాలపుట్టుగ సరిహద్దులో రోడ్డుకు అడ్డంగా కర్రలు కట్టి దారి మూసేశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని దండోరా వేయించారు. ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాం వాసులు గ్రామంలోకి రాకపోకలు నిషేధిస్తూ పొలిమేరల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గొట్టిపల్లి గ్రామానికి రెండు వైపులా రహదారిని ముళ్ల కంపలు, ట్రాక్టర్‌ పనిముట్లు, కర్రలతో మూసివేశారు. ఇదే మండలంలో చందక, వేములవలస గ్రామాల ప్రజలూ ఇలాగే చేశారు. ఏజెన్సీలోని డుంబ్రిగుడ మండలం కొల్లాపుట్టు పంచాయతీ పరిధిలోని నాలుగు గ్రామాల గిరిజనులు ముళ్ల కంచెలు, చెట్ల కొమ్మలు, రాళ్లు అడ్డంగా పెట్టి గ్రామాలకు వచ్చే దారులను మూసివేశారు. ఈ పంచాయతీ పరిధిలోని మునిగుడ గ్రామస్తుడు హైదరాబాద్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఇటీవల సొంతూరు వచ్చాడు. జ్వరం, దగ్గు, ఆయాసంతో అరకు ఏరియా ఆస్పత్రికి వెళ్లగా కరోనా లక్షణాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. దీంతో కొల్లాపుట్టు, కొత్తవలస, కొర్రాయ్‌, గుంజరిగుడ గ్రామాల ప్రజలు ఈ నెలాఖరు వరకు బయట నుంచి ఎవరినీ గ్రామాల్లోకి రానివ్వొద్దని తీర్మానించా రు. కొయ్యూరు మండలంలోని ఆరు గ్రామాల ప్రజలు కూడా రహదారులు మూసివేశారు. ఎస్‌.రాయవరం మండలం ఉప్పరాపల్లి గ్రామస్తులు సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు చేసుకున్నారు. విశాఖ నగరంలోని దయాళ్‌నగర్‌వాసులు తమ కాలనీలోకి ఇతరులు రాకుండా గేట్లు మూసివేశారు. అనంతపురం జిల్లాలో మాజీ డీజీపీ జేవీ రాముడు స్వగ్రామం నార్సింపల్లిలోనూ రోడ్లకు అడ్డుగా కంప వేశారు. 


అధికారులే గ్రామ సరిహద్దును మూసేశారు..

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురంలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో పొరుగునున్న కృష్ణాజిల్లా చాట్రాయి మండలం సరిహద్దు రోడ్లను ఎంపీడీవో నాగేశ్వరరావు, తహశీల్దార్‌ జనార్దనరావు, ఎస్సై శివనారాయణ దగ్గరుండి మూసివేయించారు.  అలాగే, చిన్నంపేట, కోటపాడు, చీపురుగూడెం పర్వతాపురం ప్రజలు తమ గ్రామాల్లోకి ఎవ్వరూ రాకుండా దారిని తాటి దుంగలు, ముళ్లకంపతో మూసేశారు.


Updated Date - 2020-03-25T09:28:41+05:30 IST